ఒక కేసు ఉంటే.. 100 ఇళ్లకు.. కంటైన్మెంట్‌

Telangana Government Strict About Corona Cases Over Speed Spreading - Sakshi

పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటు 

ఆ జోన్లలో ఇళ్ల నుంచి ఒక్కరు కూడా బయటకు రావొద్దు

వచ్చిపోయే వారి వివరాల రికార్డు 

కనిష్టంగా 8 అడుగుల ఎత్తుతో బారికేడ్లు

జోన్‌లోని వారందరికీ మాస్కులు

వైరస్‌ చైన్‌ తెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు

సాక్షి, హైదరాబాద్‌ : ఏ ఒక్క ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు బయటపడినా.. ఆ ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ జోన్‌లోకి అన్ని మార్గాలు, రోడ్లు మూసేసి.. వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే దారి ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఉండాలని తెలిపింది. అపార్ట్‌ మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలో పాజిటివ్‌ కేసు బయటపడితే వాటి పరిధి వరకు మాత్రమే కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయొచ్చని స్పష్టం చేసింది. కేసుల సంఖ్యను బట్టి 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ కేసులుంటే కనీసం 250 మీటర్ల పరిధిలో జోన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. జోన్లకు బారికేడ్లతో పకడ్బందీగా సరిహద్దులు ఏర్పాటు చేయాలని, తగినంత బఫర్‌ జోన్‌ కూడా ఉండాలని పేర్కొంది. కంటైన్మెంట్‌ జోన్‌కు వెళ్లే అన్ని మార్గాలను 8 అడుగుల ఎత్తున్న బారికేడ్లతో మూసేయాలని స్పష్టం చేసింది. సరైన కారణాలు లేకుంటే కంటైన్మెంట్‌ జోన్‌ లోపలికి, బయటకు వేళ్లేందుకు ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించింది. ఈ మేరకు కంటైన్మెంట్‌ జోన్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ అమలు చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ మరో ఉత్తర్వు జారీ చేశారు. 

గడప దాటొద్దు..
జోన్‌ పరిధిలోని ప్రజలు ఇల్లు దాటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. తమ ఇంటిముందు ఉన్న ఫుట్‌పాత్‌లపై కూడా నడవొద్దు. కంటైన్మెంట్‌ జోన్లని తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరి రాకపోకలు రికార్డు చేస్తారు. వ్యాధినిరోధక చర్యల్లో భాగంగా నిర్ణీత వ్యవధుల్లో మాస్కులు అందజేస్తారు. 

ఇళ్ల వద్దకే నిత్యావసరాలు..
ప్రజలకు అవసరమైన సరుకులు ఇళ్లకు చేర్చేందుకు వాటి విక్రేతలు, రైతుబజార్‌ వ్యాన్లు, సూపర్‌మార్కెట్లు, కిరాణా, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులతో నోడల్‌ అధికారి మాట్లాడి ఏర్పాట్లు చేస్తారు. రోజూ మద్యాహ్నం 12 గంటల లోగా నిత్యావసరాలను ఇళ్ల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కూరగాయలు, పాలు అందుబాటులో ఉంచుతారు. ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంటారు. నిత్యవసరాల సరఫరాకు బాధ్యుడైన నోడల్‌ అధికారి పేరు, ఫోన్‌ నంబర్‌ తో తెలుగు, ఉర్దూలో కరపత్రాలు పంచుతారు. ప్రజలు ఏం చేయొచ్చో, ఏం చేయరాదో రికార్డు మెసేజ్‌ ఆటో ద్వారా ప్రచారం చేస్తారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులు బయటపడిన ఇంటివారికి నిత్యావసరాలు పంపిణీ చేసే ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ధరించాలి. 

ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష     
కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో నివాసముండే ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను రోజూ అధికారులు అడిగి తెలుసుకుంటారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తారు. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయితే ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. నెగెటివ్‌ రిపోర్టు వస్తే వారిని తప్పనిసరి హోం ఐసోలేషన్‌లో ఉంచుతారు. కొత్త పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే ప్రైమరీ కాంటాక్ట్‌ వివరాలను రూపొందిస్తారు. కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి ఆరోగ్య స్థితిని బట్టి క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌కు తరలిస్తారు. 

అనాథలకు ఉచిత భోజనం..
కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో ఇళ్లు లేని అనాథలను గుర్తించి షెల్టర్‌ హోమ్స్‌ కు తరలిస్తారు. ఒక కుటుంబానికి చెందిన వారందరినీ ఒకే చోట చేర్చుతారు. వలంటీర్లు లేదా అన్నపూర్ణ పథకం ద్వారా వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. వలస కార్మికులకు కూడా భోజన సదుపాయం కల్పిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top