పొదుపు మంత్రమే!

Telangana Government Working On Next Budget Making - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ తయారీ కసరత్తును ప్రభుత్వ వర్గాలు ముమ్మరం చేశాయి. వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో 2020–21 బడ్జెట్‌ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శాఖల వారీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల విభాగాధిపతులతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యతలను, బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీలో పాటించాల్సిన నిబంధనల గురించి వివరించిన ఆయన గురువారం నుంచి శాఖల వారీగా 3రోజుల పాటు సమావేశం కానున్నారు. వీటిలో శాఖల వారీ ప్రతిపాదనలపై కూలంకశంగా చర్చించి తుది ప్రతిపాదనల కోసం సూచనలు చేయనున్నారు.  

ఆ రెండే కీలకం
ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో ప్రభుత్వం రెండు అంశాలకే ప్రాధాన్యమివ్వనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన రైతుబంధు, హాస్టళ్లకు సన్నబియ్యం, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిగిలిపోయిన మిషన్‌ భగీరథ పనులు లాంటి అంశాలకు పెద్ద పీట వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈసారి తమకు రూ.43వేల కోట్లు కావాలని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా, కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులకు ప్రాధాన్యమిస్తూ కొంత సవరించాలని ఆర్థిక శాఖ సూచించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు, దైనందిన ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో స్పష్టత లేకపోవడం, ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికం వరకు ఉండే అవకాశం ఉండటంతో పొదుపు మంత్రాన్ని పాటించనుంది.

అందులో భాగంగానే వివిధ శాఖల విభాగాధిపతులతో నిర్వహించిన సమావేశంలో అనవసరపు అంచనాలకు వెళ్లవద్దని సీఎస్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా సివిల్‌ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ఏడాదికి గాను 2019 ఫిబ్రవరిలో పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.1.82లక్షల కోట్ల అంచనాలతో ప్రతిపాదించగా,సెప్టెంబర్‌లో పెట్టిన సాధారణ బడ్జెట్‌లో దాన్ని 1.46లక్షల కోట్లకు తగ్గించారు. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రస్తుత రెవెన్యూ రాబడుల్లో ఆశించిన మార్పు రాకపోవడం, ఆర్థిక మాంద్యం వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉండటంతో 2020–21 సంవత్సరంలో కూడా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భారీ అంచనాలకు అవకాశం లేదని, గత ఏడాది కన్నా మరో 10% అంచనాలను అధికంగా ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది.

సమావేశాల షెడ్యూల్‌ ఇదే..
జనవరి 23: పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్య శాఖ, వ్యవసాయం, సహకారం, విద్యాశాఖలు 
జనవరి 24: నీటిపారుదల, రోడ్లు–భవనాలు, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి, పురపాలన, పౌర సంబంధాలు, విద్యుత్, వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ, దేవాదాయశాఖలు 
జనవరి 25: వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రెవెన్యూ, రవాణా, గనులు, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, హోం, పౌరసరఫరాలు, ప్రణాళిక, న్యాయ, సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top