నిజామాబాద్‌ ఎన్నిక వాయిదా ప్రసక్తే లేదు..

There is no chance to postpone Nizamabad election  - Sakshi

ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక జోక్యం చేసుకోలేం

స్వతంత్ర అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేసింది. ఒకవేళ ఎన్నిక వాయిదా వేసేందుకు హైకోర్టు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తమకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించాలంటే, ఆ అధికారాన్ని ఎందుకు ఉపయోగించాలన్న దానికి పిటిషనర్లు స్పష్టమైన కారణాలు, ఆధారాలు చూపాల్సి ఉం టుం దని స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ చట్ట విరుద్ధంగా సాగుతోందని పిటిషనర్లు భావిస్తే, దానిపై ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునే స్వేచ్ఛ వారికి ఉందని తెలిపింది.

గుర్తుల కేటాయింపులకు సంబంధించి ఎన్నికల సంఘం నిబంధన రాజ్యాంగబద్ధతపై విచారణ చేపడతామని, ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరిస్తే, కేంద్రానికి నోటీసులు జారీ చేసి, ఆ నిబంధనపై వివరణ కోరుతామంది. అంతే తప్ప ఎన్నికను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమకు ఇప్పటివరకు గుర్తులను కేటాయించకపోవడం, వాటి నమూనాలను ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ ఎస్‌.రవి, మరో 15 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విష యం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.  పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ,  పిటిషనర్లు ఎంపిక చేసుకున్న గుర్తులను ఎన్నికల సంఘం ఇవ్వలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు  జోక్యం చేసుకోలేవని, ఈ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులు తమ చేతులను కట్టేశాయని తెలిపింది. కావాలంటే ఈ గుర్తుల విషయంలో ఎన్నికల సంఘం నిబంధన రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది.   కనీసం వారంపాటు అయినా ఎన్నికను వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా వాయిదా ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top