రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు

రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు


ఖజానాపై రెట్టింపైన అప్పుల భారం

కార్పొరేషన్ల పేరిట లెక్కకు మిక్కిలి రుణాలు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం రెండింతలైంది. రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన రూ.60 వేల కోట్ల అప్పు మూడేళ్లలోపే దాదాపు రెట్టింపైంది. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది రూ.10 వేల కోట్లు, రెండో ఏడాది రూ.16 వేల కోట్లు అప్పులు చేసింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే రూ.21 వేల కోట్లు అప్పు చేసింది. విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్‌ పథకంలో చేరడంతో తాజాగా మరో రూ.8,923 కోట్ల అప్పు డిస్కంల నుంచి రాష్ట్ర ఖజానాకు బదిలీ అయింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ.1.16 లక్షల కోట్లకు చేరింది. ఏటా ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రం రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో రుణ సమీకరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది! అవి చేసేవాటిని కార్పొరేషన్‌ రుణాలుగా చెప్పినా, అవి చెల్లించలేని పక్షంలో ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుంది.అప్పులు తెచ్చే కార్పొరేషన్లు

ఇంటింటికి తాగునీటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్‌ వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇదిప్పటికే ప్రైవేటు బ్యాంకుల నుంచి దాదాపు రూ.25 వేల కోట్ల రుణాలు సేకరించింది. మరో రూ.10 వేల కోట్లయినా అవసరమని అధికారులంటున్నారు. ప్రభుత్వం తొలిసారిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు నిధులు సమీకరించేందుకు కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్‌కు 5 రోజుల కిందటే ఆంధ్రా బ్యాంకుతో పాటు మొత్తం పది బ్యాంకుల నుంచి రూ.7,400 కోట్లు రుణం తీసుకున్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా హడ్కో ద్వారా రూ.3,340 కోట్ల రుణం తీసుకుంది. మరో రూ.12,600 కోట్ల అప్పు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇలా ఈ ఏడాది కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు దాదాపు రూ. 20 వేల కోట్లకు చేరువయ్యాయి.వాయిదాలకు రూ.7700 కోట్లు

ఇప్పటిదాకా చేసిన అప్పులు, వాటిపై వడ్డీలకు ప్రభుత్వం ఏటా రుణ వాయిదాలు చెల్లిస్తోంది. అలా ఈ ఏడాది రూ.7,700 కోట్ల వాయిదాలను చెల్లించింది. అప్పుల కుప్ప పెరిగిపోవటంతో వచ్చే ఏడాది వడ్డీల భారం రూ.9500 కోట్లకు చేరుతుందని అంచనా. కార్పొరేషన్లలో ఆర్టీసీకి మినహా మిగతావాటికి చెప్పుకోదగ్గ ఆదాయం లేదు. ఆర్టీసీ కూడా ఇప్పటికీ అప్పుల్లోనే ఉంది. పౌర సరఫరాల సంస్థ కూడా ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లు అప్పుల్లో ఉంది. ఈ కార్పొరేషన్ల అప్పులకు ప్రభుత్వమే గ్యారంటీ ఉన్నందున మున్ముందు ఈ భారం కూడా సర్కారుపైనే పడవచ్చు. ఓవైపు ఇలా భారీగా అప్పులు చేస్తున్నా, పలు శాఖలకు బడ్జెట్‌ నిధులు కూడా విడుదల చేయడం లేదు.రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడంతో మిగతా పథకాలు, శాఖలకు మొండిచేయి ఎదురైంది. ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,000 కోట్లు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి రూ.420 కోట్లతో పాటు వడ్డీ లేని రుణాలకు సైతం ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. 13వ ఆర్థిక సంఘం, గత రెండేళ్లుగా విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులనూ ఇప్పటికీ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. నిజానికి 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసిన 14 రోజుల్లోనే పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపిణీ చేయాలనే నిబంధనలున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.1,000 కోట్లు కేంద్రం కేటాయించింది. వాటిలో ఇప్పటికీ సగం కూడా స్థానిక సంస్థలకు చేరలేదు!

Back to Top