‘సిట్టింగ్‌’లకే మళ్లీ టిక్కెట్లు

Telangana Early Elections Tensions Karimnagar Politics - Sakshi

తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో ఎన్నికల వేడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని తేలడంతో ఆ పార్టీలోని అన్ని వర్గాలు తర్జనభర్జనలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై అధినేత అంతరంగంపైనే ప్రధానంగా ఈ చర్చ జరుగుతోంది. ఓసారి ‘సిట్టింగ్‌’లు అందరికీ టికెట్లనీ.. మరోసారి అవసరమైతే కొందరి మార్పు తప్పదనీ.. సర్వేలు, సందర్భాలను ఆధారంగా అధినేత ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు తథ్యమని తేలడంతో చాలాచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు ఆ స్థానాల్లో టిక్కెట్‌ ఆశిస్తున్న వారిలో ఆందోళన కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్నింట్లో ‘సిట్టింగ్‌’లకే అవకాశం ఉంటుందన్న చర్చ రెండు రోజులుగా ఊపందుకుంది. ఇదే గనక జరిగితే 2014తోపాటు ఈసారి ఎన్నికల్లో కూడా టికెట్లు ఆశించిన వారికి ఆశాభంగమే కలగనుంది. లేదా రెండు మూడు చోట్ల మార్పులు అనివార్యమైతే ఎవరనే చర్చ కూడా జరుగుతోంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ముందస్తు ఎన్నికలు ఖాయం కాగా అసెంబ్లీ రద్దే ఇక తరువాయిగా మారింది. ఇప్పటికే గులాబీ శ్రేణుల్లో ఓ వైపు వేడి.. మరోవైపు జోష్‌ పెరుగుతోంది. ఇదే సమయంలో గురువారం అసెంబ్లీని రద్దు చేయనున్న గుళాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఆ మరుసటి రోజే హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఆ సభ వేదికగా అన్ని కోణాలు, సామాజిక వర్గాల కూర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ఆ పార్టీకి చెందిన అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇరవై రోజుల కిందట సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగా ఈ నెలలోనే అభ్యర్థుల జాబితా మొత్తంగా ప్రకటించేందుకు సన్నాహాలు జరిగినా.. మొదటగా 15 మంది పేర్లు ప్రకటిస్తారంటున్నారు.

ఈ 15 మందిలో ఉమ్మడి కరంనగర్‌ జిల్లాకు చెందిన నలుగురు పేర్లు కేసీఆర్‌ ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, జగిత్యాల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్లు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయమై అభ్యర్థులకు కూడా పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. నాలుగైదు రోజుల తేడాతో దశల వారిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మిగతా 9 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు. కాగా.. కొందరు శాసనసభ్యులు తమపేర్లను కూడా తొలి జాబితాలోనే చేర్చాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు.. జనసమీకరణలో తలమునకలు..
7న హుస్నాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్‌ కోసం ఏర్పాట్లు, జన సమీకరణలో నేతలు తలమునకలు అయ్యారు. ఇప్పటికే వరుసగా రెండు రోజులు మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ తదితరులు హుస్నాబాద్‌ను సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. హుస్నాబాద్‌లోని బస్‌ డిపో పక్కన ఇప్పటికే బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్‌ సిద్ధమవుతోంది. బుధవారం సైదాపూర్‌లో మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, వైశ్య సంఘం భవనంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో 400 మంది కార్యకర్తలు పాల్గొనగా వారికి దిశానిర్దేశం చేశారు. సుమారు పది వేల మందిని సైదాపూర్‌ మండలం నుంచి సమీకరించాలని సూచించారు.

చిగురుమామిడిలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్, ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈటల రాజేందర్, కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, ఎంపీ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు సమావేశం నిర్వహించారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, కోహెడ మండల కేంద్రంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ, విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ హాజరయ్యారు. అక్కన్నపేట మండల కేంద్రంలోనూ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ సత్తా ఏమిటో తెలియజేయాలని వీరంతా పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top