అడ్వెంచర్‌ క్యాపిటలిస్టులు కావాలి

Want adventure capitalists - Sakshi - Sakshi

‘రోడ్‌ టూ జీఈఎస్‌’లో మంత్రి కేటీఆర్‌

కొంగొత్త ప్రమాణాలు నెలకొల్పేలా ఎదగాలి

స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కార మార్గాలు

సాక్షి, హైదరాబాద్‌/బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా స్టార్టప్‌ సంస్థలకు ఊతమిచ్చేందుకు వెంచర్‌ క్యాపిటలిస్టులు కాకుండా అడ్వెంచర్‌ క్యాపిటలిస్టులు అవసరమని ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. మిగ తా దేశాలతో పోలిస్తే భారత్‌లో సమస్యల తీరు భిన్నంగా ఉంటుందని, వీటికి పరిష్కార మార్గాలు కూడా స్థానికంగానే ఉండాలని  తెలిపారు. ఈ దిశగా ప్రయత్నం చేసే దేశీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సాహసోపే తంగా వ్యవహరించే ఇన్వెస్టర్లు కావాలని మంత్రి పేర్కొన్నారు.

హైటెక్స్‌లో జరిగిన రోడ్‌ టూ గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘లాస్‌ఏంజెలిస్‌లోనూ, బార్సెలోనాలోనూ ఉండే సమస్యలకు కనుగొనే పరిష్కార మార్గా లు భారత్‌లో పనిచేయవు. ఇక్కడ సమస్యలు వేరుగా ఉంటాయి. ఇందుకు మన సొంత పరిష్కార మార్గాలే ఉపయోగపడతాయి. ఇందుకోసం కృషి చేసే సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మరింతగా ముందుకు రావాలి. వెంచర్‌ క్యాపిటలిస్టుల్లాగా కాకుండా అడ్వెంచర్‌ క్యాపిటలిస్టులై ఉండాలి. భారత వృద్ధి అవకాశాలపై ధీమాగా ఉన్న వారు ముందుకు రావాలి‘ అని అన్నారు.  

కొత్త ఐడియాలతో ఉన్నతస్థాయికి..
భారత్‌ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. అభివృద్ధి దిశగా బుడిబుడి నడకలు కాకుండా ఒకేసారి పోల్‌వాల్ట్‌ చేయాలని చెప్పారు. అలాగే మిగతా దేశాల్లోని ఉత్తమ విధానాలను పాటించడంతో సరిపెట్టుకోకుండా.. కొంగొత్త ప్రమాణాలను నెలకొల్పే విధంగా భారత్‌ ఎదగాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఈ దశాబ్దం, శతాబ్దం భారత్‌దేనని వ్యాఖ్యానించారు. వినూత్న ఆవిష్కరణలు, కొత్త ఐడియాలు దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలవని ఆయన చెప్పారు. ఐటీ ఇంజనీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌  సదస్సులో పాల్గొన్నారు.  

టెక్నాలజీతో పరిష్కారాలు
బాలకార్మిక వ్యవస్థ తదితర సామాజిక సమస్యలకు టెక్నాలజీతో తగు పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి అభిప్రాయపడ్డారు. ఆధునిక టెక్నాలజీ ప్రజల జీవనోపాధి స్వరూపాన్ని మార్చగలదని, సమాజంలో సానుకూల మార్పులు తేగలదని ఆయన పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యా వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టి సారించాల న్నారు. పౌష్టికాహార లోపంతో మరణించే బాలల సంఖ్య గణనీయంగా ఉంటున్న నేపథ్యంలో వైద్యం, ఆరోగ్యం అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాల్సి ఉందన్నారు. సమాజంలో పెరిగిపోతున్న అసహన ధోరణులను నియంత్రించేందుకు టెక్నాలజీని సముచితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

టీ–హబ్, మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం
స్టార్టప్‌ సంస్థలకు తోడ్పాటునిచ్చే దిశగా టీ–హబ్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా స్టార్టప్‌ సంస్థల కోసం యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టీ–హబ్‌ సీఈవో జయ్‌ కృష్ణన్‌ తెలిపారు. 90 రోజుల పాటు సాగే ఈ ప్రోగ్రాం కింద.. వృద్ధి దశలోని స్టార్టప్‌ సంస్థలకు టెక్నాలజీపరమైన సాయంతో పాటు నిపుణులు తగు సలహాలు, సూచనలు చేస్తారని ఆయన వివరించారు.

వందలాది దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన పది స్టార్టప్స్‌కి మాత్రమే యాక్సిలరేటర్‌లో భాగమయ్యే అవకాశం లభిస్తుందన్నారు. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రాంకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు. యాక్సిలరేటర్‌లో ప్రధానంగా హెల్త్‌టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, రవాణా తదితర రంగాల స్టార్టప్‌ సంస్థలపై దృష్టి పెట్టనున్నట్లు కృష్ణన్‌ వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top