కాంగ్రెస్‌లో కొత్తోళ్లే..!

Telangana Election Congress Party Alliance With TDP - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: మిత్రపక్షాలతో పొత్తులు.. మారుతున్న రాజకీయ పరిణామాలు.. ఈ క్రమంలో ఒకప్పుడు జిల్లాలో రాజకీయ చక్రం తిప్పి.. తమ కనుసన్నల్లో పార్టీని నడిపించిన సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో సీటు లభించడం అనుమానంగా మారింది. పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లి పోటీ చేయాల్సి రావడం.. మరికొన్ని చోట్ల సొంత నియోజకవర్గంలోనే మిత్రపక్షాలు పాగా వేయడం వంటి పరిణామాలతో వారిని ఎలా సర్దుబాటు చేస్తుంది.. మిత్రపక్షాలను ఎలా మెప్పించగలుగుతుందనే అంశం కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మినహా ఎక్కువ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్‌ నుంచి కొత్త ముఖాలే పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా.. సీపీఐ మూడు స్థానాలకు పోటీ చేసింది. ఏడింట్లో కాంగ్రెస్‌ నాలుగు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరగా.. ఇక్కడ పార్టీ తరఫున కొత్త అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంది. పాలేరు నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన రాంరెడ్డి వెంకటరెడ్డి కొద్ది కాలం క్రితం మరణించడంతో ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పోటీ చేశారు.

ఈసారి ఆమె రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పాలేరుకు సైతం కాంగ్రెస్‌ తరఫున కొత్త అభ్యర్థి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక అశ్వారావుపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన ఎన్నికల అనంతరం కొద్ది కాలానికే మరణించారు. దీంతో అక్కడ సైతం కొత్త అభ్యర్థి కాంగ్రెస్‌ నుంచి తెరపైకి రావాల్సిందే. భద్రాచలం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌  తరఫున పోటీ చేసిన కుంజా సత్యవతి ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. తర్వాత ఆమె బీజేపీలో చేరడంతో భద్రాచలంలోనూ కాంగ్రెస్‌ తరఫున కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాల్సిన పరిస్థితి నెలకొంది.
 
‘సంభాని’ సర్దుబాటుపై ఉత్కంఠ.. 
ఇక జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా.. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 2009లో నియోజకవర్గాల విభజన వల్ల పాలేరు నుంచి రాజకీయంగా సత్తుపల్లి నియోజకవర్గానికి వలస వెళ్లిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌.. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. డీసీసీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేసిన సంభాని.. కాంగ్రెస్‌తో మిత్రపక్షాలకు ఏర్పడే పొత్తు వల్ల ఈసారి సత్తుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోయే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని ఆశిస్తున్న టీడీపీ ఈ స్థానాన్ని తమ సిట్టింగ్‌ స్థానం కనుక తమకే ఇవ్వాలని పట్టుపట్టడం.. దీనికి కాంగ్రెస్‌ అధిష్టానం సానుకూలంగా స్పందించడంతో ఈసారి సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ మిత్రపక్షాల అభ్యర్థిగా టీడీపీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పోటీ చేయడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో సంభానికి.. పార్టీ జిల్లాలోని మూడు జనరల్‌ స్థానాల్లో ఎటువంటి సర్దుబాటు చేస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. అయితే సంభాని మాత్రం జనరల్‌ నియోజకవర్గమైన పాలేరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని, అనేకసార్లు అక్కడ గెలుపొంది పార్టీ.. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న దృష్ట్యా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే మళ్లీ భట్టితోపాటు 2014లో పోటీ చేసి.. మళ్లీ పోటీ చేసే అవకాశం కాంగ్రెస్‌ తరఫున లభించిన రెండో వ్యక్తిగా సంభాని ఉంటారు. అయితే నియోజకవర్గం మాత్రం మారినట్లు అవుతుంది.
 
ఒక్క చాన్స్‌..! 
కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్ర మంత్రిగా, సుదీర్ఘ కాలం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి, కొత్తగూడెంకు చెందిన వనమా వెంకటేశ్వరరావుకు సైతం ఈసారి ఎన్నికల పొత్తులో చిక్కులు తప్పని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్‌ ఎన్నికల మైత్రిలో భాగంగా కాంగ్రెస్‌ కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించగా.. మాజీ మంత్రి వనమా అప్పుడు పార్టీపరంగా అన్యాయం జరిగిందంటూ వైఎస్సార్‌ సీపీలో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి పరిస్థితి సైతం ఎన్నికల పొత్తు కారణంగా అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తనకు ఈసారి ఒక్క చాన్స్‌ ఇచ్చి చూడాలని, నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని.. తాము చేసిన అభివృద్ధి వల్ల కాంగ్రెస్‌ గెలిచి తీరుతుందని వనమా వర్గీయులు టీపీసీసీ నేతల ముందు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.
 
