తెలంగాణలో బలోపేతానికి కమలం నక్ష

తెలంగాణలో బలోపేతానికి కమలం నక్ష - Sakshi


► టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బ్లూప్రింట్‌

► కాంగ్రెస్‌ తలలపై గురి..

► ఐదుగురు ఎమ్మెల్యేలు.. ఓ ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకునేందుకు పావులు

► ఇన్నాళ్లూ హస్తానికి అండగా ఉన్న సామాజిక వర్గంపై దృష్టి

► ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు

► అధికార పార్టీలోని అసంతృప్తులపైనా కన్ను

► దసరా నాటికి కార్యాచరణ అమల్లో పెట్టే దిశగా కసరత్తు




సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణపై పట్టుబిగించేందుకు బీజేపీ నక్ష గీస్తోందా? టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంపై సీరియస్‌గా దృష్టి సారించిందా? హస్తం పార్టీకి చెందిన ఐదుగురు కీలక ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కాషాయ కండువాలు కప్పేందుకు  ప్రణాళికలు రచిస్తోందా? అధికార టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను సైతం గుర్తించే పనిలో పడిందా? తాజా పరిణామాలను పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది! దక్షిణాదిన కర్ణాటక తర్వాత తమకు అత్యంత అనువైన రాష్ట్రం తెలంగాణ అని గుర్తించిన ఆ పార్టీ నాయకత్వం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏమాత్రం బలపడకపోవడం, పుంజుకునేందుకు పెద్దగా యత్నిస్తున్న దాఖలాలు కూడా లేకపోవడాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. అందుకు ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈ ఏడాది చివరికి నాటికి రాష్ట్ర కాంగ్రెస్‌లో అతి ముఖ్యమైన వారిగా భావిస్తున్న ఓ అర డజను మందిని బీజేపీలోకి చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికి లేదన్న భావన కలిగించాలని చూస్తోంది. ముఖ్యులైన నేతలను పార్టీలో చేర్చుకుంటే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ కూడా బీజేపీలోకి వస్తుందన్నది ఆ పార్టీ అంచనా. అదే జరిగితే కాంగ్రెస్‌లో మిగిలిన వారిలోనూ నైరాశ్యం పెంచడం ద్వారా తామే ప్రత్యామ్నాయమని వారంతా తమ పార్టీ వైపు చూడడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ ఆశ పడుతోంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో అసంతృప్తివాదులపైన దృష్టి సారించాలని భావిస్తోంది.



ప్రస్తుత లక్ష్యం.. ప్రత్యామ్నాయ శక్తి!

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమే బలమైన నమ్మకం కలిగించేందుకు ఇప్పటిదాకా ఢిల్లీ స్థాయిలో చేస్తున్న తెరచాటు ప్రయత్నాలు దసరా నాటికి బహిరంగమయ్యే అవకాశం ఉందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ‘‘ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యం మా పార్టీ అధినాయకత్వానికి ఉంది. దానికి తగ్గట్టే మేం ఒక ఎజెండాతో ముందుకు పోతున్నాం. దానిలో భాగంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను మా పార్టీ చెత్త బుట్టదాఖలు చేసింది’’ అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఇంతకాలం అండగా ఉంటూ వస్తున్న ఓ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.



ఎవరిపై గురి..?

ప్రజల్లో మంచిపేరున్న కాంగ్రెస్‌ నాయకులపై బీజేపీ అధినాయకత్వం గురి పెట్టింది. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న ఐదుగురితోపాటు ఓ శాసనమండలి సభ్యుడితో ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు పూర్తి చేశారు. తమ పార్టీలో చేరితే వారికి దక్కే ప్రాధాన్యం, భవిష్యత్‌లో ఉండే అవకాశాలపై వారికి స్పష్టతనిచ్చినట్లు తెలిసింది. ‘‘అవును.. నాతో బీజేపీ సీనియర్‌ నేతలు ఇద్దరు పలుమార్లు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పార్టీ ప్రయత్నాలు కనిపిస్తే చేరడానికి సుముఖమేనని వారికి చెప్పాం. కానీ ఇప్పటిదాకా వారి ప్రయత్నాలు అంతర్గతంగానే కొనసాగుతున్నాయి. నాకు తెలిసి దసరా నాటికి కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాతోపాటు బీజేపీలో చేరే అవకాశం ఉంది’’ అని కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. వీరేగాకుండా ప్రజల్లో మంచి పేరున్న ఇతర సీనియర్‌ నేతలతోనూ ఆ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇవి బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిపై బీజేపీ స్థానిక నేతలు కూడా సమాచారం లేకుండా వ్యవహరిస్తోంది. వచ్చే దసరా నాటికి కాంగ్రెస్‌ నుంచి ప్రధాన వలసలు ఉంటాయని, అప్పటికి తమ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.



టీఆర్‌ఎస్‌ అసంతృప్తవాదులకూ వల

తొలుత టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్న నమ్మకం కలిగించిన తర్వాతే టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా ఉంది. అలాంటి కొందరు నేతల జాబితాను ఆ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకంగా మారబోతోందని, పార్టీలో చేరితే మంచి భవిష్యత్‌ ఉంటుందని వారికి నచ్చజెప్పే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తాము పార్టీలో చేరేందుకు సుముఖమేనని, అయితే రాష్ట్రంలో ప్రత్నామ్నాయం ఇక బీజేపీయే అన్న నమ్మకం కలిగితే ఆలోచిస్తామని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ ఎంపీ, ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కమలం పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావు అని భావించేవారితోపాటు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న వారు కూడా చేరుతారని సదరు ఎంపీ బీజేపీ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top