కరీంనగర్‌లో కరోనా కలకలం

Telanagana Government Announced Emergencies In Karimnagar - Sakshi

ఇండోనేషియా బృందంలో 8మందికి కరోనా పాజిటివ్‌

ధ్రువీకరించిన ప్రభుత్వం.. హెల్త్‌ బులెటిన్‌ విడుదల

కరీంనగర్‌పై దృష్టి సారించిన మంత్రులు ఈటల, గంగుల

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంపీ సంజయ్‌

నిషేధిత ప్రాంతంగా విదేశీ బృందం బస చేసిన ఏరియా

మరో పదిమంది అనుమానితులు గాంధీ ఆసుపత్రికి తరలింపు

సాక్షి, కరీంనగర్: కరోనా పేరు చెబితేనే కరీంనగర్‌ ప్రజలు ఉలికిపాటుకు గురయ్యే పరిస్థితి నెలకొంది. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరీంనగర్‌ను వణికిస్తోంది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన పది మంది బృందంలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు తేల్చిచెప్పగా... మిగతా వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. ఈ 8 మంది విషయంలో ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరీంనగర్‌కు వచ్చిన విదేశీయులకు కరోనా వైరస్‌ సోకిందనే ప్రచారం జోరందుకుంది. దీంతో కరీంనగర్‌లో కరోనా ప్రమాదం పొంచి ఉందన్న భయం ప్రజలను వెంటాడుతోంది. (కరోనా నివారణకు ఏపీ సర్కార్‌ చర్యలు)

100 ప్రత్యేక వైద్య బృందాలు
విదేశీయులకు మాత్రమే కరోనా వచ్చినప్పటికీ వారు కరీంనగర్‌లో నాలుగు రోజులు బసచేయడంతో ఇక్కడ ప్రజలను కరోనా కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. విదేశీయులు పర్యటించిన ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. దీని కోసం 100 మందితో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్‌ వార్డులు, 10 ఐసీయూ బెడ్లతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 బెడ్లు సిద్ధం చేశారు.

కరోనా: ఒక్కరోజే  475 మంది మృతి

విదేశీయులతో వాటిల్లిన ముప్పు...
విదేశీయుల బృందం కరీంనగర్‌కు రావడంతోనే కరీంనగర్‌లో కరోనా కలకలం మొదలైంది. ఇండోనేషియాకు చెందిన పది మంది మత బోధకుల బృందం ఈ నెల 9న  విమానంలో ఢిల్లీ చేరుకోగా అక్కడ స్క్రీనింగ్‌ పరీక్షలు సైతం నిర్వహించారు. అనంతరం రైలు మార్గంలో రామగుండంలో దిగి కరీంనగర్‌కు వచ్చిన సదరు విదేశీయులు ఓ ప్రార్థనా మందిరంలో బసచేశారు. ఈ నెల 15న పోలీసులకు రిపోర్టు చేసేందుకు వెళ్లగా, వైద్య పరీక్షలు చేయించుకొని రిపోర్టులు అప్పగించాలని పోలీసులు సూచించారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గైడ్‌తోపాటు స్థానికులైన ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి చేరుకోగా... ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, చెస్ట్‌ ఫిజీషియన్‌తో పరీక్షలు నిర్వహించారు. ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన చెస్ట్‌ ఫిజీషియన్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం 108 వాహనాల్లో తరలించారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.  

నగరంలో హై అలర్ట్‌...
కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయనే సమాచారంలో జిల్లా యంత్రాంగం హై అలర్ట్‌ ప్రకటించింది. విదేశీయులు బస చేసిన కలెక్టరేట్‌ సమీపంలోని ప్రార్థనా మందిరం చుట్టు పక్కల దుకాణాలను మూయించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది సభ్యులు ఎక్కడ బసచేశారు.. ఎక్కడెక్కడ తిరిగారు... ఎవరిని కలిశారనే అంశాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ప్రార్థనా మందిరంలో, మందిరం సమీపంలో నివసించే దాదాపు 10 మందిని హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా సదరు విదేశీయులు నగరంలో పలు ప్రార్థన మందిరాలకు కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలను వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారిని పరీక్షిస్తున్నారు. సాధారణంగా వచ్చే జ్వరమా... కరోనా లక్షణాలతో వచ్చిన జ్వరమా అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ప్రభుత్వాసుపత్రికి పంపించి వైద్యాధికారులతో పరీక్షలు చేయిస్తున్నారు.

కలెక్టర్‌ సమీక్ష..
కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కరోనా వ్యాధి లక్షణాలు పెరిగితే చేపట్టాలి్సన చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఐసోలేషన్‌ వార్డులో వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఐసీయూ వార్డులో కూడా బెడ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య సేవలు అందించే డ్యూటీ డాక్టర్లు, నర్సులతో కూడిన జాబితాను షిప్టుల వారీగా సిద్ధం చేయాలని తెలిపారు. వెంటిలేటర్స్‌ సదుపాయం సిద్ధం చేయాలని అన్నారు. నగరంలో ప్రతిమ, చల్మెడ ఆసుపత్రులతో కూడా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. 

వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు...
కరోనా అనుమానిత లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించింది. 24 గంటలపాటు వైద్యులు తమ డ్యూటీల ప్రకారం ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. 

ప్రయాణికుల  వివరాల సేకరణ
రామగుండం: ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం ఈ నెల 13న న్యూఢిల్లీ నుంచి ఉదయం ఏపీ సంపర్క్‌ క్రాంతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(12708) రైలు ఎస్‌9 బోగీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30గంటలకు రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగింది. ఈ బృందంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు ది డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్, డీఎంహెచ్‌అండ్‌హెచ్‌ఎస్‌ క్యాంపస్, సుల్తాన్‌బజార్, కోఠి, హైదరాబాద్‌ నుంచి ధ్రువీకరణ ఉత్తర్వులు ది డిప్యూటీ చైఫ్‌ కమర్షియల్‌ మేనేజర్, పీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ వారికి ఈ నెల 17న పంపించినట్లు సెంట్రల్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (సీఆర్‌ఐఎస్‌) పేర్కొంది. ఈ ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రామగుండం పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సదరు వ్యక్తి ఎస్‌9 బోగీలో ప్రయాణించినట్లు ధ్రువీకరించిన అధికార యంత్రాంగం అతడికి సమీపంలో ప్రయాణించిన వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే విషయమై రామగుండం రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. లోతుగా వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఆ రోజు బోగీలో ప్రయాణించిన వారు ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top