రేపు కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సు

Tomorrow Kisan Congress Convention - Sakshi

హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంపై కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు గాను దక్షిణాది రాష్ట్రాల కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశమవనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనే ఈ ఒక్కరోజు సదస్సు మంగళవారం గాంధీభవన్‌లో జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా దక్షిణాది రైతుల పరిస్థితిపై ఇందులో చర్చించనున్నారు.  
మేనిఫెస్టో అంశాలపై ప్రతిపాదనలు .. 
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకొచ్చే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ప్రతిపాదనలు చేయడంతో పాటు వ్యవసాయ నిపుణులతో ఈ కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సులో చర్చించనున్నారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించగా, అందులో మొదటి సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది. ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ నానా పటోలేతో పాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సదస్సులో పాల్గొంటారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top