గాంధీలో కరోనా వీఐపీ వార్డు

VIP Word Arrange For Corona Test In Gandhi Hospital - Sakshi

ప్రధాన భవనంలోని ఏడో అంతస్తులో అందుబాటులోకి..

మిగతా రోగులతోపాటు చికిత్స అందించడంపై వీఐపీల అసంతృప్తి

టీవీ, ఏసీ, ప్రత్యేక బాత్రూంసహా ఇతర సౌకర్యాలు  

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ అనుమానితులకు ఇకపై సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్‌మెంట్‌ లభిస్తుంది. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలోని ఏడవ అంతస్తు లోని పేయింగ్‌ రూం విభాగంలో ఏడు పడకలతో కరోనా వీఐపీ వార్డును అందుబాటులోకి తెచ్చారు. వీఐపీ కేటగిరీకి చెందిన కరోనా అనుమానితులు ఎక్కువ సంఖ్యలో వస్తే దానికి అనుగుణంగా పడకల సంఖ్య పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గాంధీ అత్యవసర విభాగంలో కరోనా ఎక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో పది, ప్రధాన భవనంలో 20 పడకలతో 2 ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. పోలీస్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారి కుటుంబ సభ్యులు, ఎయిర్‌హోస్టెస్‌లు కరోనా అనుమానంతో గాంధీ ఆస్పత్రికి రాగా, వారిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. మిగిలిన రోగులతో పాటు తమను అడ్మిట్‌ చేయడం, తమ హోదాకు తగ్గట్టుగా వసతులు లేకపోవడంతో వారంతా డబ్బు ఖర్చు చేసేందుకు వెనుకాడమని, మరింత మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ‘గాంధీ’లో పేయింగ్‌రూంలు అందుబాటులో ఉన్నాయి. ఆయా రూమ్‌లను కరోనా వీఐపీ వార్డులుగా ఏర్పాటు చేయాలని భావించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. వినోదం కోసం టీవీ, ఏసీ, ప్రత్యేక బాత్‌రూం తదితర సౌకర్యాలను కల్పించారు.
 
‘కరోనా’పై కీలక నిర్ణయాలు
కరోనా అనుమానితులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలి పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక సమావేశం నిర్వహిం చి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలి పారు. అనుమానితులు వచ్చిన వెంటనే నమూనాలు సేకరించేందుకు ల్యాబ్‌ టెక్నీషియన్లను వార్డులో నియమించామన్నారు. ఎక్స్‌రే తీసి వెంటనే ఫిల్మ్‌ అందించేందుకు పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్, రేడియోగ్రాఫర్, నర్సింగ్‌ సిబ్బంది, పేషెంట్‌ కేర్‌ టేకర్‌లను ఆయా వార్డులో రౌండ్‌ ది క్లాక్‌ సేవలు అందించేలా ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌ఎంఓలు, స్పెషలిస్ట్‌ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, సీనియర్‌ రెసిడెంట్స్, పేషెంట్‌ కేర్‌టేకర్లు, హెల్ప్‌డెస్క్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించామన్నారు. గాంధీ ఐసోలేషన్‌ వార్డుల్లో ఇప్పటివరకు 43 మంది అనుమానితులు చేరగా నిర్ధారణ పరీక్షల్లో అందరికీ కరోనా నెగటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశామన్నారు. కరోనా అనుమానితులు వైద్యులకు చెప్పకుండా ఇంటికి వెళ్లిపోతున్నారని, ఇకపై అటువంటి ఘటనలు జరగకుండా చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక పోలీస్‌ సిబ్బందిని నియమించామని వివరించారు. ఐసోలేషన్‌ వార్డులో సోమవారం ఇద్దరు అడ్మిట్‌ అయ్యారని, వారి నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపినట్లు తెలిపారు. గాంధీ డిజాస్టర్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఒక స్వైన్‌ఫ్లూ బాధితున్ని సోమవారం డిశ్చార్జి చేశామని, మరో నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.

నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో సోమవారం ఓ కరోనా అనుమానిత కేసు నమోదైంది. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన ఓ విద్యార్థి(21) జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు పరీక్షల కోసం కుమారుడిని ఫీవర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా హెల్ప్‌ డెస్క్‌లో ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అతని నుంచి శాంపిల్‌ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
‘ఫీవర్‌’లో మరో కరోనా అనుమానిత కేసు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top