టీఆర్‌ఎస్‌ నేతల జనం బాట!

టీఆర్‌ఎస్‌ నేతల జనం బాట!


సీఎం అసంతృప్తి నేపథ్యంలో కదులుతున్న ప్రజాప్రతినిధులు

సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం

ఆర్భాటంగా గొర్రెల పంపిణీ, డబుల్‌ ఇళ్ల శంకుస్థాపనల వంటి కార్యక్రమాలు

నియోజకవర్గాలవారీగా టీఆర్‌ఎస్‌ కుటుంబ సమ్మేళనాలు
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లోకి వెళ్లడం లేదని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు జనంలోకి వెళ్లకపోవడం కూడా దీనికి కారణమన్న సీఎం కేసీఆర్‌ ఆగ్రహం నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు జనం బాట పడుతున్నారు. ఇకనైనా మంత్రులు, నేతలు మారాల్సిందేనని.. ప్రభుత్వం, పార్టీ జోడెడ్ల మాదిరిగా పనిచేయాలని కేసీఆర్‌ కొంతకాలంగా గట్టిగా చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అధికార పార్టీకి చెందిన వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ కుటుంబ సమ్మేళనాలు జరపాలని, పార్టీ కేడర్‌తో పాటు ప్రజా నీకాన్ని సమీకరించి సమస్యలు తెలుసుకోవాలని, వీలైతే అక్కడికక్కడే పరిష్కరించాలని దాదాపు నెల రోజుల కింద ఆదేశించారు కూడా.  శనివారంనాటి కేబినెట్‌ భేటీలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మంత్రులు, ఇత ర ప్రజాప్రతినిధులు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను రూపొందించుకునే పనిలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభంకానున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్లేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.ప్రభుత్వ పథకాలు వేదికగా..

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేదికగా నిత్యం ప్రజలతో సంబంధాల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరుల్లో 70 కోట్ల చేపల పెంపకానికి సీడ్‌ సరఫరా> కార్యక్రమం జరగనుంది. మరోవైపు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపనల కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో, ప్రధానంగా మున్సి పాలిటీల్లో వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో సంబంధిత జిల్లాల మంత్రులు, ఎంపీలు, మంత్రి కేటీఆర్‌ పాల్గొంటూ మినీ బహిరంగ సభలు సైతం నిర్వహిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికారిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. మంత్రులు తమ సొంత జిల్లాల్లోనే కాకుండా, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు సంబంధించిన కార్యక్రమాల కోసం ఇతర జిల్లాల పర్యటనలూ పెట్టుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.వివిధ స్థాయిలకు చెందిన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోకి వెళ్లడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళతాయని... అది రాజకీయంగా పార్టీకి లాభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కింది స్థాయి కేడర్‌ను సైతం కలుపుకొని వెళ్లేలా నియోజకవర్గాల స్థాయిలో ‘టీఆర్‌ఎస్‌ కుటుంబ సమ్మేళనాలు’జరగనున్నాయి. తెలంగాణకే ప్రత్యేకమైన ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయని... వాటిని తిప్పికొట్టేందుకు పార్టీ కుటుంబ సమ్మేళనాలు ఉపకరిస్తాయని చెబుతున్నారు. మొత్తానికి అధినేత ఆదేశాలతో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు జనం బాట పట్టనున్నారు.

Back to Top