కాంగ్రెస్‌ లక్ష్యంగా..

TRS Focus In Nalgonda Congress Leaders - Sakshi

నల్లగొండ రాజకీయం రంగులు మారనుందా..? తమ రాజకీయ భవిష్యత్‌ కోసం కొందరు ముఖ్య నేతలు తమ మాతృ పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌ నీడన చేరే ప్రయత్నాలు చేస్తున్నారా ? కాంగ్రెస్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు గులాబీ దళపతి ఆయా స్థానాల్లో నేతలకు ఆర్థిక సాయం చేస్తున్నారా?  విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం చూస్తుంటే  పై ప్రశ్నలకు అవుననే జవాబు వస్తోంది. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ కార్యాచరణకు పదును పెడుతున్నారు. గత ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సమ ఉజ్జీలుగానే నిలిచాయి. కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలంతా జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడం, అధికార టీఆర్‌ఎస్‌తో అమీతుమీ  తేల్చుకునే రీతిలో మాట్లాడుతుండడంతో నల్లగొండపై పూర్తి ఆధిపత్యం కోసం టీఆర్‌ఎస్‌ నేతల్లో పట్టుదల పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాల్లో చేరికలపై దృష్టి పెట్టారు. ఈ నేతల అనుచరులను తమ పార్టీలోకి లాగేసుకోవడం ద్వారా వారిని బలహీన పరిచేలా ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

స్థానిక నేతలకు ఆర్ధిక సాయం?
జిల్లాలో టీఆర్‌ఎస్‌కు దక్కకుండా పోయిన నియోజకవర్గాల్లో పట్టును పెంచుకునేందుకు, వివిధ కార్యక్రమాల కోసం పార్టీ అధినేత నుంచి పెద్ద మొత్తంలోనే ఆర్థిక సాయం అందుతోందని విశ్వసనీయ సమాచారం. తద్వారా కాంగ్రెస్‌ ముఖ్యుల స్థానంలో బలపడడంతో పాటు, ఈ సారి ఎన్నికల్లో వారిని ఓడించేందుకు ఇప్పటినుంచే పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని అంటున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయడంతోపాటు, నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం కలెక్టర్‌ పరిధిలో రూ.నూరుకోట్ల ఫండ్‌ను సిద్ధంగా పెట్టనున్నారని, ఇందులో ఇప్పటికే రూ.50 కోట్లకు అనుమతులు కడా వచ్చాయని చెబుతున్నారు. అంతే కాకుండా రాజకీయ కార్యకలాపాల నిర్వహణ కోసమూ అవసరమైతే ఇన్‌చార్జులకూ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారని సమాచారం.

టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్న కాంగ్రెస్‌ నేత ?
కాంగ్రెస్‌ను బలహీన పరచడం కోసం టీఆర్‌ఎస్‌ ఆయా నాయకుల ముఖ్య నాయకులకు అన్నీ తామై వ్యవహరించే ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలోనే చేరికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న సమాచారం నల్లగొండ రాజకీయ వర్గాల్లో రెండు మూడు రోజులుగా గుప్పుమంటోంది. సదరు నేత టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వానికి టచ్‌లోకి వెళ్లడం కాదు, టీఆర్‌ఎస్‌ నాయకత్వమే ఆ నేతను ఆహ్వానిస్తోందన్న మరో వాదనా ఉంది.  సదరు నేతను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా తిరుగులేని రీతిలో పట్టు పెంచుకోవచ్చన అభిప్రాయంలో పార్టీ అగ్ర నాయకత్వం ఉందని అంటున్నారు. అసలు ఆ కాంగ్రెస్‌ నాయకుడు టీఆర్‌ఎస్‌లో చేరతారా ? ప్రస్తుతం జిల్లాలో ఉన్న నాయకత్వం ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుందా? చేరికకు అడ్డు పడుతుందా ? అన్న అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌ సిట్టింగులకు కొత్త తలనొప్పులు
అధికార టీఆర్‌ఎస్‌లో సిట్టింగు ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయని పే ర్కొంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్ద రు ముగ్గురు నాయకులు.. తమకేం తక్కువ, తామూ టికెట్‌ రేసులో ఉన్నామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కేవలం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే కాకుండా, ఇన్‌చార్జులు ఉన్న నియోకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకుల వర్గాలుగా ఏర్పడి రాజకీయం చేస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు ఇలా.. ప్రతి నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేలకు, ఇటు పార్టీ ఇన్‌చార్జులకు పోటీ నాయకత్వం తయారైందని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top