పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి

TRS Party's Focus On Party Organizational Structure - Sakshi

ఉద్యమంలా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జ్‌లు ఇలా..
నియోజకవర్గం        ఇన్‌చార్జ్‌ 
మహబూబ్‌నగర్‌–కొడంగల్‌    అందె బాబయ్య (రాష్ట్ర కార్యదర్శి, షాద్‌నగర్‌) 
కొల్లాపూర్‌– నాగర్‌కర్నూల్‌    పోతుగంటి రాములు (ఎంపీ, నాగర్‌కర్నూల్‌) 
అచ్చంపేట– కల్వకుర్తి    బి.శ్రీనివాస్‌ యాదవ్‌ (రాష్ట్ర కార్యదర్శి) 
నారాయణపేట– మక్తల్‌    ఇంతియాజ్‌ ఇసాక్‌  (రాష్ట్ర కార్యదర్శి, మహబూబ్‌నగర్‌)     
దేవరకద్ర– వనపర్తి    వాల్యానాయక్‌ (రాష్ట్ర కార్యదర్శి, బాలానగర్‌) 
షాద్‌నగర్‌– జడ్చర్ల    చాడ కిషన్‌రెడ్డి (రాష్ట్ర కార్యదర్శి, నల్లగొండ) 
అలంపూర్‌– గద్వాల    లింగంపల్లి కిషన్‌రావు (రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన్‌)

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పుర’పోరు.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో ఎదురులేని శక్తిగా నిలిచేలా సన్నాహాలు చేస్తోంది. ముందుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి వెంటనే జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గత నెల 30 నుంచి ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి నాయకులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.

అందులో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 50 వేల చొప్పున సభ్యత్వ లక్ష్యాన్ని ఆయా నియోజకవర్గ నేతలకు అప్పగించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల హైదరాబాద్‌లో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలందరూ తమ తమ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదుపై దృష్టిసారించారు. గత 30నే ఉమ్మడి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ఎౖౖక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం మహబూబ్‌నగర్‌ పట్టణంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టిపెట్టారు.

అధిష్టానం ఇచ్చిన లక్ష్యానికి మించి మరో 20వేల వరకు సభ్యత్వాలు ఎక్కువగా చే సేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు సభ్యత్వ నమోదు ముగిసిన వెంటనే పార్టీ జిల్లా, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇన్ని రోజులు పార్టీనే నమ్ముకుని పని చేస్తోన్న కార్యకర్తల్లో ఆశలు చిగురించాయి. కమిటీల్లో  చోటు కావాలంటే సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు షరతులు పెట్టడంతో ఆశావహుల్లో సభ్యత్వ పోటీతత్వం పెరిగింది.
 
సభ్యత్వాలపై పర్యవేక్షణ.. 
క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు తీరుతెన్నులు పరిశీలించడంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలిచ్చేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకో చొప్పున ఏడుగురు పార్టీ కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇన్‌చార్జీలందరూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్రతి ఓటరు కచ్చితంగా పార్టీ సభ్యత్వం పొందేలా చర్యలు తీసుకునేలా ఇన్‌చార్జీలు స్థానిక పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తలతో పాటే తాము కూడా టీఆర్‌ఎస్‌ హయాంలో సంక్షేమం పథకాలతో లబ్ధిపొందిన వర్గాలను కలిసి వారిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టిసారించారు. అధిష్టానం ఆదేశాల మేరకు వారు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తున్నారు.
 
‘పురా’లపై ప్రత్యేక దృష్టి..! 
ఇప్పటికే అసెంబ్లీ.. సర్పంచ్‌.. లోక్‌సభ.. ప్రాదేశిక ఎన్నికల్లో సత్తాచాటిన అధికార పార్టీ త్వరలోనే జరగనున్న ‘పుర ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం మున్సిపాలిటీలపై దృష్టిసారించి.. వాటి పరిధిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌యేతర పార్టీ సభ్యులపై దృష్టి సారించిన ఎమ్మెల్యేలు వారికి టీఆర్‌ఎస్‌ కండువా కప్పేలా వార్డుల వారీగా ఇన్‌చార్జీలనూ నియమించుకున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో వార్డుకు ఒకరిద్దరి చొప్పున ఇన్‌చార్జీలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నియమించారు. మిగతా పురాల్లోనూ ఇదేస్థాయిలో సభ్యత్వాలు కొనసాగుతున్నాయి.
 
ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.. 
గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా టీఆర్‌ఎస్‌ ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసింది.  సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సోమవారం నారాయణపేటలో ప్రజలే ముందుకొచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.  
 -ఇంతియాజ్‌ ఇసాక్‌, (నారాయణపేట/ మక్తల్‌ ఇన్‌చార్జ్‌). 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top