విద్యార్థులతో  బస్తాలు మోయించిన ఉపాధ్యాయులు

Teachers who are carrying students with students In Warangal - Sakshi

సాక్షి, మంగపేట: మంగపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న కొందరు విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయులు బియ్యం బస్తాలు మోయించిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు బియ్యం అయిపోవడంతో పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ స్వామి, చరణ్, రాజ్‌కుమార్‌ అనే విద్యార్థులతో పాటు మరి కొందరు విద్యార్థులను వెంట తీసుకుని గంపోనిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని బియ్యం బస్తాలను విద్యార్థులచే ఆటోలో వేయించారు. అక్కడి నుంచి ఆటోలో పాఠశాలకు తీసుకువచ్చిన బస్తాలను ఫిజికల్‌ డైరెక్టర్‌ స్వామితో పాటు నాగేందర్‌ అనే మరో ఉపాధ్యాయుడు దగ్గరుండి విద్యార్థులతో ఆటోలో ఉన్న బస్తాలను కిందికి దింపించి పాఠశాలలోకి మోయించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు హమాలీ కూలీలతో మోయించాల్సిన బస్తాలను విద్యార్థులతో మోయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని12, 13 సంవత్సరాలు వయస్సు కూడా ఉండని బాలలతో 50 కేజీల బరువు ఉండే బియ్యం బస్తాలు మోయించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విదంగా పలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్వీపర్లకు బదులు విద్యార్థులతో తరగతి గదులు శుభ్రం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top