ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు వాయిదా

Telangana Engineering Web Options Postpone Again - Sakshi

జూలై 5 నుంచి ప్రారంభించేలా రివైజ్డ్‌ షెడ్యూల్‌ జారీ 

ఏఎఫ్‌ఆర్‌సీకి 10వ తేదీ వరకు లభించనున్న సమయం

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జూలై 5 నుంచి నిర్వహించేలా ప్రవేశాల కమిటీ ఆదివారం రివైజ్డ్‌ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల వ్యవహారం పూర్తిగా తేలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 27 నుంచి జూలై 4 వరకు ఆప్షన్లకు అవకాశం కల్పించేలా కమిటీ షెడ్యూల్‌ జారీ చేసింది. అయితే కాలేజీల ఫీజుల వ్యవహారం తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్లను జూలై 1కి వాయిదా వేసింది. ఆదివారం వరకూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల ఫీజుల వ్యవహారం తేలకపోవడంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్లను 5 నుంచి ప్రారంభిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. అంటే 5వ తేదీ నుంచి మరో నాలుగైదు రోజులు వెబ్‌ ఆప్షన్లకు, చివరి రోజున ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశమిస్తారు. ఈ లెక్కన 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు.
 
ఈలోగా ఫీజులు ఖరారు! 
సవరించిన షెడ్యూల్‌ ప్రకారం మొత్తానికి 10 రోజుల సమయం ఉండనుంది. ఈలోగా కోర్టును ఆశ్రయించిన కాలేజీల ఫీజులను ఖరారు చేయాలన్న నిర్ణయానికి ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) వచ్చింది. శనివారం కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఏఎఫ్‌ఆర్‌సీ.. రూ. 50 వేల లోపు ఫీజు ఉన్న కాలేజీలకు 20%, రూ. 50 వేలకు పైగా ఫీజు ఉన్న కాలేజీలకు 15% ఫీజులను పెంచుతామని ప్రతిపాదించగా.. మెజారిటీ కాలేజీలు అంగీకరించాయి. కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లోనూ చాలావరకు అంగీకారం తెలిపాయి. కోర్టును ఆశ్ర యించిన 81 కాలేజీల్లో ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదిత ఫీజుకు గరిష్టంగా 20 కాలేజీలు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 20 కాలేజీలకు నాలుగైదు రోజుల్లో ఫీజులను ఖరారు చేసే అవకాశం ఉంది.  

వీలైతే అన్నింటి ఫీజు ఖరారు.. 
తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10 వరకు సమయం లభించనుంది. దీంతో కోర్టును ఆశ్రయించినవే కాకుండా వీలైతే మిగతా అన్ని కాలేజీల ఫీజులనూ ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఏఎఫ్‌ఆర్‌సీ ఉంది. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 12 వరకు పనిచేసేలా షెడ్యూల్‌ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతోంది. ఇప్పటికే అన్ని కాలేజీల రెండేళ్ల ఆదాయ వ్యయాలు, ఇప్పటి నుంచి మూడేళ్లు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల ప్రతిపాదనలు ఏఎఫ్‌ఆర్‌సీ వద్ద ఉన్నాయి. కాలేజీల వారీగా అన్ని లెక్కలను క్రోడీకరించి ఏఎఫ్‌ఆర్‌సీ తరఫున ఉన్నత విద్యా మండలి సిద్ధం చేసి ఉంచింది. దీంతో 197 ఇంజనీరింగ్, 122 బీఫార్మసీ కాలేజీల ఫీజుల ఖరారుకు పెద్దగా సమయం పట్టదన్న ఆలోచనల్లో ఉంది. కోర్టునాశ్రయించిన కాలేజీలే కాదు.. వీలైతే కోర్టును ఆశ్రయించని కాలేజీల ఫీజులనూ త్వరగా ఖరారు చేసేలా కసరత్తు ప్రారంభించింది. తాత్కాలిక పెరుగుదల కాకుండా తరువాత ఎంత పెరుగుతుందోనన్న ఆందోళన లేకుండా చూడాలని ఆలోచిస్తోంది. 

చివరి తేదీ నాటికి కాకపోతే.. 
ఈ నెల 10 నాటికి అన్ని కాలేజీల ఫీజు ఖరారు చేయలేకపోతే యాజమాన్యాలు అంగీకరించిన 20 శాతం, 15 శాతం ఫీజు పెంపును అమలు చేయాలని భావి స్తోంది. కోర్టును ఆశ్రయించిన కాలేజీలతోనూ సోమ వారం భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో తమ పెంపునకు అంగీకరిస్తే సులభంగా ముందుకు వెళ్లవచ్చని, కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వ హించవచ్చని యోచిస్తోంది. లేదంటే వాటికి ఫీజును నిర్ణయించి, మిగతా వాటికి తాము ప్రతిపాదించిన పెంపును అమలు చేయనుంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 53,364 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోగా, ఆదివారం నాటికి 37,413 మంది వెరిఫికేషన్‌ చేయించుకున్నారు. ఈ నెల 3 వరకు వెరిఫికేషన్‌కు సమయం ఉంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top