పొడుస్తున్న పొత్తు.. పోటాపోటీ కసరత్తు

Telangana Elections 2018 Interesting Politics In Medak - Sakshi

రాష్ట్ర శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జహీరాబాద్‌ మినహా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ‘మహా కూటమి’ పేరిట కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పొత్తు కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌తో పాటు మహాకూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఆసక్తి నెలకొంది. మహా కూటమి ఏర్పాటయ్యే పక్షంలో ఏయే అసెంబ్లీ స్థానాలను కోరాలనే అంశంపై భాగస్వామ్య పార్టీలు లోలోన కసరత్తు చేస్తున్నాయి.
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి 

శాసనసభకు జరిగే ముందస్తు ఎన్నికల్లో ‘మహా కూటమి’ పేరిట సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌ ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే నాటికి మహా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పోటీ చేసే శాసనసభ స్థానాల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు, బలాబలాలు, అభ్యర్థులపై ప్రతిపాదిత మహాకూటమి భాగస్వామ్య పార్టీలు అంతర్గతంగా కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ పరిధిలో జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం మినహా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు.

శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్‌ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. దీంతో ముందస్తు ఎన్నికల్లో ‘మహాకూటమి’ భాగస్వామ్య పక్షంగా తాము పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్, ఇతర పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల అవగాహనలో భాగంగా హుస్నాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది. దాదాపు ఏడాదిన్నరగా నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన సీపీఐ పక్షాన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కనీసం రెండు స్థానాల్లో టీడీపీ
తొలిసారిగా కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కనీసం రెండు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. టీటీడీపీ ముఖ్య నేతలు పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావు గురువారం హైదరాబా ద్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. నర్సాపూర్‌ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన తప్పనిసరిగా ఉంటుందని, మహా కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాల్సిందిగా దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా జిల్లాలో టీటీడీపీ కోరాల్సిన అసెంబ్లీ స్థానాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

2014 ఎన్నికల్లో పార్టీ రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలను సీట్ల సర్దుబాటులో భాగంగా కోరాలని జిల్లా నేతలు సూచించారు. 2014 ఎన్నికల్లో పటాన్‌చెరు, గజ్వేల్‌లో టీటీడీపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పటాన్‌చెరు నుంచి పోటీ చేసిన సపాన్‌దేవ్‌ టీఆర్‌ఎస్, గజ్వేల్‌ నుంచి పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కనీసం రెండు స్థానాల కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. 2009, 2014 ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉండడం, టీడీపీకి గట్టి పట్టు ఉండడంతో జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్‌ ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్‌ నుంచి వరుస ఓటమి చవి చూసినా తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరోత్తం కోరుతున్నారు.

మూడు స్థానాల కోసం టీజేఎస్‌ పట్టు..
ఉమ్మడి మెదక్‌ పరిధిలో కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి ఆసక్తి చూపుతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలతో ఏర్పాటయ్యే మహాకూటమిలో భాగంగా కొత్త జిల్లాల ప్రాతిపదికన కనీసం ఒక్కో స్థానంలో అంటే ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాలు కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మహాకూటమితో సీట్ల సర్దుబాటు, కోరాల్సిన స్థానాలపైనా ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెలిసింది. సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక స్థానాలను పొత్తులో భాగంగా కోరాలని టీజేఏసీ భావిస్తోంది. సాధ్యం కాని పక్షంలో కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు సంగారెడ్డి, మెదక్, దుబ్బాక కోసం పట్టుబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 

కాంగ్రెస్‌ వైఖరి  కీలకం..
మహా కూటమిలో భాగంగా భాగస్వామ్య పార్టీలు కోరే స్థానాలపై కాంగ్రెస్‌ ఆశావహుల్లో అయోమయం నెలకొంది. పొత్తులో భాగంగా భాగస్వామ్య పార్టీలకు సీట్లు వదిలే పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హుస్నాబాద్, సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు స్థానాలు మాత్రమే భాగస్వామ్య పార్టీలకు వదిలే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆశావహ అభ్యర్థులు లెక్కలు వేస్తున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ నేతల నడుమ టికెట్ల కోసం పోటీ, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమకు కేటాయించే అవకాశం ఉందని టీజేఎస్‌ భావిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top