‘సింగిల్‌ నేమ్‌’పై సీరియస్‌..!

Telangana Congress MLA Candidates List Is Pending - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై వేసిన వాయిదా మరో ఐదు రోజులుండగా.. ఆ పార్టీలో కొత్త పంచాయితీలు పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ, స్క్రీనింగ్‌ కమిటీలు ‘సింగిల్‌ నేమ్‌’తో అభ్యర్థుల జాబితా పంపడం వివాదాస్పదం అవుతోంది. రాహుల్‌గాంధీ సూచించిన మార్గదర్శకాలకు భిన్నంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారంటూ పలువురు నిరసన గళం విప్పుతున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నుంచి 15 మంది వరకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో పేరును ఎలా ప్రతిపాదిస్తారని ఆశావహ నేతలు ప్రశిస్తున్నారు. జగిత్యాల, మంథని నియోజకవర్గాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని పలువురు అధిష్టానంలో కొందరు పెద్దలతో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

ప్యారాచ్యూట్, పార్టీ ఫిరాయింపుల నేతలకు ఈసారి టికెట్లు ఉండబోవని, యువత, పార్టీలో ధీర్ఘకాలికంగా కొనసాగుతున్న వారికే అవకాశం ఉంటుందన్న రాహుల్‌గాంధీ పిలుపును పార్టీలో కొందరు నేతలు పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఆశావహ నేత ‘సాక్షి’తో వాపోయారు. కాగా అధిష్టానం మొదట పేర్కొన్న విధంగా ఈనెల 1, 2 తేదీల్లో తొలిజాబితా ప్రకటిస్తారని భావించినా.. అది జరగకపోగా 9వ తేదీకి వాయిదా వేశారు. దీంతో తొలి విడత జాబితా పేరిట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఒకేపేరు పంపారన్న ప్రచారం ఇప్పుడు ఆ పార్టీలో వివాదానికి కారణమవుతోంది. ‘సింగిల్‌ నేమ్‌’ ప్రతిపాదనపై ఆశావహులు నిరసన గళం విప్పుతుండటం ఆ పార్టీలో టికెట్ల పోరు మళ్లీ మొదటికి వచ్చింది.

మంథని, జగిత్యాల, సిరిసిల్ల మినహా.. 
కాంగ్రెస్‌ పార్టీ జాబితా కోసం ఒకేపేరును ప్రతిపాదించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పొత్తుల మాట, మహకూటమి స్థానాల లెక్క ఎలా ఉన్నా.. జగిత్యాల, మంథని, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, కేకే.మహేందర్‌ రెడ్డి పేర్లను ‘సింగిల్‌ నేమ్‌’గా ప్రతిపాదించారు. కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పేరును అధిష్టానమే ప్రతిపాదించగా.. మిగతా స్థానాల్లో ఒకే పేరును ప్రతిపాదించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెద్దపల్లి నుంచి సీహెచ్‌.విజయరమణారావు వద్దే వద్దంటూ అక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఐదుగురు ఏఐసీసీకి తాజాగా ఫిర్యాదు చేశారు. మిగితా నియోజకవర్గాల నుంచి కూడా అసంతృప్తి నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంన్నారు.

మరికొందరు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతల ఇళ్లను ముట్టడించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే విషయమై పలు నియోజకవర్గాలకు చెందిన కొందరు ఆశావహ, అసంతృప్తి నేతలతో కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి కీలక నేత శనివారం రాత్రి భేటీ అయి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. 1, 2 తేదీల్లో  టికెట్లను ప్రకటిస్తే సరిపోయేదని, వారంరోజులు వాయిదాతో టికెట్ల వివాదం మళ్లీ తెరపైకి వచ్చిందని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తులు ఏ నియోజకవర్గం నుంచి ఎందరు చేసుకున్నా.. టీపీసీసీ, ఏఐసీసీల వేర్వేరు సర్వేలకుతోడు కొన్ని మార్గదర్శకాల ప్రకారమే చాలా స్థానాలకు ఒకే పేరును ప్రతిపాదించారని మరికొందరు సీనియర్లు అంటున్నారు. ఏదేమైనా అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేయడంతో కాంగ్రెస్‌లో మళ్లీ టికెట్ల వివాదం రగులుతోంది.

ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు.. ‘సింగిల్‌నేమ్‌’పై రగిలేదెక్కడ..?

  • కరీంనగర్‌ పాత జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్‌ నుంచి పొన్నం ప్రభాకర్, చల్మెడ లక్ష్మీనర్సింహరావు, కటకం మృత్యుంజయం, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, రేగులపాటి రమ్యారావుతోపాటు 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడ టికెట్‌ దాదాపుగా ఖరారైంది. 
     
