టీడీపీకి మరో షాక్‌

TDP senior leaders join to TRS Party - Sakshi

టీఆర్‌ఎస్‌లోకి ‘పేర్యాల’, ‘కర్రు’

అదే బాటలో ‘అన్నమనేని’..?

15న చేరికకు ముహూర్తం..!

టవర్‌సర్కిల్‌:  తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు వలస బాటలు పడుతున్నారు. మొన్న కాంగ్రెస్‌ గూటికి పలువురు నేతలు చేరగా.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోకి ఆకర్షితులవుతున్నట్లు కనిపిస్తోంది. హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్యాల (కిమ్స్‌) రవీందర్‌రావు, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రు నాగయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. శనివారం సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా కుదుర్చుకున్నట్లు తెలిసింది. నేడో రేపో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈనెల 15న గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇటీవలే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో చేయి కలిపారు.

 కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల టీడీపీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయరమణారావు, హుజూరాబాద్, చొప్పదండి నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, మేడిపల్లి సత్యంతోపాటు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం మరో ఇద్దరు కీలక నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడం, వలసలు ఇలాగే కొనసాగుతుండడంతో టీడీపీ ఖాళీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్యాల రవీందర్‌రావుకు మూడు పర్యాయాలు పోటీ చేసే అవకాశం దక్కినా పొత్తుల్లో భాగంగా ఆ టికెట్‌ను వేరే పార్టీ అభ్యర్థికి ఇచ్చారు. కర్రు నాగయ్య రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

కాగా.. వీరి బాటలోనే మరో సీనియర్‌ నేత, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు వలసబాట పట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. టీఆర్‌ఎస్‌లో చేరతారా.. కాంగ్రెస్‌లోకి వెళతారా అనే విషయం మాత్రం గోప్యంగానే ఉంచుతున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా అన్నమనేని నర్సింగరావు పార్టీని వీడడం ఖాయమేనని తెలుస్తోంది. 2009 ఎన్నికల వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌ జిల్లాలో పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ స్థాపించిన నాటి నుంచి శక్తివంచన లేకుండా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. ఎవరి దారి వారు వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top