సారొస్తారొస్తారు..

Telangana CM KCR Tour in Khammam district - Sakshi

ఈ నెలాఖరుకు ఉభయ జిల్లాల్లో సీఎం పర్యటన

ఖమ్మంలో డీసీసీబీ ఆస్పత్రి, టీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవం

అన్నీ అనుకూలిస్తే కొత్త కలెక్టరేట్‌కు అదేరోజు శంకుస్థాపన

‘భద్రాద్రి’ జిల్లాలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈనెల చివరి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రైతుల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన డీసీసీబీ రైతు ఆస్పత్రి, అన్నీ అనుకూలిస్తే వీ.వెంకటాయపాలెంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన, దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నట్లు సమాచారం.

రైతుల కోసం నిర్మించిన జిల్లా ఆస్పత్రిని ప్రారంభించాల్సిందిగా డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. రైతుల ఆరోగ్య అవసరాలు తీర్చే విధంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడం కోసం సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రైతుల భాగస్వామ్యంతో ఆస్పత్రి నిర్మించామని, దీని ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని విజయ్‌బాబు సీఎంకు వివరించడంతో ఆయన అంగీకారం తెలిపారు. అయితే ఎప్పుడు పర్యటన ఉంటుందన్న విషయం మాత్రం ఖరారు కాలేదు. ఈనెల 23వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనుండటంతో వెసులుబాటు చేసుకుని ఒకరోజు ఉండే విధంగా ఉభయ జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

దీంతో శని, ఆదివారాల్లో ఒకరోజు సీఎం పర్యటన ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పర్యటన అధికారికంగా ఖరారు కానప్పటికీ ఈనెల 28, 29 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో ఆయా తేదీల్లో సీఎం పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయ సముదాయ నిర్మాణానికి సంబంధించి వి.వెంకటాయపాలెంలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రావడం, రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. దీనికి అవసరమైన కార్యాచరణను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యాలయంతోపాటు జిల్లాలో ప్రభుత్వపరంగా ప్రారంభించాల్సిన భవనాలు, కార్యాలయాలకు సంబంధించిన జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top