కొలువుల కొట్లాటకు నిధులెక్కడివి?

Trs starts enquiry on koluvula kotlata - Sakshi

జేఏసీ నేతలను ఆరాతీస్తున్న అధికారపార్టీ నాయకులు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ నిర్వహించిన కొలువుల కొట్లాట సభ జరిగిన తీరుపై అధికార పక్షం దృష్టిని కేంద్రీకరించింది. ఈ సభకు ఖర్చయిన నిధులెన్ని, వాటిని ఎక్కడి నుంచి సమీకరించారనే దానిపై టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా జేఏసీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఒక నాయకునికి, కీలకమైన నామినేటెడ్‌ పదవిలో ఉన్న నాయకుడొకరు ఫోన్‌ చేసి నట్లు తెలిసింది. కొలువుల కొట్లాట సభ జరిగిన మరునాడే ఆ జేఏసీ నేతకు ఫోన్‌ చేసిన టీఆర్‌ఎస్‌ నాయకుడు సభకు సంబంధించిన పలు వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇంతేకాక జేఏసీలో పనిచేస్తున్న నాయకులకు కూడా టీఆర్‌ఎస్‌  నేతలు ఫోన్లు చేసి ఇలాంటి ప్రశ్నలతోనే ఆరా తీసినట్టుగా కొందరు జేఏసీ నేతలు తెలిపారు.

ఎవరెవరు సహకరించారు?
‘కొలువుల కొట్లాట బాగానే జరిగినట్టుంది. మీరు చాలా కష్టపడినట్టు తెలిసి పోతుంది. ఖర్చు ఎంత అయింది? సభకు ఎంత మంది వచ్చారు? జేఏసీ నేతల్లో ఎవరు ఎక్కువ మందిని సమీకరించారు? విద్యా సంస్థల యజమానులు ఎవరె వరు సహకరించారు? ఆర్థికవనరులు ఎవరు సమకూర్చారు?’వంటి ప్రశ్నలతో టీఆర్‌ఎస్‌ నేతలు తమను వివరాలు అడిగారని జేఏసీ నేతలు వెల్లడించారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్టుగా జేఏసీ నేతలు తెలిపారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఏ కార్యక్రమ వివరాలనైనా పోలీసులు, నిఘా విభాగం సేకరించడం సాధారణమే. అయితే నేరుగా టీఆర్‌ఎస్‌ నేతలే మా (జేఏసీ) నాయకులకు ఫోన్లు చేసి వివరాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రాజకీయాలకతీతంగా నేతలు మాట్లాడుకోవడం అసాధారణం ఏమీ కాదు. అయితే అధికార కేంద్రానికి దగ్గరగా ఉన్న నాయకులు సమాచారాన్ని సేకరించడా నికి నేరుగా మా నేతలకే ఫోన్లు చేయడం ఇబ్బంది కలిగించింది’అని జేఏసీ ముఖ్య నాయకుడొకరు పేర్కొన్నారు.

Back to Top