కండువాకు టికెట్‌ ఉచితం!

TRS also gave tickets to Parachute leaders - Sakshi

అలా చేరగానే.. ఇలా టికెట్‌

పారాచూట్‌ నేతలకుజై కొడుతున్న పార్టీలు 

అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి.. 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆ నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులే మీకు లేరాయే.. మీదీ ఓ పార్టీనేనా’వైరి పక్షంపై ఇలాంటి పదునైన విమర్శలు ఎన్నికల సమయంలో సర్వ సాధారణం. గెలుపు గుర్రాలకు దిక్కు లేని పార్టీలు ఇలాంటి విమర్శలను మోయాల్సిందే. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ మాటలు వినిపించవు. ఎదుటి పార్టీని అలా విమర్శిస్తూ వేలు చూపితే.. మూడు వేళ్లు సొంతపార్టీనే వెక్కిరించే పరిస్థితి ఉండటమే దీనికి కారణం. ఈ పార్లమెంటు ఎన్నికల విశేషాల్లో ఇప్పుడు ఈ అంశం కూడా చేరిపోయింది. ఏళ్ల తరబడి పార్టీ సేవలో కాలం వెళ్లదీసిన వారిని వెక్కిరిస్తూ పారాచూట్‌ నేతలు అమాంతం టికెట్లు ఎగరేసుకుపోయారు. అప్పటికప్పుడు పార్టీలో చేరి కండువాతో పాటు టికెట్‌నూ జేబులో వేసుకోగలిగారు. పార్టీతీర్థం పుచ్చుకోకముందే టికెట్‌ను ఖరారు చేసుకున్న నేతలూ ఉండటం ఈసారి హైలెట్‌. అన్ని ప్రధాన పార్టీల్లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. 

టీఆర్‌ఎస్‌ కూడా అంతేగా.. 
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్‌ చేసేందుకు సిద్ధమంటూ సంకేతాలిస్తున్న టీఆర్‌ఎస్‌ కూడా పారాచూట్‌ నేతలకు టికెట్లు ఇవ్వటం విశేషం. ఏ రోజు ఏ నేత పార్టీకి దూరమవుతాడో తెలియని గందరగోళ స్థితిలో కాంగ్రెస్, ఈ సారి తన ఖాతాలో ఉన్న ఒక్క సీటును నిలబెట్టుకోవటం సాధ్యమా అన్న అనుమానంతో బీజేపీలు పారాచూట్‌ నేతలవైపు దృష్టి సారించాయి. ఈ రెండు పార్టీలు ఒకటి చొప్పున టికెట్లను అలాంటి నేతల జేబుల్లో పెట్టాయి. 

కాంగ్రెస్‌తోనే శ్రీకారం.. 
పారాచూట్‌ నేతలకు టికెట్లు ఇచ్చే తంతుకు ఈ సారి కాంగ్రెసే శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల వేళ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. చేవెళ్ల అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఆయననే ఖరారు చేసింది. గత పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కార్తీక్‌రెడ్డి (సబితారెడ్డి తనయుడు) ఈ సారి కూడా టికెట్‌ ఆశించారు. అయితే కొండా వైపే కాంగ్రెస్‌ మొగ్గు చూపుతోందని గ్రహించిన సబితారెడ్డి.. కార్తీక్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. 

అనూహ్యంగా నామాకు గులాబీ టికెట్‌.. 
చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరిగా ముద్రపడ్డ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావును అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ వరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా అప్పటి నుంచే టీఆర్‌ఎస్‌కు క్రమంగా దగ్గరవుతూ వచ్చారు. నిన్నటి వరకు టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన నామాకు కీలకమైన ఖమ్మం ఎంపీ టికెట్‌ కేటాయించి గులాబీ బాస్‌ అందరినీ విస్మయపరిచారు. ఖమ్మంలో పార్టీ అంతగా బలంగా లేకపోవటం, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఒక్క సీటు మాత్రమే గెలవడంతో ఖమ్మం ఎంపీ స్థానం గెలిచేందుకు ఆ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఆ రెండు పార్టీలు డీలా పడేలా చేసింది.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా, ఉన్నపలంగా నామాను పార్టీలో చేర్చుకుని గులాబీ కండువాతో పాటు టికెట్‌ ఇచ్చారు. అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటానికి కొన్ని గంటల ముందే ఆయన పార్టీలో చేరటం విశేషం. పెద్దపల్లి టికెట్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి ఒక్కరోజు ముందే పార్టీలో చేరిన నేతకాని వెంకటేశ్‌కు దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో ఓడిపోయిన వెంకటేశ్‌ గురువారం కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సాయంత్రం ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్‌ ఖరారైంది.

క్లైమాక్స్‌లో బీజేపీ హడావుడి
నామినేషన్ల సమయంలో బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను టీఆర్‌ఎస్‌ శరవేగంగా పార్టీలో చేర్చుకుంటుండటంతో, అదే పంథాను అవలంబించి గెలుపు గుర్రాలకు ఎంపీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ వల పన్నగా మిగిలిన ముఖ్య నేతలతో టచ్‌లోకెళ్లిన కమలనాథులు తుదకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణకు కాషాయ కండువా కప్పారు. బుధవారం ఆమెను పార్టీలో చేర్చుకుని గురువారం అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని చోట్లా యత్నించినా ప్రయత్నం ఫలించలేదు. ఇలా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పారా చూట్‌ నేతలకు టికెట్లు ఇచ్చి వారికి పెద్దపీట వేశాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top