డబుల్‌ ధమాకా

Two MLAS From One Constituency - Sakshi

ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు

1952, 1957 ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 4 స్థానాలు

ఒకరు జనరల్, మరొకరు రిజర్వు స్థానం

సాక్షి, ఆసిఫాబాద్‌: ఇప్పుడు శాసన సభలో అడుగుపెట్టాలంటే ఒక నియోజకవర్గం నుంచి ఒకరే ప్రజల నుంచి ఎన్నికవుతున్నారు. అయితే గతంలో ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరిని చట్టసభలకు పంపించే అవకాశం ఆ నియోజకవర్గ ఓటర్లకు ఉండేది. హైదరాబాద్‌ సంస్థానం మొదటిసారిగా నిజాం పాలన అంతమై భారతదేశంలో విలీనం అ యింది. ఈ సమయంలో హైదరాబాద్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి పర్యవేక్షణలో హైదరాబాద్‌ రాష్ట్రంలో 1952లో ఒకసారి, 1957 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.

హైదరాబాద్‌ రాష్ట్ర పరిధిలో మొత్తం 175 స్థానాల్లో (మహారాష్ట్ర, కర్నాటక కలుపుకు ని) 33 ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. అందులో తెలంగాణ పరిధిలో 21 ద్విసభ్య నియోజకర్గాలు ఉండేవి. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని అప్పడున్న 9 నియోజకవర్గాల్లో సిర్పూర్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, నిర్మల్‌ నాలుగు ద్విసభ్య స్థానాలు ఉండేవి. 1952లో కొన్ని ప్రాంతాల్లో 1957 మరికొన్నింటిలో ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండగా ఈ ఎన్నికలు జరిగాయి. 1961లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం రద్దయింది. 

ఒకరు జనరల్‌ మరొకరు రిజర్వుడ్‌
ఒకే నియోజకవర్గ పరిధిలో ఇద్దరేసి ఎన్నుకునే అవకాశం ఆ రెండు సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు దక్కింది. అంటే ఒకే నియోజకవర్గంలో ఒకరిని జనరల్‌ అభ్యర్థిగా, మరొకరు రిజర్వుడ్‌ అభ్యర్థిని ఎన్నుకునేవారు. వీటిలో ఎస్సీ అభ్యర్థులే రిజర్వు చేసిన స్థానాల్లో ఉన్నారు. 

సిర్పూర్‌లో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులే గెలుపు..
ప్రస్తుతం తెలంగాణలో సీరియల్‌ నంబర్‌ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న సిర్పూర్‌ నియోజకవర్గంలో 1957లో ద్విసభ నియోజకవర్గం కింద ఇద్దరు ఎస్సీ అభ్యర్థులే గెలవడం విశేషం. అంటే ఒకరు జనరల్‌ అభ్యర్థి ఎన్నిక కావాల్సి ఉన్నా ఇద్దరు ఎస్సీ అభ్యర్థులే గెలిచారు. అప్పట్లో సోషలిష్టుల ప్రభావం అధికంగా ఉండడంతో ఇక్కడ సోషలిస్టులే గెలిచారు. మొదటిసారి ఎన్నికల్లో పీఎస్‌సీ నుంచి పోటీ చేసిన రామన్నపై జి.వెంకటస్వామి (కాంగ్రెస్‌) గెలుపొందగా, కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన ఎస్‌.రెడ్డిపై..కె రాజమల్లు (ప్రజా సోషలిస్టు పార్టీ) గెలుపొందగా తర్వాత వీరిద్దరు ప్రముఖ నేతలుగా ఖ్యాతి గడించారు.

ఆసిఫాబాద్‌ నుంచి బాపూజీ, కాశీరాం
ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 1952, 1957 రెండు ఎన్నికల్లో ద్విసభ్య విధానం అమలులో ఉంది. ఇక్కడ మొదటి సారిగా కాంగ్రెస్‌ నుంచి 1952లో తెలంగాణ బాపూజీగా పే రుగాంచిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ (బీసీ), సోషలిస్టు అభ్యర్థి అడ మెంగుపై గెలుపొందగా, సోషలిస్టు పార్టీకి నుంచి పోటీ చేసిన మారుతీరావుపై కాశీరాం (ఎస్సీ) గెలుపొం దారు. అనంతరం 1957లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ కేట గిరిలో మరోమారు కాశీరాం పీడీఎఫ్‌ అభ్యర్థి కాశీరావుపై ఎన్నిక కాగా, జనరల్‌ కేటగిరిలో జి.నారాయణ రెడ్డి, ఆర్‌కే.శాస్త్రీపై (కాంగ్రెస్‌)పై గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లో గెలిచిన నలుగురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులే కావడం విశేషం. 

నిర్మల్‌లో గంగారెడ్డి, గంగారాం
1952 ఎన్నికల సమయంలో ఒకసారి ద్విస భ్య నియోజకవర్గంగా ఉన్న నిర్మల్‌లో సోషలిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. దీంతో ఈ ఎన్నికల్లో జనరల్‌ కేటగిరిలో గోపిడి గంగారెడ్డి, మరో అభ్యర్థి గంగారాం ఈ పార్టీ నుంచే ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌.రెడ్డి, సీహెచ్‌ఆర్‌.రావు ఇద్దరు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

లక్సెట్టిపేట నుంచి సోషలిస్టులే..
ప్రస్తుత మంచిర్యాల నియోజకవర్గంలో కలిసిన లక్సెట్టిపేట నియోజకవర్గం ఉన్న సమయంలో 1952లో ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. ఇక్కడి నుంచి సోషలిస్టు నేత, మాజీ విద్యాశాఖ మంత్రి కోదాటి రాజమల్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జి.అర్జున్‌కుమార్‌పై గెలుపొందారు. మరో అభ్యర్థి సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసిన విశ్వనాథరావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కేవీ కేశవులుపై గెలుపొంది ఇద్దరు చట్ట సభలకు లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top