శ్రీశైలం నీటిమట్టం 802 అడుగులు ఉంచాలి

Telangana Govt Wrote Letter To krishna Board - Sakshi

కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా బేసిన్‌ పరిధిలో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 802 అడుగులు ఉంచాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. మిషన్‌ భగీరథలో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలు తీరాలంటే ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నిల్వల్లోంచి తదుపరి వినియోగం జరగరాదని పేర్కొంది. అలా అయితేనే తాగునీటికి ఇబ్బందులుండవని తెలిపింది. బుధవారం ఈ మేరకు కనీస నీటి మట్టాల నిర్వహణపై కృష్ణా బోర్డుకు ప్రభుత్వం లేఖ రాసింది.

నిజానికి శ్రీశైలంలో ప్రస్తుతం 802.20 అడుగుల మట్టంలో 30.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో 800 అడుగులకు పైన ఉన్నది కేవలం 1.1 టీఎంసీ మాత్రమే. అయితే ప్రస్తుతం శ్రీశైలం నుంచి కాల్వలకు నీటి విడుదల నిలిపేసినా పవర్‌హౌస్‌ ద్వారా 1,499 క్యూసెక్కుల మేర నీటి వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం కల్వకుర్తిలో భాగంగా ఉన్న ఎల్లూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవాలంటే శ్రీశైలం 802 అడుగుల మట్టంలో నీరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి ఎలాంటి అదనపు వినియోగం జరగకుండా చూడాలని బోర్డుని కోరింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకుని తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top