మరో రెండు రోజులు ఉత్కంఠ

Suspense Continues Over Mahakutami Seat Sharing - Sakshi

సీపీఐ, టీజేఎస్‌ల తీరుతో జిల్లాలో రాజకీయ వేడి 

రెండు రోజుల్లో తేల్చేందుకు మహాకూటమి భేటీ

మళ్లీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ఆశావహుల ఢిల్లీ బాట

ప్రచారం చేసుకోవడమా? వద్దా..? కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌

 సీపీఐ, టీజేఎస్, టీడీపీల్లో ఇదే ఉత్కంఠ

చొప్పదండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 9న ప్రకటన.. 11న ‘బి’ఫామ్స్‌

 పొత్తులపై తేలాక ఉమ్మడి కరీంనగర్‌లో హోరెత్తనున్న ప్రచారం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్, మహాకూటమి సీట్లపై ఉత్కంఠ మరో రెండు రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులు అనివార్యమని ప్రకటించినా టీజేఎస్, టీడీపీ, సీపీఐల సీట్ల పంచాయితీ తేలలేదు. సుమారు 40 రోజులు కావస్తున్నా ఆ పార్టీలకు ఉమ్మడి కరీంనగర్‌లో ఎక్కడ సీట్లు కేటాయిస్తారు? ఏయే పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారు? సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి సీటు గల్లంతవుతుంది? అసలు ప్రచారం చేసుకోవాలా? వద్దా? ఇవన్నీ కాంగ్రెస్, కూటమి ఆశావహులను వెంటాడుతున్న సందేహాలు. నవంబర్‌ 1, 2 తేదీలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రటిస్తారన్న ప్రచారం జరిగినా.. పొత్తులు, సీట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో 9వ తేదీకి వాయిదా వేశారు. 

ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్‌లో హుస్నాబాద్‌ స్థానాన్ని ఆశిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కాంగ్రెస్‌పై గుర్రుగా ఉండటం, అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసి రెండు రోజుల్లో తేల్చాలని అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ, టీజేఎస్‌లు సైతం సీట్ల సర్దుబాటుపై సీరియస్‌గానే ఉండటంతో మళ్లీ సీన్‌ ఢిల్లీకి మారనుంది. రెండు రోజుల్లో పొత్తులు, స్థానాలపై క్లారిటీ ఇచ్చే పనిలో కాంగ్రెస్‌ ఉండగా, ఆ పార్టీ ఆశావహులు సైతం మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నారు.

ఉమ్మడి జిల్లా సీట్లపై పీటముడి.. నాలుగు స్థానాలపై మూడు పార్టీల గురి..ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీట్ల కేటాయింపు పీటముడిగానే ఉంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు కేటాయించే స్థానాలపై రోజుకో రకమైన ప్రచారం జరగుతుండగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనే ఆందోళనే కనిపిస్తోంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి 9 స్థానాలు పోను పొత్తుల్లో భాగంగా నాలుగు స్థానాలపై కూటమి భాగస్వామ్య పార్టీలు గురి పెట్టాయి. టీజేఎస్‌ రెండు, సీపీఐ ఒకటి, టీడీపీ ఒక స్థానాలను ఖచ్చితంగా కావాలని పట్టుబడుతున్నాయి. టీడీపీ మొదట హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గాలను డిమాండ్‌ చేయగా, నాలుగు రోజుల క్రితం కోరుట్ల స్థానానికే పరిమితమై, ప్రస్తుతం ధర్మపురిని కోరుతున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా టీజేఎస్‌ రామగుండం, కరీంనగర్, హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో రెండింటిని తమ పార్టీ అభ్యర్థులకు కేటాయించాలని తాజాగా ప్రతిపాదించినట్లు సమాచారం. 

ఇక సీపీఐ ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి అడుగుతున్న ఏకైక స్థానం హుస్నాబాద్‌ కాగా ఈ స్థానంపై ఆ పార్టీ అసలే పట్టువీడటం లేదు. తాము 9 స్థానాలను కోరుకుంటుంటే.. చివరికి ఆరు స్థానాలకు సర్దుకుంటామని చెప్పినా కాంగ్రెస్‌ లీకుల ద్వారా తక్కువ చేసే ప్రయత్నం చేస్తుందంటూ చాడ వెంకటరెడ్డి రెండు రోజుల క్రితం మీడియాకెక్కారు. ఆదివారం అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఇదే అంశంపై కీలకంగా చర్చించారు. రెండు రోజుల్లో హుస్నాబాద్‌తోపాటు తమ సీట్ల వ్యవహారం తేల్చకపోతే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ ప్లాన్‌–ఏ, ప్లాన్‌–బీలను వెల్లడించారు. సీపీఐ పోటీ చేయాలనకుంటున్న స్థానాలను కూడా ప్రస్తావించారు. అదేవిధంగా టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం కూడా సీట్ల సర్దుబాటుపై మాట్లాడుతూ.. దీపావళి వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందనడంతో జిల్లాలో ఆ పార్టీ టికెట్లు కోరుకుంటున్న నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై  ఓ నిర్ణయానికి వస్తే ఆయా స్థానాల్లో కాంగ్రెస్, కూటమి పక్షాల అభ్యర్థులు ఎవరనేది తేలనుంది. 

చొప్పదండిపైనా 9న టీఆర్‌ఎస్‌ నిర్ణయం.. అన్ని పార్టీలకూ 9వ తేదే కీలకం..ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం చొప్పదండిని సస్పెన్స్‌లో పెట్టింది. బీజేపీ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బీఎల్‌ఎఫ్, సీపీఎంలు ఏడు చోట్ల జాబితా విడుదల చేశాయి. కాంగ్రెస్, మహాకూటమి భాగస్వామ్య పార్టీలు మాత్రం ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదు. అక్టోబర్‌ 31న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ తర్వాత.. ఆ మరుసటి రోజే 57 మందితో తొలి జాబితా విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. అప్పటికీ పొత్తుల్లో భాగంగా టీటీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించే స్థానాలపై స్పష్టత రాకపోవడంతో విరమించుకున్నారని కూడా అన్నారు. ఇదే సమయంలో నవంబర్‌ 8న ఢిల్లీలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి 9న మొత్తం మంది అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. ఇదే సమయంలో 12న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైతం 9న మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం కోసం కసరత్తు చేస్తోంది. 

అదే రోజు చొప్పదండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండగా, నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందే 11న అభ్యర్థులందరికీ ‘బి’ ఫారములు ఇవ్వనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ, కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా 9వ తేదీ నాటికి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా బీజేపీ, కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పార్టీల ఆశావహులు, ప్రకటించిన అభ్యర్థులు సైతం ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. అన్ని పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్‌ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించనుండగా.. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రచారం హోరెత్తనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top