టార్గెట్‌ జాబ్‌..

UGC measures for radical change in higher education teaching - Sakshi

ఉన్నత విద్యా బోధనలో సమూల మార్పులకు యూజీసీ చర్యలు 

లెర్నింగ్‌ ఔట్‌ కమ్‌ బేస్డ్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ రూపకల్పన 

16లోగా మెయిల్‌ ద్వారా సలహాలు, సూచనలివ్వాలని కోరిన యూజీసీ 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగం, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉన్నత విద్యలో మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. దీని కోసం ఓ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. లెర్నింగ్‌ ఔట్‌కమ్‌ బేస్డ్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎల్‌వోసీఎఫ్‌) రూపొందించింది. అందులో డిగ్రీ, పీజీ స్థాయిల్లో హిందీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్‌ సైన్స్, బయోకెమిస్ట్రీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మాస్‌ కమ్యూనికేషన్‌ తదితర సబ్జెక్టులకు సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. గతేడాదే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినా ఆచరణకు నోచుకోలేదు. ఈసారి అమలుకు పక్కా చర్యలకు సిద్ధమవుతోంది. దీని కోసం విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని యూజీసీ నిర్ణయించింది. తమ వెబ్‌సైట్‌లో ఎల్‌వోసీఎఫ్‌ డ్రాఫ్టును అందుబాటులో ఉంచింది. ఈనెల 16లోగా మెయిల్‌ ద్వారా(locfugc@ gmail.com) సలహాలు అందజేయాలని కోరింది.  

మార్పు ఇలా..
కాలేజీల్లో చేయిస్తున్న ప్రాక్టికల్స్‌కు, బోధిస్తున్న పాఠ్యాంశాలకు పొంతన ఉండటం లేదని యూజీసీ తేల్చింది. పది ప్రధాన అంశాల్లో మార్పులు అవసరమని యూజీసీ నిర్ణయించింది. విజ్ఞానం పొందడం, అర్థం చేసుకోవడం, నైపుణ్యాలను మెరుగు పర్చడం, ప్రవర్తన వంటి ప్రధాన అంశాలతో విద్యా బోధనలో మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. కమ్యూనికేషన్‌ స్కిల్స్, రైటింగ్‌ స్కిల్స్, రీడింగ్, అనాలిసిస్, క్రిటికల్‌ థింకింగ్, సైంటిఫిక్‌ అప్రోచ్, యాటిట్యూడ్, వ్యాల్యూస్, ఎథిక్స్‌ విద్యార్థుల్లో పెంపొందేలా బోధనలో మార్పులను తేవాలని నిర్ణయించింది.

వీటికి ప్రాధాన్యం..
ప్రస్తుతం క్రిటికల్‌ థింకింగ్, అనాలిటికల్‌ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్‌ ప్రధానమని యూజీసీ గుర్తించింది. ఏదేని ఓ సమస్యను వివిధ రకాలుగా ఎలా సాల్వ్‌ చేయొచ్చో విద్యార్థులకు నేర్పించే బోధన పద్ధతులు అవసరమని పేర్కొంది. విశ్లేషణాత్మకంగా వివరించడం, తార్కిక ఆలోచన, శాస్త్రీయ ధృక్కోణాన్ని పెంపొందించేలా విద్యా బోధన ఉండాలని చెప్పింది. పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేలా విద్య, బోధన సాగాలని తెలిపింది. ప్రతి విద్యార్థిలో కోఆపరేషన్, టీం వర్క్, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ను పెంపొందించేలా సిలబస్‌ను మార్చాలని స్పష్టం చేసింది. 

యూజీసీ సూచనలు..
- డిజిటల్‌ లిటరేచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపైనా అవగాహన కల్పించేలా బోధన ఉండాలి. 
సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకొని బోధన ఎలా కొనసాగించాలన్న అంశంలోనూ మార్పులు అవసరం. 
సెల్ఫ్‌ డైరెక్టివ్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెంచాలి. మోరల్, ఎథికల్‌ వ్యాల్యూస్‌తో విద్యను కొనసాగించడం, నాలెడ్జ్‌ అప్‌డేట్‌ చేసుకోవడం, థియరీని ప్రాక్టికల్స్‌కు అనుసంధానించడం వంటివి చేయాలి.  
​​​​​​​- ఫీల్డ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం, ఇంటర్న్‌షిప్, ఫీల్డ్‌ విజిట్, ఇండస్ట్రీ విజిట్‌ వంటి వాటిని పెంచాలి. వీటిపై పరీక్షలు, క్లోజ్డ్‌ అండ్‌ ఓపెన్‌ బుక్స్‌ ఎగ్జామినేషన్‌ విధానం తీసుకురావాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top