కులగణన తప్పుల తడక

Voter List Failures In Khammam For Municipal Elections - Sakshi

కులాలను మార్చిన మున్సిపల్‌ ఓటర్ల జాబితా..

ఒకే ఇంటి నంబర్‌పై రెండు చోట్లా ఓట్లు

వార్డుల రిజర్వేషన్‌పై ప్రభావం చూపుతుందని పార్టీల ఆందోళన

సాక్షి, సత్తుపల్లి: మున్సిపల్‌ ఎన్నికల కోసం ఇంటింటికీ తిరిగి చేసిన కులగణన తప్పుల తడకలా మారింది. ఒక్క కుటుంబంలోనే సభ్యులది ఒక్కో కులంగా మారిపోయింది. తండ్రిది ఒక కులం.. కొడుకుది మరో కులం.. భార్యది ఒక కులం.. భర్తది మరో కులం.. ఇలా తప్పుల జాబితా చాంతాడును తలపిస్తోంది. అంతేకాక ఒకే ఇంటి నంబర్‌పై రెండు చోట్ల ఓట్లు ఉండడం ఓటర్లను అయోమయానికి గురిచేస్తోంది. నంబర్‌ 760లో పోతిరెడ్డిపల్లి శ్రీను బీసీ అయితే.. భార్య సంధ్య ఓసీగా 20వ వార్డు ఓటర్ల జాబితాలో పేరుంది. నంబర్‌ 39లో అల్లు అనిత భర్త పేరు రాఘవరెడ్డి(ఓసీ) అయితే బీసీ అని వచ్చింది. నంబర్‌ 578లో పొనగళ్ల వెంకట్రావ్‌(బీసీ గౌడ) అయితే.. ఓసీ అని ఓటర్ల జాబితాలో ప్రచురితమైంది. ఇవేకాక.. ఒకే ఓటు పలు వార్డుల్లో దర్శనమిచ్చింది. స్థానికేతరుల ఓట్లు తొలగించినట్లు కనిపించలేదని ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే వార్డుల రిజర్వేషన్లపై ప్రభావం చూపుతుందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అభ్యంతరాలను పట్టించుకోలే.. 
ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరుగుతాయని మున్సిపల్‌ యంత్రాంగం జూలై నెలలోనే హడావుడిగా కులగణన, వార్డుల పునర్విభజన చేసింది. అభ్యంతరాల నమోదుకు గడువు తక్కువగా ఉండడం వల్ల కూడా రాజకీయ పార్టీలు కసరత్తు వేగంగా చేయలేకపోయాయి. కొద్దిపాటి అభ్యంతరాలను వ్యక్తపరిచినా.. పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత కూడా అవే తప్పులు దొర్లడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్‌ యంత్రాంగం పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా.. 23 వార్డులయ్యాయి. 26,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 12,743 మంది, మహిళలు 13,727 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,133 మంది, ఎస్టీ ఓటర్లు 1,580 మంది, బీసీ ఓటర్లు 14,254 మంది, జనరల్‌ ఓటర్లు 6,503 మంది, ఇతరులు ఒక్క ఓటరుతో వార్డులవారీగా నూతన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
  
డబుల్‌ ఇంటి నంబర్లతో తికమక.. 
సత్తుపల్లి మున్సిపాల్టీలో సత్తుపల్లి రెవెన్యూ, అయ్యగారిపేట రెవెన్యూ విభాగాలున్నాయి. అయితే ఆయా రెవెన్యూల్లో చాలా డోర్‌ నంబర్లు ఒకే ఇంటి నంబర్‌తో రెండుచోట్ల కొనసాగుతున్నాయి. అయ్యగారిపేట, సత్తుపల్లి రెవెన్యూలు వేర్వేరుగా ఉండడం వల్ల ఒకే నంబర్‌ ఇస్తున్నారు. పట్టణమంతా ఒకే ఇంటి నంబర్‌ సీరియల్‌గా ఉండాల్సి ఉంది. కానీ.. రెవెన్యూలవారీగా ఒకే నంబర్‌ను రెండు రెవెన్యూ విభాగాల్లో ఇవ్వడం వల్ల రెండుచోట్ల ఒకే ఇంటి నంబర్‌ గల ఇళ్లు వస్తుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఒకే డోర్‌ నంబర్‌తో ఉన్న ఓట్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా.. వేర్వేరు వార్డుల ఓటర్లు జాబితాలో కనిపించడంతో తికమక పడాల్సి వస్తోంది. ఉదాహరణకు.. సత్తుపల్లి రెవెన్యూ విభాగంలోని అడపా సత్యనారాయణ వీధిలోని ఓటర్ల ఇంటి నంబర్లు, అయ్యగారిపేట రెవెన్యూ విభాగంలోని అంబేడ్కర్‌ నగర్‌ కాలనీలోని ఓటర్ల ఇంటి నంబర్లు ఒకేలా ఉన్నాయి. దీంతో ఓటర్ల జాబితాలోని పేర్లు జంబ్లింగ్‌ కావడంతో ఒకే ఇంట్లోని ఓటర్లు వేర్వేరు వార్డుల జాబితాల్లోకి వెళ్లాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top