నీరొక్కటే చాలదు సుమా..!

Water And Food Awareness in Summer - Sakshi

వేసవిలో శరీరానికి తగిన మోతాదులో లవణాలు అవసరం

శీతలపానీయాలొద్దు

ఓఆర్‌ఎస్‌ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

సాక్షి సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపొతున్నాయి. వడగాల్పులూ తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతున్నా దాహం తీరడం లేదు. వృత్తి రీత్యా బయట తిరిగే వారి శరీరానికి సరిపడా ద్రవాలు అందక పోతే వడదెబ్బ తగిలే ముప్పు ఉంది. వైద్య నిపుణులు మాత్రం నీళ్లు ఒక్కటే వడ దెబ్బ నుంచి కాపాడలేవంటున్నారు. నీటితోపాటు తగిన మోతాదులో సోడియం, పొటాషియం లాంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.

సోడియం ఎందుకు అందించాలంటే..
ఎండలోకి వెళ్లినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి నుంచి కాపాడి శరీరాన్ని సమతుల్యం చేసేందుకు చెమట బయటకు వస్తుంది. అదే పనిగా శరీరం చెమట రూపంలో నీరు బయటకు పోతే నిర్జలీకరణ(డీహ్రైడేషన్‌)కు గురై వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే శరీరం నుంచి పోయే నీళ్లు, సోడియం, పొటాషియం ఎప్పటికప్పుడు తిరిగి అందిస్తుండాలి.

అదే పనిగా నీళ్లు వద్దు
ఎండా కాలంలో కొందరు అదే పనిగా నీళ్లు తాగుతుంటారు. ఒక్క నీళ్లు మాత్రమే ఎక్కువసార్లు తాగితే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. దీంతో కండరాలు పట్టేసి వడదెబ్బకు దారి తీస్తుంది.

శీతలపానీయాలతో దెబ్బే.. 
శీతలపానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. 300ఎంఎల్‌ల శీతలపానీయంలో 30 గ్రాములు చక్కెర ఉంటుంది. లవణాలు ఉండవు. చక్కెర వల్ల ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒంట్లో నీరంతా పోతుంది. చల్లగా ఉందని బీరు తాగేవారు అది ఆల్కహాల్‌ అని మరువద్దు. దీంతో నీరు ఎక్కువ శరీరం నుంచి బయటికి వెళ్తుంది.

వృద్ధులు, పిల్లలు ఏం తాగాలంటే..
వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణీలు తొందరగా వడదెబ్బకు గురవుతారు. బయటికి వెళ్లాల్సి వస్తే దాహం లేకపోయినా ఖనిజలవణాలతో ఉన్న ద్రవాలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం రెండు గ్లాసులు తీసుకోవాలి.

ఇంట్లోనే ఓఆర్‌ఎస్‌ తయారీ..
ఓరల్‌ రీహ్రైడేషన్‌ సొల్యూషన్‌(ఓఆర్‌ఎస్‌) ద్రావణాన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లీటరు మంచి నీటిలో ఆరు చెంచాల చక్కెర, సగం చెంచా ఉప్పు కలిపితే అదే ఓఆర్‌ఎస్‌. దీన్నే క్యాన్‌లో నింపి తరచూ తాగుతుండాలి.

బయట నీటితో జాగ్రత్త
దాహం వేస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టమే. ఐఎస్‌ఐ మార్కు, సీళ్లు, తయారు తేదీ చూసుకొని కొనాలి. కలుషిత నీళ్లు కారణంగా అతిసారం, కామెర్లు, డయేరియా వంటి వ్యాధుల ముప్పు ఉంది.

దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే...
అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక, మతిమరుపు సమస్యలకు తీసుకునే మందులు డీహైడ్రేషన్‌కు గురి చేస్తాయి. వైద్యులను సంప్రదించి వీరు మందులు తీసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top