రేసులో రేణుక.. 
ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా శాసనసభ ఎన్నికలకు ఆమె కొత్త అభ్యర్థిగానే పరిచయమవుతారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలుత హైదరాబాద్‌ కార్పొరేటర్‌గా ఎన్నికై.. తర్వాత టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా సుదీర్ఘకాలం ఉండి.. కేంద్ర మంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన రేణుకా చౌదరి ఖమ్మం నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించగా.. ఒకసారి ఓటమి చెందారు. ఆ తర్వాత కొంత కాలానికి  రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. ఇన్ని పదవులు నిర్వహించిన రేణుకా> చౌదరి శాసనసభ ఎన్నిలకు మాత్రం కొత్త కావడం విశేషం. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఈ దఫా సీనియర్‌ నేతలకు సీట్ల సర్దుబాటు జరిగితేనే పాత వారు మళ్లీ పోటీ చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మినహా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ముఖాలే వచ్చే అవకాశం స్పష్టమవుతోంది.
 
విస్తృతంగా ‘రేగా’ కార్యకలాపాలు.. 
ఇక సీపీఐ, కాంగ్రెస్‌ ఎన్నికల మైత్రితో గత ఎన్నికల్లో పోటీ చేసిన వైరా, పినపాక నియోజకవర్గాల్లో ఎక్కడ కాంగ్రెస్‌ పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించినా వారూ కొత్తవారే అవుతారు. గత ఎన్నికల్లో పినపాక నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి.. ఎన్నికల పొత్తు కారణంగా సీటు సీపీఐకి కేటాయించడంతో త్రుటిలో టికెట్‌ కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈసారి పోటీ చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేశారు.
  
ఆశావహులు అనేక మంది.. 

ఇక ఖమ్మం, పాలేరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహుల పేర్లు వినిపిస్తున్నా.. వారిలో గత ఎన్నికల్లో పోటీ చేయని వారే ఎక్కువగా ఉండటం.. ఎవరికి టికెట్‌ లభించినా అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు కొత్త అభ్యర్థులుగానే ప్రజలకు పరిచయం కావాల్సిన పరిస్థితి. ఖమ్మం అసెంబ్లీ స్థానంపై కొంతకాలంగా దృష్టి సారించిన శాసన మండలి ఉప నేత నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈసారి ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. పార్టీలో తనకు గల పలుకుబడితో అధిష్టానాన్ని ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.

టికెట్‌ ఇవ్వాలని ఆయన చేస్తున్న డిమాండ్‌ నెరవేరితే సుధాకర్‌రెడ్డి ఖమ్మం నియోజకవర్గానికి కొత్త అభ్యర్థే అవుతారు. ఇక కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గతంలో టీడీపీ నుంచి రద్దయిన సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా.. 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయకపోవడంతో పార్టీ టికెట్‌ ఖరారైనా ఖమ్మం నియోజకవర్గానికి కొత్త అభ్యర్థే అవుతారు. అలాగే ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వద్దిరాజు రవిచంద్ర, మానుకొండ రాధాకిషోర్‌ సైతం శాసనసభ ఎన్నికలకు కొత్తవారే అవుతారు. వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తొలిసారిగా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగినట్లు అవుతుంది.
 
అక్కడా కొత్తవారే.. 
ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న హరిప్రియ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడి నుంచి అనేక మంది టికెట్లు ఆశిస్తున్నారు. హరిప్రియకు కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఓకే చేస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. మళ్లీ పోటీ చేసిన అభ్యర్థిగా హరిప్రియ ఉంటారు. అయితే పార్టీ మాత్రం మారినట్లు అవుతుంది. ఇక అశ్వారావుపేటలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత కొంత కాలానికి ఆయన మరణించారు. దీంతో అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున అనేక మంది టికెట్‌ ఆశిస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భవించాక రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున మిత్రసేన పోటీ చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇచ్చినా నియోజకవర్గానికి ఎన్నికల పరంగా కొత్తవారే అయ్యే పరిస్థితి నెలకొంది.
 
జలగం ప్రసాదరావు పోటీపై ఉత్కంఠ 
సుదీర్ఘకాలం తర్వాత జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. పాలేరు నుంచి జలగం ప్రసాదరావు పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. 1999 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రసాదరావును బహిష్కరించింది. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా దాదాపు 19 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నట్లు అవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top