నాసా పోటీలకు వరంగల్‌ విద్యార్థులు

Warangal students for NASA competitions

చంద్రుడిపై వాడే రోవర్‌ తయారీ పోటీలకు ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పోటీలు

దేశవ్యాప్తంగా కేవలం నాలుగు బృందాలు ఎంపిక

హైదరాబాద్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహిస్తున్న ‘హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ చాలెంజ్‌’ఫైనల్స్‌కు వరంగల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థుల బృందం ఎంపికైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలో జరగనున్న 5వ వార్షిక నాసా రోవర్‌ చాలెంజ్‌లో ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన వీరంతా పాల్గొననున్నారు. చంద్రుడిపై సురక్షితంగా మానవులు తిరిగేందుకు రోవర్‌ డిజైన్‌ను తయారు చేసి, నివేదిక అందించడంలో అనేక దశలు దాటుకుని వీరు ఈ స్థాయికి చేరుకున్నారని ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం గురువారం తెలిపింది. ‘వేరే గ్రహంపై తిరుగాడేందుకు అనువైన వాహనాన్ని తయారు చేయాలని ప్రతిష్టాత్మక నాసా చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల నుంచి పోటీ పడగా, దేశం మొత్తం మీద 4 బృందాలు ఎంపికయ్యాయి. ’అని పేర్కొంది.

తమ కాలేజీ అధ్యాపకుడు మనోజ్‌ చౌదరి నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో విద్యార్థులు పాల్‌ వినీత్, ప్రకాశ్‌ రాయినేని, శ్రవణ్‌రావు, దిలీప్‌రెడ్డి, స్నేహ ఉన్నారని ఎస్‌ఆర్‌ కాలేజీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు అమెరికాలో హూస్టన్‌ విల్లేలోని అలబామా యూనివర్సిటీలో జరిగే నాసా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారితో పాటు తమ విద్యార్థులు చంద్రుడిపై తిరిగేందుకు అనువైన రోవర్‌ను డిజైన్‌ చేసి తయారు చేస్తారని పేర్కొంది. ‘ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రోవర్లను తయారు చేసేందుకు లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా రోవర్‌ ఈ చాలెంజ్‌లో విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’అని విద్యార్థులు పేర్కొన్నారు. అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై ప్రతి ఐదేళ్లకోసారి నాసా హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ చాలెంజ్‌ పోటీలను నిర్వహిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top