మళ్లీ పూటకూళ్ల ఇళ్లు !

Tourism Department Is Going To Launch House-Style Accommodation In Telangana. - Sakshi

హోటళ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో స్థానికుల ఇళ్లలోనే వసతి

తమిళనాడులో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్న విధానం

రాజస్తాన్‌లోనూ పర్యాటక ప్రాంతాల్లో కాసుల పంట

దాన్ని అనుసరించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన

కసరత్తు ప్రారంభిస్తామంటున్న పర్యాటక శాఖ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : పూటకూళ్ల ఇళ్లు.. మన తండ్రులు, తాతల కాలంలో ప్రతి ఊళ్లో ఉండేవని పెద్దలు చెబుతుంటే విన్నాం. దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారు చీకటి పడేసరికి దగ్గరున్న ఊళ్లోని పూటకూళ్ల ఇంట విశ్రాంతికి దిగేవారని చందమామ కథల్లో చదివాం కూడా. బాటసారులకు భోజనం, విశ్రాంతి తీసుకునేందుకు కల్పించే బసను పూటకూళ్ల ఇళ్లుగా వ్యవహరించే వారు. హోటళ్లు వచ్చిన తర్వాత ఇవి కనుమరుగయ్యాయి. కానీ కేంద్ర పర్యాటక శాఖ ఇప్పుడు వీటిని పునరుద్ధరించాలంటూ రాష్ట్రాలకు సూచిస్తోంది. ఆ మేరకు తెలంగాణలో కూడా అలనాటి పూటకూళ్ల ఇళ్ల తరహా వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ కసరత్తు మొదలుపెట్టబోతోంది.

ఎందుకీ ఇళ్లు
జలపాతాలు, పురాతన కట్టడాలు, వందల ఏళ్లనాటి దేవాలయాలు, హాయి గొలిపే అడవి అందాలు.. ఇలాంటి చూడదగ్గ ప్రాంతాలు తెలంగాణలో ఎన్నో. దట్టమైన అడవిలో ఉండే బొగత జలపాతం వద్దకు వెళ్తే తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకవు. ఆ ప్రాంతం అబ్బుర పరిచేదే అయినా, కనీస వసతి లేకపోవటంతో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తక్కువే. ఇక విదేశీ పర్యాటకుల జాడే ఉండదు. సూర్యో దయ వేళ ఆ ప్రాంతాన్ని చూడాలన్నా, సూర్యుడు అస్త మించే అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించాలన్నా రాత్రి వేళ ఆ ప్రాంతంలో ఉండాల్సిందే. కానీ పట్టణాలకు చేరువగా ఉన్న ప్రాంతాలు తప్ప రాష్ట్రంలో వేరే పర్యాటక ప్రాంతాల్లో అలాంటి వసతేలేదు. కచ్చితంగా చీకటి పడేసరికి సమీపంలోని పట్టణ ప్రాంతానికి చేరు కోవాల్సిందే. ఈ పద్ధతి మారాలంటే పూటకూళ్ల ఇళ్ల తరహా ఏర్పాటు ఉండాలనేది కేంద్ర పర్యాటక శాఖ అభిప్రాయం. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా అలాంటి ‘ఇంటి ఆతిథ్యం’అవసరమని స్పష్టం చేసింది.

రాజస్తాన్, తమిళనాడుల్లో భేష్‌ !
గతేడాది 1.5 కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌లో పర్యటించారు. ఇందులో 18 లక్షల మంది తమిళనాడును సందర్శించారు. తెలంగాణకు వచ్చినవారి సంఖ్య 3.8లక్షలు మాత్రమే. ఏటేటా తమిళనాడుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలా పెరిగేందుకు దోహదం చేస్తున్న అంశాల్లో పూటకూళ్ల తరహా ఇళ్ల వసతులు ఉండటమూ ఓ కారణమని తేలింది. కేంద్రప్రభుత్వం గతంలో ‘హోమ్‌ స్టే’పథకాన్ని రూపొందించింది. దీనికి ‘బెడ్, బ్రేక్‌ఫాస్ట్‌’స్కీంగా నామకరణం చేసింది. దీన్ని రాజస్తాన్, తమిళనాడులాంటి రాష్ట్రాలు బాగా అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో అది మొదలే కాలేదు.

