హబ్‌.. హిట్‌ హౌస్‌ఫుల్‌!

T- Hub, Which Helps Startup Companies - Sakshi

టీ హబ్‌లో లాంగ్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ 

నాలుగేళ్ల ప్రస్థానంలో 450 కంపెనీలు హిట్‌  

ప్రపంచ ఐటీ విపణిలో హైదరాబాద్‌ జెట్‌ స్పీడ్‌ 

రూ.కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన 12 సంస్థలు  

సాక్షి, హైదరాబాద్‌: టీ హబ్‌ అంకుర పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అద్భుతాలకు వేదిక అయింది. స్టార్టప్స్‌ స్పీడప్‌ అయ్యాయి. లోకల్‌ అంకుర పరిశ్రమలు గ్లోబల్‌ స్థాయిని అందుకున్నాయి. ప్రపంచ ఐటీ విపణిలో తనదైన వాటాను సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఏటా సరాసరి వంద స్టార్టప్‌ కంపెనీలు పురుడు పోసుకుంటున్నాయి. సాంకేతిక ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ఐటీ, బ్యాంకింగ్, సేవా, బీపీవో, కేపీవో, ఇన్సూరెన్స్‌ రంగాల్లో వినియోగదారులకు అందించే సేవలను అత్యంత సరళతరం చేయడం ద్వారా టీ హబ్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. విదేశీ మారకద్రవ్యాన్ని భారీస్థాయిలో ఆర్జించడం ద్వారా ఉపాధి, వాణిజ్య రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోంది. నాలుగేళ్ల టీ–హబ్‌ ప్రస్థానంలో సుమారు 450 కంపెనీలు ఇక్కడే ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా ఎదిగి కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధించినట్లు టీ–హబ్‌ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెలిసిన ఈ భవనంలో ప్రస్తుతం 170 అంకుర పరిశ్రమలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 870 మంది సాంకేతిక నిపుణులు తమ మేధస్సు, సృజనకు పదును పెడుతుండటం విశేషం. ఇందులో అంకుర పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులు మరో ఏడాదిపాటు నిరీక్షించక తప్పనివిధంగా హౌస్‌ఫుల్‌ అయింది.

టీ–హబ్‌ అంటే.. 
అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే నిపుణులను, కార్పొరేట్‌ కంపెనీలను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలను సాకారం చేయడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే ఉద్దేశంతో  తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను గచి్చ»ౌలిలో ఏర్పాటు చేసింది. స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభించాలనుకునే సాంకేతిక నిపుణులకు టీ–హబ్‌ ఓ దిక్సూచిగా మారిందని నాస్‌కామ్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి.  

అద్భుతాలు సృష్టించిన టీ–హబ్‌ స్టార్టప్‌లివే.. 

ఎనీటైమ్‌లోన్‌.ఐఎన్‌: నాన్‌బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థగా పేరొందిన ఈ సంస్థ గతేడాది ఆర్‌బీఐ నుంచి లైసెన్స్‌ పొందింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిన్న పరిశ్రమలకు ఆర్థికదన్ను అందిస్తోంది. 
మైగేట్‌: ఈ సంస్థ 8.8 మిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. లూప్‌ రియాల్టీ అండ్‌ అప్నోవేషన్‌ టెక్నాలజీ: హెచ్‌డీఎఫ్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అవార్డును గెలుపొందింది. 
గ్లామ్‌ఈగో: ఈ సంస్థ ప్రారంభంలోనే నాలుగుకోట్ల రూపాయల బ్రాండ్‌ క్యాపిటల్‌ సాధించింది. 
పేమ్యాట్రిక్స్‌: ఈ సంస్థ వంద కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. 
డొనేట్‌కార్ట్‌: ఈ సంస్థ రూ.257 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 
పల్స్‌యాక్టివ్‌స్టేషన్స్‌: ఈ సంస్థ అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోని ఐటీ పరిశ్రమలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. 
స్టాట్విగ్‌ గెట్స్‌: ఈ సంస్థ హెల్త్‌కేర్‌ రంగంలో చేసిన ఆవిష్కరణలకు యూనిసెఫ్‌ ప్రశంసలు పొందింది. 
గాయం మోటార్స్‌: ఈ సంస్థ ఫోర్బ్స్‌ ఏసియా–30 సంస్థల జాబితాలో చోటు సంపాదించింది. 
హగ్‌ ఇన్నోవేషన్స్‌: నాస్‌కామ్‌ సంస్థతోపాటు లండన్‌ మేయర్‌ ప్రశంసలు పొందింది. 

ఈ ఏడాది చివరలో టీ–హబ్‌ రెండోదశ
టీ–హబ్‌ మొదటిదశ విజయవంతం కావడంతో ఈ ఏడాది చివరలో మాదాపూర్‌లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్‌ రెండోదశ భవనాన్ని నిర్మిస్తున్నారు. పనులు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ భవనంలో సుమారు వెయ్యి అంకుర పరిశ్రమలకు చోటు కలి్పంచేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం విశేషం. 

అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ 
టీ–హబ్‌లో పురుడుపోసుకునే స్టార్టప్‌ కంపెనీలకు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక శిక్షణను అందించేందుకు ఉద్దేశించిన ల్యాబ్‌ 32 ప్రోగ్రాం అద్భుత ఫలితాలనిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వందలాది కంపెనీలకు సాంకేతిక అంశాలతోపాటు ఆర్థికంగా, వాణిజ్యపరంగా కలిసొచి్చంది. ఇదేస్ఫూర్తిని కొనసాగిస్తాం.  –రవినారాయణ్, సీఈవో, టీహబ్‌ 
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top