నామి‘లేట్‌’!

TRS Leaders Facing Problems With Nominated Posts - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: నామినేట్‌ పదవుల పరంగా జిల్లాలో రాజకీయ వైచిత్రి కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో నియమించిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను సైతం వారు నిర్వహించలేని విచిత్ర పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 నుంచి 2017 వరకు నాలుగు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నేతలను చైర్మన్లుగా నియమించింది. వీరితోపాటు ఇతర జిల్లాల నుంచి నియామకమైన నేతలు కార్పొరేషన్‌ చైర్మన్లుగా కొనసాగుతుండగా.. జిల్లా లో మాత్రం నలుగురు కార్పొరేషన్‌ చైర్మన్లకుగాను.. ఒక్కరు మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం విశేషం. శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాకు గల రాజకీయ ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు టీఆర్‌ఎస్‌ నేతలను రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ముగ్గురు కార్పొరేషన్‌ చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పిడమర్తి రవి నామినేషన్‌ దాఖలుకు ముందు ఎన్నికల కమిషన్‌ నియమావళిని అనుసరించి అప్పటి వరకు కొనసాగుతున్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. అలాగే అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. నామినేషన్‌ దాఖలుకు ముందు తాను నిర్వహిస్తున్న ట్రైకార్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఆమోదించింది. ఇక తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్న బుడాన్‌ బేగ్‌ ఎన్నికలకు వారం రోజుల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి.. టీడీపీలో చేరారు. దీంతో ఆయన తాను నిర్వహిస్తున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కారణంగా ఎన్నికలకు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు కీలక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి ప్రభుత్వానికి రాజీనామా లేఖలు అందాయి.

ఇక తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొండబాల కోటేశ్వరరావు ఒక్కరే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి చవిచూసిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి ఉద్యమ నాయకుడు పిడమర్తి రవిని సీఎం కేసీఆర్‌ 2014లో అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత 2017లో రెండోసారి అదే పదవిని కట్టబెట్టారు. ఇంకా పదవీ కాలం ఉన్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం.. సత్తుపల్లి నుంచి మళ్లీ తన రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకునే అవకాశం రావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేశారు.  

అవకాశం కల్పిస్తుందని ఆశాభావం 
సత్తుపల్లి, అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను వదులుకుని శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల నుంచి పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు ఓటమి చెందడంతో తమకు ప్రభుత్వం మరో రూపంలో అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవీ కాలం పూర్తికాకముందే రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమకు ఏదో ఒక అవకాశం కల్పిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వాస్తవంగా 2017 మార్చి ఒకటో తేదీన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఆ సమయంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో వారి పదవీ కాలానికి గడువు విధించకుండా.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు కొనసాగేలా పేర్కొంది. దీంతో జిల్లా నుంచి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియామకమైన నలుగురిలో రాజీనామా చేసిన ముగ్గురు తమ పదవీ కాలం పూర్తి కాకుండానే చైర్మన్‌ పదవులను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్‌ పదవుల పందేరం ఉంటుందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు జిల్లాకు గతంలో కేటాయించిన నాలుగు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల పరిశీలనలో తమ పేరు ఉండేలా పార్టీలోని ముఖ్య నాయకుల ద్వారా అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన లావుడ్యా రాములునాయక్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బలం రెండుకు చేరగా.. టీఆర్‌ఎస్‌ తరఫున ఒక ఎమ్మెల్సీ, ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొనసాగుతుండడం విశేషం. అయితే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న కొండబాల కోటేశ్వరరావుకు కార్పొరేషన్‌ పరంగా మరింత ప్రాధాన్యత కలిగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top