లాక్‌డౌన్‌.. లక్కీ

Tolichowki Malka Cheruvu Flyover Work Speed up - Sakshi

45 రోజుల్లోనే 20 పిల్లర్లు  

వడివడిగా భారీ ఫ్లై ఓవర్‌ పనులు

నిర్మాణ పనులకు కలిసి వచ్చిన లాక్‌డౌన్‌  

సాక్షి,సిటీబ్యూరో: కరోనా నేపథ్యంలో నగరంలో విధించిన లాక్‌డౌన్‌ పలువురికి పలు ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ.. నగరంలో పలు నిర్మాణ పనులకు కలిసి వస్తోంది. ముఖ్యంగా తీవ్ర ట్రాఫిక్‌రద్దీ ఉండే ప్రధాన రహదారుల మార్గాల్లో ఏపని చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు. ట్రాఫిక్‌ మళ్లింపులు.. పగలు పనిచేసే పరిస్థితి లేకపోవడం వంటి వాటితో ఎన్నో సమస్యలుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ లేకపోవడంతో పలు పనులకు ఎంతో వెసులుబాటు కలిగింది. ఈ లాక్‌డౌన్‌ను ఉపయోగించుకునే  టోలిచౌకి– మల్కంచెరువు మధ్యన 2.8 కి.మీ.ల పొడవుతో 73 పిల్లర్లతో నిర్మిస్తున్న భారీ ఫ్లై ఓవర్‌ పనులు వడివడిగా సాగుతున్నాయి. 24 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌  పనులకు సంబంధించి రెండేళ్లలో 53 పిల్లర్ల పనులు పూర్తికాగా ఈ 45 రోజుల్లో మరో 20 పిల్లర్ల పనులు పూర్తికావడం విశేషం.   పిల్లర్లపైన క్యాపింగ్‌ పనులు కూడా  చురుగ్గా జరుగుతున్నాయి.

మిగతా  8 పిల్లర్ల  పనులకు సంబంధించి భూసేకరణలో ఏర్పడిన అవాంతరాన్ని ఇటీవలనే అధిగమించినట్లు  ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. ఈ భూసేకరణకు సంబంధించి భూములు కోల్పోయేవారికి చెల్లించాల్సిన రూ. 23 కోట్లు కోర్టులో డిపాజిట్‌చేసి తొలుత రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. పిల్లర్ల పనులు కూడా లాక్‌డౌన్‌ సమయంలో ఒకస్థాయికి వస్తాయని  పేర్కొన్నారు. టోలిచౌకి–మల్కం చెరువు మధ్య నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌తో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లోని  నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ çసమస్యకు పరిష్కారం లభిస్తుందని బుధవారం ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్‌లతో కలిసి  పనులు పరిశీలించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో మార్చి 22 నుండి పనులు వేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దాదాపు సంవత్సరం క్రితం గర్డర్లను పైకిలేపుతుండగా, క్రేన్‌ దిగువనున్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో జరిగిన ప్రమాదంలో క్రేన్‌ ఆపరేటర్‌ మృతి చెందిన నేపథ్యంలో పనుల్లో కొంత జాప్యం జరిగింది.  

ప్రాజెక్ట్‌ వివరాలు ఎస్సార్‌డీపీ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 333.55 కోట్లు
సెవెన్‌ టూంబ్స్‌(షేక్‌పేట)  ఫిల్మ్‌నగర్‌ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్‌ విస్పర్‌వ్యాలీ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లుగా దీన్ని నిర్మిస్తున్నారు.
ఫ్లె ఓవర్‌ వెడల్పు: 4 మీటర్లు (ఆరు లేన్లు), రెండువైపులా ప్రయాణం
పనులు ప్రారంభం: ఏప్రిల్‌ 2018
పూర్తయిన పనులు:35 శాతం  
ప్రాజెక్ట్‌ పూర్తి ఎప్పటికి: డిసెంబర్‌ 2021
2035  సంవత్సరం నాటికి ఈ మార్గాల్లో పెరగనున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని సిగ్నల్స్‌ రహితంగా ప్రయాణం కొనసాగించేందుకు ఈ ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టారు.  
రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారికి, సిటీ కోర్‌ ప్రాంతం నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ తదితరప్రాంతాలవైపు వెళ్లేవారికి ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుతాయి.

వేగంగా పనులు : బొంతు రామ్మోహన్, మేయర్‌ 
లాక్‌డౌన్‌లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనుల్ని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా  పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులను ప్రాధాన్యతతో పూర్తిచేసేందుకు మంత్రి కేటీఆర్‌ రైల్వే ఉన్నతాధికారులతో  ప్రత్యేకంగా చర్చించారు.  పదిరోజుల్లో  ఆయా సమస్యలను ఒక కొలిక్కి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top