ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు! 

Suspension On Three Congress MLCs - Sakshi

శాసనమండలి చైర్మన్‌ నిర్ణయంపై ఆసక్తి

రాములునాయక్‌పై పిటిషన్‌ విచారణ పూర్తి 

నేడు యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై విచారణ

రెండు, మూడు రోజుల్లో చైర్మన్‌ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండి కాంగ్రెస్‌లో చేరినవారి సభ్యత్వ వ్యవహారం చివరిదశకు చేరింది. రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కారణంగా వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్‌ఎస్‌ గతంలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ ముగ్గురు సభ్యులకు నోటీసులిచ్చారు. వీరు లిఖితపూర్వరంగా వివరణ ఇచ్చి మరింత సమయం కావాలని కోరారు. మండలి చైర్మన్‌ శుక్రవారం రాములునాయక్‌ అంశంపై విచారణ జరిపారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్‌లో చేరినందుకు ఫిరాయింపుల చట్టం కింద వేటువేసే అవకాశం ఉందని తెలిపారు.

రాములునాయక్‌ తరఫు న్యాయవాది దీనిపై తన వాదనలను లిఖితపూర్వకంగా తెలిపారు. మరికొంత సమయం కావాలని కోరగా, మండలి చైర్మన్‌ నిరాకరించినట్లు తెలిసింది. విచారణ పూర్తయినందున త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి సభ్యత్వ రద్దుపై ఉన్న పిటిషన్‌పై శనివారం విచారించనున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మండలిలో ఖాళీ అయ్యే స్థానాలకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు విచారణదశలో ఉన్న స్థానాలకు సైతం ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.  

స్థానాలతో కలిపి... 
తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఎమ్మెల్యేల కోటా కింద 14, స్థానిక సంస్థల కోటా 14, గవర్నర్‌ కోటా 6, ఉపాధ్యాయుల కోటా 3, పట్టభద్రుల కోటా కింద 4 స్థానాలున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడింట్లో రెండోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి ఎన్నికలు నిర్వహిస్తుంది. మార్చిలో సాధారణంగా 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాజీనామాల కారణంగా మరో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. వరంగల్‌ స్థానికసంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సైతం రాజీనామా చేశారు. ఈ 4 స్థానాలు ఖాళీగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు.

పదవీకాలం ముగుస్తుండటంతో మరో తొమ్మిది స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోం మంత్రి మహమూద్‌ అలీ(టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ సలీం(టీఆర్‌ఎస్‌), టి.సంతోష్‌కుమార్‌(టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ(కాంగ్రెస్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి(కాంగ్రెస్‌), హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు(టీఆర్‌ఎస్‌), కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌(టీఆర్‌ఎస్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్‌(స్వతంత్ర) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. ఇలాఖాళీ కాబోతున్న 13 స్థానాలతోపాటు ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న మూడు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top