ప్రజల ఆకాంక్షలే ఎజెండా

Telangana Elections 2018 Congress Party Grand Alliance - Sakshi

ఐక్యంగా ముందుకెళ్తామన్న మహాకూటమి నేతలు

టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడతామని ధీమా

వచ్చేనెల 2 కల్లా ప్రజల ముందుకు కనీస ఉమ్మడి ప్రణాళిక

కూటమిలో మరిన్ని పార్టీలు చేరేందుకు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలే తమ కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్‌ మినిమం ప్రోగ్రాం)లో ప్రధాన ఎజెండాగా ఉంటుందని మహాకూటమి నేతలు ప్రకటించారు. వివిధ పార్టీలకు వేర్వేరు మేనిఫెస్టోలున్నా ప్రజాకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా ఉమ్మడి ప్రణాళికను వచ్చే నెల 2వ తేదీ నాటికి ప్రజల ముందుకు తెస్తామని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడేందుకు ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు కూటమి నేతలు శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమ య్యారు. ఈ భేటీకి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, టీజేఎస్‌ అధినేత కోదండరాం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సుమారు రెండు గంటలపాటు ఉమ్మడి ఎజెండా ఎలా ఉండాలన్న దానిపై చర్చించారు. తొలి, మలి దశ ఉద్యమ కారులకు గుర్తింపు, వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం, వ్యవసాయ రైతులకు దన్ను, యువతకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చ జరగలేదని నేతలు చెబుతున్నా దానిపైనా ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో సీట్ల పంపకాలపై చర్చించేందుకు నాలుగు రోజుల్లో మళ్లీ భేటీ కావాలని, కూటమిలోకి వచ్చే పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమే : ఉత్తమ్‌
రాష్ట్రంలో మహాకూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న పూర్తి నమ్మకం తనకు ఉందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా కానీ, ఇతర పార్టీలతో కానీ సీట్ల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయాలు జరగలేదని, పత్రికల్లో వస్తున్న అభ్యర్థుల పేర్లలో నిజం లేదన్నారు. కేసీఆర్‌ను తరిమికొట్టడం ఖాయమని, ఆ ఆలోచనల ప్రకారమే కూటమి ముందుకెళ్తుందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడితే ఎవరు ఎక్కడ నిలబడేదీ తేలుస్తామన్నారు. ప్రభుత్వం రద్దయ్యాక సైతం కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తున్నా ఎన్నికల కమిషన్, గవర్నర్‌ పట్టించుకోవడం లేదని ఉత్తమ్‌ ఆరోపించారు. అలా చేసిన టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మహాకూటమిలోకి మరిన్ని పార్టీలు వస్తాయని, తర్వాతి సమావేశాలకు ఆ పార్టీల నేతలు వస్తారని మీడియా ప్రశ్నలకు బదులిచ్చారు.

బీజేపీతో చర్చలు జరగలేదు : కోదండరాం
తెలంగాణ ఏర్పడితే న్యాయం జరుగుతుందని భావించామని, కానీ అలా జరగలేదని టీజేఎస్‌ అధినేత కోదండరాం పేర్కొన్నారు. అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మహాకూటమి పనిచేస్తుందని, టీఆర్‌ఎస్‌ను ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని తెలిపారు. త్వరలో కూటమి పేరు కూడా నిర్ణయిస్తామన్నారు. సీట్ల సర్దుబాటుపై ఇంతవరకు చర్చ జరగలేదని, ప్రస్తుతం కామన్‌ మినిమం ప్రోగ్రాంపైనే చర్చ జరుగుతోందన్నారు. పొత్తులపై బీజేపీతో ఎలాంటి చర్చలు జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయను కలిశారన్నది వాస్తవం కాదా అని విలేకరులు అడగ్గా మీరెవరైనా చూశారా అని ఎదురు ప్రశ్నించారు. ఉమ్మడి నాయకత్వంతో కూటమిలో ముందుకుపోతామన్నారు.

కూటమి అవసరం ఎంతైనా ఉంది : ఎల్‌. రమణ
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గ్రాండ్‌ అలయెన్స్‌ అవసరం ఎంతైనా ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడల వల్లే మహాకూటమి ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని శాశ్వతంగా ఫాంహౌస్‌లో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కూటమిలో భావసారూప్యత ఉంది : చాడ వెంకట్‌రెడ్డి 
మహాకూటమిలోని పార్టీల్లో భావసరూప్యత, సమన్వయం ఉన్నాయని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ముఖ్యమని, ఆ దిశగా ఎజెండా అమలు చేయడమే తమ లక్ష్యమన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top