స్కెచ్‌ విక్రమ్‌దే..!

స్కెచ్‌ విక్రమ్‌దే..! - Sakshi


తనపై కాల్పులకు పథకం రచించింది విక్రమ్‌గౌడే

►  అమలులో పెట్టేందుకు సహకరించిన సన్నిహితుడు

►  విక్రమ్‌ను నిందితునిగా చేర్చిన పోలీసులు

►  మంగళవారం నాటికి అదుపులో నలుగురు నిందితులు

►  తుపాకీ కొత్తచెరువులో పారేసినట్లు అనుమానాలు


సాక్షి, హైదరాబాద్‌ :  మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ తనయుడు విక్రమ్‌గౌడ్‌ నివాసంలో శుక్రవారం జరిగిన కాల్పుల కేసు కొలిక్కి వచ్చింది. ఈ ‘ఆపరేషన్‌’కు పథకరచన చేసింది విక్రమ్‌గౌడేనని దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిసింది. విక్రమ్‌కు సన్నిహితంగా ఉండే నందు అనే వ్యక్తి ఈ పథకం అమలులో సూత్రధారిగా వ్యవహరించినట్టు వెల్లడైందని సమాచారం. పథకాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నిందితులు అమలు చేయగా.. మంగళవారం నాటికి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో బాధితుడిగాఉన్న విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు నిందితుడిగా మార్చారు.నందూకు స్కెచ్‌ అమలు బాధ్యతలు

తనపై ఎవరైనా తుపాకీతో కాల్చడం ద్వారా హత్యాయత్నం చేస్తే.. సానుభూతితో కుటుంబం దగ్గర కావడం, భయంతో ఫైనాన్షియర్లు కొన్ని నెలల పాటు తన దగ్గరకు రాకుండా ఉండటం జరుగుతుందని విక్రమ్‌ భావించారు. దీన్ని అమలులో పెట్టే బాధ్యతల్ని తనతో సన్నిహితంగా ఉండే నందూ అనే వ్యక్తికి అప్పగించారు. ముందుగా లోకల్‌ షూటర్ల గురించి ఆరా తీసినా వారు ప్రొఫెషనల్‌ షూటర్లు కాదనే కారణంతో వెనక్కి తగ్గారు. చివరికి నందు తనకు ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో అనంతపురానికి చెందిన ముఠాను సంప్రదించారు. విక్రమ్‌కు ఎలాంటి ప్రాణహానీ లేకుండా కాల్పులు జరిపి వెళితే ఒక్కొక్కరికీ రూ.50 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ‘ఆపరేషన్‌’కోసం అనంతపురం ముఠా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వారిని రంగంలోకి దింపింది.చివరి నిమిషంలో మారిన ప్లేస్‌..

తొలుత వేసుకున్న ప్లాన్‌ ప్రకారం విక్రమ్‌పై కాల్పులు బయటి ప్రాంతంలో ఎక్కడైనా జరగాల్సి ఉంది. ఈ మేరకు నిందితులు రెక్కీ సైతం పూర్తి చేసి తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే బహిరంగ ప్రదేశంలోనో, రోడ్డు పైనో ప్లాన్‌ అమలు చేస్తే సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాలు లభించే అవకాశాలు ఉండటంతో ‘ప్లేస్‌’ను విక్రమ్‌ ఇంటికే మార్చారు. రోడ్డుపై జన సంచారం తక్కువగా ఉంటుందనే తెల్లవారుజాము సమయాన్ని ఎంచుకున్నారు. ప్లాన్‌ అమలు కోసం ఇంట్లోని సీసీ కెమెరాలను విక్రమ్‌ ముందుగానే తొలగించినట్టు తెలుస్తోంది. ఇక నిందితులకు అవసరమైన వాహనాన్ని నందూ సమకూర్చినట్లు సమాచారం. కాల్పులకు రెండు రోజుల ముందు షూటర్లతో కలసి విక్రమ్‌ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రౌండ్లు కాల్చాలని సూచించారు.ప్లాన్‌ అమలు..

అప్పటికే పలుమార్లు రెక్కీ పూర్తి చేసుకున్న నిందితులు శుక్రవారం ఉదయం అనంతపురం నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. నందూ సమకూర్చిన వాహనంపై విక్రమ్‌ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఒకరు బయటే వేచి ఉండగా.. మరొకరు ఇంట్లోకి వెళ్లి మొదట ఒక రౌండ్‌ కాల్చాడు. విక్రమ్‌ చెప్పడంతోనే రెండో రౌండ్‌ సైతం కాల్చి పారిపోయారు. వీరికి సహకరించిన మరో నిందితుడు ఆ ఇంటికి కొద్దిదూరంలో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్‌ మీదుగా పారిపోయారు. వెళ్తూ ఆయుధాన్ని కొత్త చెరువులో విసిరేసి షేక్‌పేట వెళ్లి అక్కడి నుంచి ఓల్డ్‌ ముంబై రోడ్డు ద్వారా నానక్‌రాంగూడ చేరుకున్నారని సమాచారం. అక్కడ నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ అనుసరించి సిటీ దాటారని పోలీసులు భావిస్తున్నారు.కొత్త చెరువును జల్లెడ పడుతున్న పోలీసులు

మంగళవారం సాయంత్రానికి విక్రమ్, నందూ, అహ్మద్, రాజు, మురళి, రాజశేఖర్‌లను నిందితులుగా చేరుస్తూ కేసులో మార్పులు చేశారు. అనంతపురం, కర్ణాటకల్లో ప్రత్యేక బృందాలు నలుగురిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో మురళి కాల్పులు జరిపిన వ్యక్తిని ద్విచక్ర వాహనంపై విక్రమ్‌ ఇంటికి తీసుకువచ్చినట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి కోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గాలిస్తున్నారని తెలిసింది. నిందితుల్ని బుధవారం అరెస్టు ప్రకటించే ఆస్కారం ఉందని తెలిసింది. కాల్పులకు వినియోగించిన ఆయుధం కోసం పోలీసులు మంగళవారం కొత్త చెరువులో ముమ్మరంగా వెతికారు. దాదాపు 20 మంది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొత్త చెరువును జల్లెడ పట్టారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో బుధవారం మరోసారి వెతకనున్నారు.ఆర్థిక ఇబ్బందుల వల్లే..

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విక్రమ్‌ అనేక చోట్ల అప్పులు చేశారు. ఇటీవల కాలంలో రుణం ఇచ్చిన ఫైనాన్షియర్ల నుంచి తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి పెరిగింది. మరోవైపు విక్రమ్‌ను ఆయన కుటుంబం కూడా దూరంగా ఉంచుతుండటంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో ఏదైనా పథకం వేయడం ద్వారా అటు కుటుంబానికి దగ్గర కావడం, ఇటు ఫైనాన్షియర్ల ఒత్తిడి తగ్గించుకోవడం చేయాలని విక్రమ్‌ భావించారు. కొన్ని చిత్రాలను నిర్మించడం ద్వారా సినీరంగంతోనూ సంబంధాలు ఉన్న ఆయన సినీ ఫక్కీలోనే ఈ సమస్యలకు ‘పరిష్కారం’ వెతకాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిందే హత్యాయత్నం ఐడియా. ఆరు నెలల నుంచి కాల్పుల ఉదంతానికి ప్రణాళిక రచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top