ఆ 19 మందిని క్వారంటైన్‌కు..

Ten Year Old Girl Got Corona Positive Purigutta Thanda At Warangal District - Sakshi

‘పాజిటివ్‌’ బాలిక కలిసినట్లు తేలడంతో తరలింపు

పూరిగుట్ట తండాలో ఆరా తీసిన కలెక్టర్, అధికారులు

కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటన... 

ఇంటింటా వైద్యసిబ్బంది సర్వే

స్థానికులెవరూ బయటకు వెళ్లకుండా  కట్టుదిట్టమైన చర్యలు

హసన్‌పర్తి: అంతా సద్దుమణిగింది.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం లేదు... లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది... అని అందరూ భావిస్తున్న తరుణంలో మంగళవారం రాత్రి జిల్లాలోని గ్రేటర్‌ వరంగల్‌ 54వ డివిజన్‌ పూరిగుట్ట తండాకు చెందిన పదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో పది మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగతా 15 మందికి చికిత్స కొనసాగుతుండగా.. కొత్తగా కేసులు నమోదు కాని పక్షంలో జిల్లాను రెడ్‌ జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు మార్చే అవకాశం ఉండేది.

కానీ మంగళవారం రాత్రి కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు పూరిగుట్ట తండాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇక సదరు బాలిక ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం 19మందిని కలిసినట్లు గుర్తించిన అధికారులు వారందరినీ మంగళవారం రాత్రి నుంచి బుధవారం లోగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఇక తండా మొత్తం బల్దియా కార్మికులు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అలాగే, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ బాలిక ఎవరెవరితో కలిసిందో ఆరా తీయడంతో పాటు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

రెడ్‌ అలర్ట్‌
పూరీగుట్ట తండాలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో తండాను కంటైన్‌మెంట్‌ జోన్‌కు ప్రకటించారు. తండాలోకి కొత్త వారు రాకుండా, స్థానికులు బయటకు వెళ్లకుండా బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ రాజవ్‌గాంధీ హన్మంతు, నగర పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ రవీందర్, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లలితాదేవి తండాలో పర్యటించారు.

‘పాజిటివ్‌’ నమోదైన కుటుంబం ఇంటి నుంచి కిలోమీటర్‌ దూరం వరకు ఇంటింటా సర్వే చేసి అనుమానితులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే, తండావాసులు బయటకు రాకుండా ఇంటింటికి కూరగాయలు సరఫరా చేసేలా వాహనాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇక తండా మొత్తం సోడియం హైపోక్లోరైట్‌ ద్రవాణాన్ని పిచికారీ చేయించాలని ఆదేశించారు.

ప్రత్యేక పర్యవేక్షణ
తండాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని సీపీ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు. ఇందుకోసం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిని నియమించినట్లు చెప్పారు. డీఎంహెచ్‌ఓ లలితాదేవి మాట్లాడుతూ ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వస్తున్న వారితో కలిసి ఓ కుటుంబం పూరీగుట్ట తండాకు వచ్చినట్లు తెలియగా పరీక్షించడంతో పాజిటివ్‌గా నివేదిక అందిందని తెలిపారు. అయితే, బాలిక తల్లిదండ్రులు, సోదరుడికి మాత్రం నెగెటివ్‌గానే వచ్చిందని చెప్పారు.

సదరు బాలికను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. బాలిక కలిసి 19 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించామని చెప్పారు. అయితే, ఆమె ఇంకా ఎవరినైనా కలిసిందా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ జీతేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజం, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌ రాజు, స్థానిక వైద్యాధికారి మాలిక తదితరులు పాల్గొన్నారు.

ఎర్రబెల్లి నుంచి 8 మందిని క్వారంటైన్‌కు..
వేలేరు : మండలంలోని ఎర్రబెల్లి తండాకు చెందిన ఎనిమిది మందిని ప్రైమరీ కాంటాక్ట్‌ క్రింద బుధవారం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. హన్మకొండలోని పూరీగుట్ట ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం విదితమే. అయితే, ఎర్రబెల్లి తండాకు చెందిన ఓ కుటుంబం పూరీగుట్ట తండాలో 15 రోజులు ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలోని మొత్తం ఎనిమిది మందిని క్వారంటైన్‌కు తరలించి, పరీక్షల కోసం నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top