  • హుస్నాబాద్‌ స్థానాన్ని కూటమిలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గట్టిగా అడుగుతున్నారు. కాంగ్రెస్‌ మాత్రం తమ పార్టీ అభ్యర్థినే బరిలో దింపాలనుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ శ్రీరామ్, బొమ్మ వెంకటేశ్వర్లు ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ రేసులో ఉండగా.. ఒకే పేరును పంపారన్న ప్రచారం వివాదాస్పదం అవుతోంది. 
     
  • హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్‌తో పాటు ఏడుగురు పోటీ పడుతున్నారు. ఇందులో ఒక్క పాడి కౌశిక్‌రెడ్డి పేరును ఏఐసీసీకి పంపడంపట్ల మిగతా ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్‌రెడ్డి పేరు పంపడానికి, తమ పేర్లను ప్రతిపాదించకపోవడానికి కారణాలు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో అసంతృప్తులు ఉన్నారు. 
     
  • పెద్దపల్లి నుంచి ఈర్ల కొమురయ్య, డాక్టర్‌ గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి, బల్మూరు వెంకట్‌తో పాటు ఏడాదిక్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌.విజయరమణరావు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి ఇందులో విజయరమణరావుకే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరగ్గా ఆయనకు తప్ప ఐదుగురిలో ఎవరికి ఇచ్చినా ఫరవాలేదంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ‘సింగిల్‌ నేమ్‌’గా విజయరమణారావు పేరునే పంపారన్న ప్రచారంతో మిగతా నేతలు అసంతృప్తితో రగులుతున్నారు.
     
  • మానకొండూరు నుంచి ఆరెపెల్లి మోహన్, డాక్టర్‌ కవ్వంపెల్లి సత్యనారాయణ, దరువు ఎల్లన్న దరఖాస్తు చేసుకున్నారు. కవ్వంపెల్లికి ధర్మపురి నుంచి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఉండగా.. మానకొండూరు కోసం ఆరెపెల్లి మోహన్‌ ఒక్కరి పేరే పంపారన్న ప్రచారం ఆ పార్టీలో చర్చగా మారింది.
  • చొప్పదండి నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, పీసీసీ అధికార ప్రతినిధులు మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతంతోపాటు 10 మంది దరఖాస్తు చేసుకోగా.. పైముగ్గురిలో ఒకరికి టికెట్‌ లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి మేడిపల్లి సత్యం పేరును ప్రతిపాదించారన్న వివాదం చొప్పదండిలో రగులుతోంది.
     
  • ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మద్దెల రవీందర్‌తోపాటు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అడ్లూరి వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నేపథ్యంలో మిగతా ఇద్దరు బాగా పోటీ పడుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి రేవంత్‌రెడ్డి టీమ్‌తో కాంగ్రెస్‌లో చేరిన కవ్వంపెల్లి సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉంది.
     
  • వేములవాడలో గత ఎన్నికల్లో పోటీచేసిన బొమ్మ వెంకటేశ్వర్‌ ఈసారి దూరంగా ఉండగా.. ఏనుగు మనోహర్‌రెడ్డి, కొనగాల మహేశ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ రెండునెలల క్రితం కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆది శ్రీనివాస్‌ పేరు ఒక్కటే పంపారన్న ప్రచారంతో 25 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీలు మార్చే వారిని ఎలా ప్రతిపాదిస్తారని నిలదీస్తున్నారు.
     
  •  కోరుట్లలో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరకు ఉత్తదే అయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో కొమొరెడ్డి రామ్‌లుతోపాటు టీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి రత్నాకర్‌రావు కుమారుడు జువ్వాడి నర్సింగరావు పేరు పరిశీలనలో ఉన్నాయి. టికెట్‌ కమిట్‌మెంట్‌తో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నర్సింగరావు పేరును ప్రతిపాదించడం కూడా వివాదాస్పదంగా మారింది.
  • రామగుండంలో రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్, ఐఎన్‌టీయూసీ నాయకుడు బి.జనక్‌ప్రసాద్‌తోపాటు ఐదుగురు దరఖాస్తు చేసుకోగా.. ఈ ఇద్దరి మధ్యే పోటీ ఉంది. అయితే ఇక్కడి నుంచి టీజేఎస్‌ నుంచి ప్రొఫెసర్‌  కోదండరామ్‌ పోటీ చేస్తారన్న ప్రచారం  కొత్తగా తెరపైకి వచ్చింది. టీజేఎస్‌ను  పక్కనపెడితే ఎవరిని సంప్రదించకుండా రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ పేరునే ప్రతిపాదించడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top