ఇది కాంగ్రెస్‌ పోరాట ఫలితమే

ఇది కాంగ్రెస్‌ పోరాట ఫలితమే - Sakshi


జీవో 38పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన పోరాటం వల్లనే కేసీఆర్‌ ప్రభుత్వం దిగివచ్చి నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ కోసం జీవో నంబర్‌ 38ను విడుదల చేసిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ జీవో ద్వారా కాంగ్రెస్‌ పాక్షిక విజయాన్ని సాధించిందన్నారు. అయితే వివిధ ప్రాజెక్టుల కోసం భూమి కోల్పోయి నిర్వాసితులవుతున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు, తదితర బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు కాంగ్రెస్‌ పార్టీ విశ్రమించదన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై రైతాంగం చేసిన పోరాటం, దానికి కాంగ్రెస్‌ అండగా నిలిచిన ఫలితంగానే ఈ నెల 14న జీవో 38ను రెవెన్యూ శాఖ జారీ చేసింద న్నారు. తెలంగాణ తమ జాగీరు కాదని ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ గుర్తుంచుకోవాల న్నారు.


గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రచట్టం, 2013 ప్రకారం భూసేకరణ జరగాలని చట్టం చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహారిస్తోందని ధ్వజమెత్తారు. నిరుపేదల భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కాంగ్రెస్‌ ఊరుకోదన్నారు. ప్రభుత్వం జీవో 123 ప్రకారం భూమి సేకరించడం చట్టవిరుద్ధమని కాంగ్రెస్‌ ముందునుంచి చెబుతూ వచ్చిందన్నారు. జీవో 123 పూర్తిగా చట్టవ్యతిరేకం కాగా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధంగా ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తోందని ఆరోపించారు. భూసేకరణ విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. చిన్న, సన్నకారు రైతుల భూములను లాక్కొని పారిశ్రామిక వర్గాలకు అప్పగించడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకి స్తోందన్నారు.



ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు: దామోదర

ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరచి జీవో నంబర్‌ 38 తీసుకొచ్చిందని దామోదర రాజనర్సింహ అన్నారు. అయితే ఈ జీవో ద్వారా కూడా భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదన్నారు. జీవో 38 లో పేదల భూమి పై ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. దీని ద్వారా రైతులు నష్టపోనున్నందున 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 123 ద్వారా భూసేకరణా, కొనుగోలా..? అన్న అర్థం లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.


ప్రాజెక్ట్‌ లను కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తమ పార్టీ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకం కాదని, రీ డిజైనింగ్‌కు వ్యతిరేక మని అన్నారు. కాంగ్రెస్‌ నేతల వీపులు పగులుతాయని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, కొన్ని రోజులు ఆగితే ప్రజలు ఎవరి వీపులు పగలగొడుతారో తెలుస్తుందని అన్నారు. అబద్దాలకు సీఎం కేసీఆర్‌ ప్రతిరూపంగా ఉన్నారని ధ్వజ మెత్తారు.  మల్లన్న సాగర్‌ రైతులకు పరి హారం, పునరావాసం 2013 భూసేకరణ చట్టంతోనే సాధ్యమన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top