ఏంటా విధానం?
పట్టణాలకే ఓ మోస్తరు హోటళ్లు పరిమితమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే చిన్నాచితకా టిఫిన్, చాయ్‌ హోటళ్లు తప్ప బస చేసే వెసులుబాటుండటం లేదు. విదేశీ పర్యాటకులను బెదరగొడుతున్న విషయమిదే. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ ‘బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌’పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ఉండేవారు తమ ఇళ్లలోని కొంత భాగాన్ని ఇలా పర్యాటకులు తాత్కాలికంగా ఉండేలా తీర్చిదిద్ది ఆదాయం పొందుతున్నారు. అలా ఏర్పాటు చేసేలా పర్యాటక శాఖ ప్రయత్నించి విజయం సాధించింది. కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తే ఎంతటి మారుమూల ప్రాంతానికైనా విదేశీ, స్వదేశీ పర్యాటకులు వస్తారని తేలింది.

తమిళనాడు, రాజస్తాన్‌ల్లో దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వచ్చేందుకు ఇదే కారణమవుతోంది. గ్రామాల్లో స్థానికులు తమ ఇంటిలోని కొంత భాగాన్ని పర్యాటకులు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వారికి తమ ఇంటి భోజనాన్నే వడ్డిస్తున్నారు. అది సురక్షిత ప్రాంతమనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. వాటి వివరాలు పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లలో పొందు పరచడంతో పర్యాటకులు ఎలాంటి జంకు లేకుండా అక్కడే రాత్రి బసచేసి సమీపంలోని ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా విధానం తెలంగాణలో కూడా ఏర్పాటయ్యేలా ప్రయత్నం చేస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇలా ఉండాలి !

  • ఆ ఇంటిలో కనిష్టంగా ఒక గది, గరిష్టంగా ఆరు గదులు పర్యాటకులకు కేటాయించాలి.
  • అందులోనే టాయిలెట్లు, స్నానాల గదులు కచ్చితంగా ఉండాలి. వెస్ట్రన్‌ మోడల్‌ టాయిలెట్‌ ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి.
  • ఇంటి యజమానులు కూడా అదే ప్రాంగణంలో నివాసం ఉండాలి. అక్కడే భోజన వసతి కల్పించాలి.
  • విద్యుత్తు వసతి, మంచాలు, శుభ్రమైన పరుపు, దుప్పట్లు, శుభ్రమైన నీటి వసతి, ఫ్యాన్, దోమల నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు అవసరం.
  • ఏసీ, కూలర్‌ లాంటి ఏర్పాట్లు ఉంటే మంచి వసతి గదులుగా పరిగణిస్తారు.
  • పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో నమోదు తప్పనిసరి
  • ఇలా వసతి గదులు ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా సంబంధిత పర్యాటకశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో అధికారులు ఆ గదులను పరిశీలించి యోగ్యంగా ఉంటే అనుమతిస్తారు. వాటి వివరాలు, సమీపంలోని పర్యాటక ప్రాంతాలు, ఫోన్‌ నెంబర్లు, ఇళ్ల ఫొటోలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వాటిని పర్యాటకులు ఆన్‌లైన్‌ ద్వారా చూసి ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  • భోజనం, అద్దె తదితర వివరాలు కూడా డిస్‌ప్లేలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ వివరాలు ఉండాలి.
  • తమిళనాడు, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉండటంతో పర్యాటకులు ఆయా ప్రాంతాలలో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు వస్తున్న స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది
రెండ్రోజుల క్రితం ఢిల్లీలో కేంద్రపర్యాటక శాఖ ఏర్పాటు చేసిన సదస్సులో దీనిపై చర్చ జరిగింది. తెలంగాణకు వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరగాల్సి ఉంది. ఇది జరగాలంటే ఈ తరహా ఏర్పాట్లు చాలా అవసరం. వీటిని గొప్పగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులు పరిశీలించి తెలంగాణలో కూడా వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి కసరత్తు ప్రారంభిస్తాం.
– పార్థసారథి, పర్యాటక శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top