మోగిన ఎన్నికల గంట

Telangana Elections Schedule Released - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల గంట మోగింది. శాసనసభ సమర భేరికి కేంద్ర ఎన్నికల సం ఘం (సీఈసీ) ముహూ ర్తం ఖరారు చేసింది. సరిగ్గా రెండు నెలలు పూర్తయ్యేసరికి ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. గత నెల ఆరో తేదీ న శాసనసభను అర్ధంతరంగా రద్దు చేసిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికలకు తెరలేపా రు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

ఎన్నికల సమరానికి తెర లేవడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అభ్యర్థులను ప్రకటించి కదనరంగంలో అందరికంటే ముందే దూకిన టీఆర్‌ఎస్‌కు తాజా పరిణామం సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్నికలను అడ్డుకునేందుకు విపక్షాలు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తుండగా.. ఈసీ నిర్ణయం తమకు అనుకూలించనుందని భావిస్తోంది. విపక్షాలకు మాత్రం ఈ పరిణామం మింగుడుపడడం లేదు. ఓటర్ల తుది జాబితా ప్రచురణ అనంతరమే షెడ్యూల్‌ వస్తుందని అంచనా వేసిన ఆ పార్టీల లెక్క తప్పింది. దీంతో గెలుపుగుర్రాలను తక్షణమే ప్రకటించే ఆలోచన చేస్తోంది.
 
సర్వం సమాయత్తం 
ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శాససనసభ రద్దయిన మరుక్షణమే ఎన్నికల క్రతువుపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 3200 పోలింగ్‌ కేంద్రాలను ఓటర్లకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అంతేగాకుండా ఎన్నికల విధులకు సుమారు 14వేల ఉద్యోగులను వినియోగించుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తొలిసారి ఈవీఎంలకు వీవీ పాట్‌ను అనుసంధానిస్తున్న తరుణంలో వాటి వినియోగంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు మాక్‌ పొలింగ్‌ కూడా నిర్వహించింది.

అంతేగాకుండా బధిర ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించకుండా ఇప్పటికే వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించిన జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌.. ప్రవర్తనా నియమావళిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు డిసెంబర్‌ 7న ఏకకాలంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 11న వెలువడనున్నాయి. వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న ఈసీ.. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనుంది.

నామినేషన్లకు ఆఖరి తేదీ నవంబర్‌ 19. నామినేషన్ల పరిశీలన 20వ తేదీ, ఉపసంహరణకు 22వ తేదీ చివరి గడువు. ఈమేరకు ఆయా సెగ్మెంట్లకు రిటర్నింగ్‌ అధికారులను కూడా జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్డీఓలే రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి స్టేడియం, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం సహా కల్వకుర్తిలోని ప్రభుత్వ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top