‘త్రి’నేత్రం 

TRS Party Main Focus On Three Constancy In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి,ఖమ్మం: జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికలకు, రానున్న ఎన్నికలకు మధ్య అనేక రాజకీయ పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ బలం అనేక రెట్లు పెరిగిందని భావిస్తున్న పార్టీ నేతలు అందుకు అనుగుణంగా శాసనసభ నియోజకవర్గాలను గెలిచి తీరాలని జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయడం, దీనికి అనుగుణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పది నియోజకవర్గాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ.. విపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిందనే భావన వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలకు టీఆర్‌ఎస్‌ కేవలం కొత్తగూడెం స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.

అక్కడి నుంచి జలగం వెంకటరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరగా.. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో 2016లో పాలేరుకు ఉప ఎన్నికలు జరగగా.. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక వైఎస్సార్‌ సీపీ నుంచి వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆ తర్వాత జరిగిన రా>జకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఇక కాంగ్రెస్‌ తరఫున ఇల్లెందు నుంచి ఎన్నికైన కోరం కనకయ్య, ఖమ్మం నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.  దీంతో ఖమ్మం జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు 2014 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్నట్లయింది. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మధిరకు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క ఉండగా.. వైఎస్సార్‌ సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 

వారు ఆ పార్టీల్లోనే.. 
ఇక సీపీఎం, టీడీపీ నుంచి గెలుపొందిన భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, సండ్ర వెంకటవీరయ్య ఆయా పార్టీల్లోనే కొనసాగుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుపొందడం ఒక ఎత్తయితే.. ఈ మూడు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడం ద్వారా జిల్లాలో రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు ఎదురులేదన్న సంకేతాలు పంపేందుకు పార్టీ ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి రాజకీయ పరిస్థితుల గురించి మంత్రి తుమ్మలతోపాటు ఎంపీ పొంగులేటితో సహా జిల్లా నేతలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవికి మద్దతుగా సత్తుపల్లిలో జరిగిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సత్తుపల్లి స్థానాన్ని టీఆర్‌ఎస్‌ గెలవకపోతే తాను కేబినెట్‌లో ఉండబోనని స్పష్టం చేయడం ద్వారా పార్టీకి ఈ స్థానం గెలవడం ఎంత అవసరమో.. పార్టీ అధినాయకత్వం దీనిపై ఏ మేరకు ఆశలు పెట్టుకుందో చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఇప్పటికే రెండుసార్లు టీడీపీ నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య.. కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ తరఫున మూడోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి ఉన్న పట్టు.. కాంగ్రెస్‌కు నియోజకవర్గంలో గల ఓటు బ్యాంకు.. వ్యక్తిగతంగా సండ్రకు గల సానుకూలత ఆయనకు విజయం చేకూర్చి పెడతాయని టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ మాత్రం సత్తుపల్లిపై ప్రత్యేక దృష్టి సారించి.. కార్యకర్తలను సమాయత్తవం చేసే పనిలో నిమగ్నమైంది. అక్కడ టికెట్‌ ఆశించిన టీఆర్‌ఎస్‌ నేత మట్టా దయానంద్‌ కార్యకర్తలతో సమాలోచనలు జరిపి.. ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా నియోజకవర్గంలోని పార్టీలో నెలకొన్న అసమ్మతి పరిస్థితులపై సైతం పార్టీ నేతలు అంచనా వేస్తూ.. పార్టీకి నష్టం జరగకుండా సమన్వయం చేసే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది.
 
బరిలో ‘భట్టి’.. 
ఇక రాష్ట్ర కాంగ్రెస్‌ నేతగా.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మరోసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు. మధిరలో ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ విజయం కోసం ఇప్పటికే ప్రచారం ప్రారంభించడంతోపాటు అభ్యర్థి విజయం కోసం అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సీపీఎం ఏకైక ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈసారి ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయడం లేదు. ఆయన సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడంతో సీపీఎం తరఫున వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

అయితే సీపీఎంకు పట్టున్న భద్రాచలం నియోజకవర్గంలో సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు మాజీ ఎంపీ, సీపీఎం సీనియర్‌ నేత మిడియం బాబూరావును భద్రాచలం అభ్యర్థిగా బరిలోకి దించింది. గతంలో భద్రాచలంలో టీడీపీ బలంగా ఉండటం.. ఆ పార్టీ శ్రేణులు మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఈసారి భద్రాచలం శాసనసభ స్థానంలో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ చెమటోడుస్తోంది. జిల్లాలో మొదటిగా గెలిచే సీటు భద్రాచలమేనంటూ.. అక్కడ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధిస్తారంటూ మంత్రి తుమ్మల ఇటీవల ఖమ్మంలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఉటంకించిన విషయం విదితమే. దీంతో ఆ నియోజకవర్గంపై పార్టీ ఏ స్థాయిలో ఆశలు పెట్టుకుందో.. ఏ మేరకు దృష్టి పెట్టిందో అర్థమవుతుందని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

మధిర, సత్తుపల్లి, భద్రాచలం నియోజకవర్గాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం. పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 8న జిల్లాకు రానుండడంతో జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు ఒకరోజు అంతా ఖమ్మంలో ఉండే అవకాశం ఉండడంతో విపక్ష పార్టీల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితిపై సీఎం ఆరా తీసే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top