టీకాలు 68 శాతం మందికే!

టీకాలు 68 శాతం మందికే!


► రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు దూరంగా 32 శాతం మంది చిన్నారులు

► దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్న వైనం: కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక




సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రుల అవగాహనా లోపం భవిష్యత్తు తరాన్ని బలహీనంగా మారుస్తోంది. చిన్నారులకు క్రమపద్ధతిలో ఇవ్వాల్సిన టీకాల విషయంలో రాష్ట్ర పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 68 శాతం మంది పిల్లలకే పూర్తి వ్యాక్సినేషన్‌ అందుతోంది. మిగిలిన 32 శాతం మంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏడాది వయసు వరకు కచ్చితంగా అవసరమైన టీకాలను సైతం పిల్లలు పొందలేక దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం చిన్నారులకు 16 ఏళ్ల వయసు వచ్చే వరకు 10 దశల్లో అందించాల్సిన 25 రకాల టీకాల్లో 20 టీకాలను వేయడం తప్పనిసరి.


ఏడాదిలోపు శిశువులకు అన్ని టీకాలను వేస్తేనే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ప్రభుత్వం సైతం ఈ 20 టీకాలను దాదాపు ఉచితంగా సరఫరా చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం దేశంలో ఐదేళ్లలోపు బాలల మరణాలు ఇటీవల గణనీయంగా తగ్గినా దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్న పిల్లల సంఖ్య మాత్రం పెరిగింది. అతిసారం, న్యుమోనియా, ధనుర్వాతం, తట్టు వంటి వ్యాధుల తీవ్రత బాగా తగ్గినా... కొత్త రకం వ్యాధుల తీవ్రత పెరిగింది. తక్కువ బరువుతో జన్మించడం వల్ల తలెత్తే మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయి.


ముఖ్యంగా గ్రామాల్లో నవజాత శిశువుల మరణాల రేటు... పట్టణ ప్రాంతాల కంటే రెట్టింపుగా ఉంది. రక్తహీనత, పౌష్టికాహారలోపం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది. 2000–2015 సంవత్సరాల మధ్య దేశంలో వివిధ వ్యాధులతో 2.9 కోట్ల మంది చిన్నారులు (ఐదేళ్లలోపు వారు) మరణించారు. గతంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. 2010–15 మధ్య పట్టణ ప్రాంతాలు, ధనిక రాష్ట్రాల్లో బాలల మరణాలు చాలా వేగంగా తగ్గాయి. 2000 సంవత్సరంలో దేశంలో వెయ్యి మంది జన్మిస్తే 45 మంది చనిపోయేవారు. 2017లో ఇది 41కి తగ్గింది. మన రాష్ట్రంలో వెయ్యి మంది పుడితే 28 మంది చనిపోతున్నారు.



నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ షెడ్యూల్‌ ఇదీ...

వయసు                      వ్యాక్సిన్‌ పేరు

గర్భస్తపిండం                 టీటీ1, బూస్టర్‌

పుట్టిన వెంటనే              బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్‌–బీ

ఆరు వారాలు               ఓపీవీ1, పెంటావాలెంట్‌–1, రోటా–1, ఎఫ్‌ఐపీవీ–1

10 వారాలు                 ఓపీవీ2, పెంటావాలెంట్‌2, రోటా2

14 వారాలు                 ఓపీవీ3, పెంటావాలెంట్‌–3, రోటా3, ఎఫ్‌ఐపీవీ–2

9 నుంచి 12 నెలలు       ఎంఆర్‌–1, జేఈ–1

16 నుంచి 24 నెలలు     ఎంఆర్‌–2, జేఈ–2, డీపీటీ–బీ, ఓపీవీ–బీ

ఐదు నుంచి ఆరు ఏళ్లు   డీపీటీ–బీ2

10 ఏళ్లు                    టీటీ

16 ఏళ్లు                    టీటీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top