బస్సులకూ సెలవే!

TSRTC City Bus Services Down in Holidays - Sakshi

సెలవు దినాల్లో కనిపించని సిటీ బస్సులు  

భారీగా ట్రిప్పుల రద్దు  

బస్టాపుల్లో ప్రయాణికుల పడిగాపులు  

ప్రైవేట్‌ వాహనాలపైనే ఆధారం  

ఆటోలు, క్యాబ్‌లలో చార్జీల మోత  

సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందో? రాదో? తెలియక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇక సెలవు వచ్చిందంటే చాలు రోడ్లపై బస్సులే కనిపించడం లేదు. రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వం బుధ, గురువారాలు సెలవు ప్రకటించింది. ఈ రెండు రోజులు బస్సులు  అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నరకం చూశారు. వివిధ మార్గాల్లో ట్రిప్పుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో తప్ప మిగతా సమయాల్లో బస్సులు పెద్దగా తిరగలేదు. ఎప్పుడొస్తుందో తెలియని ఒకటీ అరా బస్సుల కోసం  ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూసి... చివరకు ఆటోరిక్షాలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో  ఆటోవాలాలు అందినకాడికి దోచుకున్నారు. అసలే మీటర్లు లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఆటో డ్రైవర్లు ఈ రెండు రోజులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. మరోవైపు క్యాబ్‌లు సైతం చార్జీల మోత మోగించాయి. సాధారణ రోజుల్లోనే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండడం లేదు. సిబ్బంది కొరత, గైర్హాజరు, బస్సుల బ్రేక్‌డౌన్స్, రన్నింగ్‌ టైమ్‌ పరిమితుల దృష్ట్యా  వేల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. నగర శివారు ప్రాంతాలకు, కాలనీలకు వెళ్లే బస్సు సర్వీసులకు కోత విధిస్తున్నారు. ఒకవైపు ఈ ఇబ్బందులు ఉండగానే ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ట్రిప్పుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో లక్షలాది మంది సకాలంలో గమ్యం చేరుకోలేకపోతున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల సదుపాయాలు ఉన్నప్పటికీ.. అవి అందుబాటులో లేని మార్గాల్లో సిటీ బస్సుల కొరత ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా మార్గాల్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు, రాత్రి 9 దాటిన తర్వాత బస్సులు ఉండడం లేదు. 

ఇదేం ఛేంజ్‌ అవర్‌?  
వాస్తవానికి సిటీ బస్సులు మూడు షిఫ్టుల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి. కానీ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రాకపోకలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో మొదటి షిఫ్టు బస్సులకు, రెండో షిఫ్టు బస్సులకు మధ్య మధ్యాహ్నం   ఒంటిగంట నుంచి 2గంటల వరకు కొంత విరామాన్ని ఇస్తారు. ఈ సమయంలో మొదటి షిఫ్టు కండక్టర్, డ్రైవర్‌లు డ్యూటీ దిగి వెళ్తే.. రెండో షిఫ్టు సిబ్బంది విధులకు హాజరవుతారు. దీనిని ఆర్టీసీలో ‘ఛేంజ్‌ అవర్‌’గా  పరిగణిస్తారు. కానీ ఛేంజ్‌ అవర్‌ పేరుతో మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన బస్సులను నిలిపి వేస్తున్నారు. బస్సుల నిర్వహణలో ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయలేమి ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. దీంతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రయాణికులు బస్టాపుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఆదివారాలు, ఇతర  సెలవు దినాల్లో మరింత దారుణంగా ఉంటోంది. ఇక రాత్రి 9గం టల నుంచి ఎలాగూ పడిగాపులు తప్పడం లేదు.  

అధికారుల సాకులు...  
ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ నగరంలో ఆర్టీసీ బస్సులే అతి పెద్ద ప్రజా రవాణాగా అందుబాటులో ఉన్నాయి. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా రవాణా సదుపాయాన్ని అందజేయాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. కానీ సెలవుల్లో రద్దీ తక్కువగా ఉంటుందనే సాకుతో ట్రిప్పుల్లో భారీగా కోత విధిస్తుండడంతో ప్రైవేట్‌ వాహనాలు ప్రయాణికులపై దోపిడీకి పాల్పడుతున్నాయి.  ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం నగరంలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడం వల్ల  ట్రిప్పుల సంఖ్యను బాగా  తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో జనాలు ఇళ్ల నుంచి పెద్దగా బయటకు రావడం లేదు. అలాగే సోమవారం ఉన్న రద్దీ మంగళవారం ఉండదు. శుక్రవారం కూడా రద్దీ తక్కువగా ఉంటుంద’ని అధికారులు విశ్లేషించడం గమనార్హం. అనేక రూట్లలో రద్దీ లేదనే సాకుతో ఉదయం 4గంటల నుంచి 5గంటల వరకు ఉన్న ట్రిప్పులను రద్దు చేస్తున్నారు. రాత్రి పూట కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. కానీ  ప్రయాణికులు సిటీ బస్సులు లభించక ఇతర ప్రత్యామ్నాయాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారుల  లెక్కల ప్రకారమే రోజుకు 2,500 నుంచి 3,000 వరకు ట్రిప్పులు రద్దవుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది సిటీ బస్సు సదుపాయాన్ని కోల్పోతున్నారు. 

అన్ని వేళల్లోనూ అవసరమే...  
గ్రేటర్‌లో అర్ధరాత్రి రెండు, మూడు గంటలు మినహాయించి అన్ని వేళల్లో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. తెల్లవారుజామున చిరువ్యాపారులు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు అమ్మేవాళ్లు మొదలుకొని ట్యూషన్‌కు వెళ్లే విద్యార్ధులు, రైళ్ల కోసం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేçషÙన్‌లకు, బస్సుల కోసం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషషన్‌లకు పరుగులు తీసే ప్రయాణికులు వేల సంఖ్యలోనే ఉంటారు. ఉదయం 8గంటల నుంచి రద్దీ మొదలవుతుంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గంటపాటు తగ్గినా తిరిగి రాత్రి 11గంటల వరకు, కొన్ని రూట్లలో 12గంటల వరకు కూడా ప్రయాణికులు ఉంటారు. కోటి జనాభాకు చేరువైన మహానగరంలో ప్రయాణాలు నిరంతరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ రవాణా సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top