20 వరకు తెలంగాణ అసెంబ్లీ

Telangana Assembly Sessions Schedule Up To March 20 For 12 Days - Sakshi

12 రోజుల పాటు అసెంబ్లీ, 8 రోజుల పాటు మండలి భేటీ

రేపు అసెంబ్లీ, మండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

9, 10న హోలీ, 15న అసెంబ్లీకి విరామం

స్వల్పకాలిక చర్చల కోసం అవసరమైతే పొడిగింపు

సీఏఏ, ఎన్నార్సీపై సభలో చర్చ, ఆ తర్వాత తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఐదో విడత సమావేశాలు ఈ నెల 20 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. కాగా, 8న (ఆదివారం) రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020–21ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావుగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు మం త్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌తో పాటు విపక్ష నేతలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ విప్‌లు, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశ తేదీలను ఖరారు చేయడం తో పాటు ఇతర అంశాలపై చర్చించారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన నేపథ్యంలో, శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సీఎం సమాధానం ఉంటుంది. ఆర్థిక మంత్రి హరీశ్‌ 8న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం సభను స్పీకర్‌ వాయిదావేస్తారు. హోలీ సందర్భంగా ఈ నెల 9, 10 తేదీలతో పాటు 15న సభా కార్యకలాపాలకు విరామం ప్రకటించారు. శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై 13 నుంచి 19 వరకు జరిగే చర్చలకు 20న కేసీఆర్‌ సమాధానం ఇస్తారు.

సీఏఏ, కరోనాపై చర్చ..
అసెంబ్లీ పనిదినాలు పొడిగించి, స్వల్పకాలిక చర్చలు జరపాల్సిందిగా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కోరారు. అయితే స్వల్పకాలిక చర్చ కోసం వచ్చే వినతుల సంఖ్యను బట్టి ఈ నెల 20 తర్వాత అవసరమైతే మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుందామని సీఎం ప్రతిపాదించారు. నిర్మాణాత్మక చర్చలు జరిగే పక్షంలో ఎన్ని రోజులైనా సభ నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సభలో ప్రభుత్వమే తీర్మానం చేస్తుందని సీఎం తెలిపారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళన తొలగించేందుకు అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. 304 నిబంధన కింద వివిధ అంశాలకు సంబంధించి లఘు ప్రశ్నలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. ప్రతిపక్ష సభ్యులు కోరే ప్రతి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందస్తుగా ఆయా అంశాలను సభ ముందు పెడితే సంబంధిత సమాచారాన్ని సభలో అందుబాటులో ఉంచుతామని సీఎం పేర్కొన్నారు.

8 రోజుల పాటు మండలి భేటీ
శాసనమండలి సమావేశాలను 8 రోజుల పాటు నిర్వహించాలని మండలి బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగం అనంతరం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బీఏసీ సమావేశం జరి గింది. మంత్రులు హరీశ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీతో పాటు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌ భానుప్రసాద్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ ముగిస్తారు. శాసనసభ వ్యవహా రాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండలిలో 8న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

అనంతరం సభను చైర్మన్‌ వాయిదా వేస్తారు. తిరిగి 11న మండలి సమావేశమవుతుంది. 11 నుంచి 14 వరకు వరుసగా 4 రోజుల పాటు మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించగా, 13, 14 తేదీల్లో స్వల్పకాలిక చర్చ నిర్వహించేందుకు బీఏసీ అంగీకరించింది. 15 నుంచి 19 వరకు మండలి సమావేశాలకు విరామం ప్రకటించగా, తిరిగి 20న ముగింపు భేటీ జరుగుతుంది. సీఏఏపై తీర్మానం 20న మండలి ముందుకొచ్చే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదానికి అవసరమైతే మండలి సమావేశ తేదీలను పొడిగించాలనే అభిప్రా యం బీఏసీలో వ్యక్తమైనట్లు సమాచారం.

అసెంబ్లీలో శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై చర్చ 

  • మార్చి 13: హౌజింగ్, సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు, దివ్యాంగ సంక్షేమ శాఖలు
  • మార్చి 14: రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, హోం, వ్యవసాయం, పశు, మత్స్య సంపద, సహకారం, పౌరసరఫరాలు
  • మార్చి 16: పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన సర్వీసులు, వైద్య, ఆరోగ్యం
  • మార్చి 17: కార్మిక, ఎంప్లాయ్‌మెంట్, ఎండోమెంట్స్, అటవీ, పర్యావరణ, వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలు
  • మార్చి 18: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, చిన్న, మధ్యతరహా, భారీ నీటిపారుదల, విద్యుత్‌
  • మార్చి 19: శాసనసభ వ్యవహారాలు, గవర్నర్, మంత్రి మండలి, న్యాయ, జీఏడీ, ఎన్నికలు, ప్లానింగ్, సమాచార, ప్రజా సంబంధాలు
  • మార్చి 20: ద్రవ్య వినిమయ బిల్లు–2020 

నేడు కేబినెట్‌ భేటీ
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశమై 2020– 21 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించనుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో  ప్రవేశపెట్టే తీర్మానం ప్రతిపై శనివారం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) నిర్వహణపైనా శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఎన్పీఆర్‌ విషయంలో ప్రభుత్వ వైఖరిపై చేసే ప్రకటన గురించి కూడా కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశ ముందని తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ సమావేశాల్లోనే తీసుకొ స్తామని సీఎం ఇప్పటికే ప్రకటన చేశారు. ముసాయిదా రెవెన్యూ చట్టానికి తుదిరూపునిచ్చి శాసన సభలో ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను సైతం కేబినెట్‌ సమా వేశంలో చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top