4 రోజులు ఘట్టాలు

Telangana Assembly Sessions Four Days Review - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను, చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఆదివారం సభలలో ప్రకటించారు. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు ప్రధాన ఘట్టాలు ముగిశాయి. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన 120 మంది (నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో సహా) సభ్యుల్లో మొత్తం 118 మంది సభ్యులు ఈ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతోపాటు అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్త శాసనసభ కొలువుదీరినప్పుడు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే ఘట్టం కూడా ఈ సమావేశాల్లోనే పూర్తైంది.

ఈనెల 19న ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించగా, చివరిరోజు రెండు సభలు ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ఆమోదించడంతో నాలుగు రోజుల సభలు నిరవధికంగా ముగిశాయి. ఈ సమావేశాల్లోనే ప్రతిపక్ష నేత ఎంపిక కూడా పూర్తైంది. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌(19) పక్షాన ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. ఆయన ఎంపికను అసెంబ్లీ స్పీకర్‌ కూడా గుర్తించడంతో ఇక నుంచి భట్టి ప్రతిపక్ష నేతగా పనిచేయనున్నారు.  

భవిష్యత్తుపై ఆశలు
తొలి అసెంబ్లీ సమావేశాలే అయినా రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రీతిలో జరిగాయి. ముఖ్యంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించారు. కచ్చితంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పిన కేసీఆర్‌ గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని, పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలుపరుస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి సాగునీటి అంశమే ప్రధానమని, రానున్న మూడేళ్లలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.1.17లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని వెల్లడించారు. రెండో ప్రాధాన్యంగా రోడ్ల అంశాన్ని చేపడతామని, రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలను బీటీరోడ్లతో అనుసంధానం చేస్తామన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనియాడారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్‌భారత్‌ కంటే మెరుగైనదని ప్రశంసించిన ఆయన రానున్న కాలంలో ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు చేస్తామని చెప్పారు. ఏ పార్టీ నుంచి గెలిచారన్న దానితో సంబంధంతో లేకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాధాన్యతల వారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే ధ్యేయంగా పనిచేస్తామని కేసీఆర్‌ చెప్పారు.  

కొడంగల్‌ ఎమ్మెల్యేకు సీఎం శుభాకాంక్షలు
కొడంగల్‌ శాసనసభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పుట్టిన రోజు కావడంతో నరేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వరంగల్‌ మహానగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) మేయర్‌ పదవిని తన కోడలు అశ్రితారెడ్డికి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి సీఎం కేసీఆర్‌ను కోరారు. సుధారాణి ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం సుధారాణి, ఆమె కోడలు అశ్రితారెడ్డి టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలసి మేయర్‌ పదవికి తమ పేరును పరిశీలించాలని కోరారు.  

ఒక రోజు మండలి
ఈసారి సమావేశాల షెడ్యూల్‌లో భాగంగా మండలి కూడా ఒక రోజు నడిచింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు సమావేశమైన మండలి సభ్యులు ధన్యవాదాల తీర్మానంపై చర్చించి ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో ఆమోదానికి గాను ఈ సమావేశాల్లోనే ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్, జాఫర్‌లు మినహా అందరూ ఈ సమావేశాల్లో ప్రమాణం చేశారు.సీఎం, హోం మంత్రులతోనే నాలుగు రోజుల సభాకార్యకలాపాలు నడిచాయి.  

ఇవీ శాసన సభ, మండలి గణాంకాలు
అసెంబ్లీ జరిగిన రోజులు    : 4
పనిగంటలు                   : 9గంటల 28 నిమిషాలు
మాట్లాడిన సభ్యుల సంఖ్య     : 5
శాసన మండలి  
మండలి జరిగిన రోజులు     : 1
పని గంటలు                   : 4 గంటల 54 నిమిషాలు
మాట్లాడిన సభ్యుల సంఖ్య  : 18  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top