ఇంటర్‌ దాటాక.. ఇంగ్లిష్‌లోకే!

Students find difficult to find employment without English knowledge - Sakshi

ఇంగ్లిష్‌ పరిజ్ఞానం లేకపోతే ఉపాధి కష్టమని గుర్తించిన విద్యార్థులు

1.61 లక్షల మంది ఇంగ్లిష్‌ మీడియంలోనే చేరిక .. తెలుగు, ఇతర మీడియాల్లో చేరిన వారు 39 వేల మందే

సాక్షి, హైదరాబాద్‌ : నిత్య జీవితంలో ఇంగ్లిష్‌ తప్పనిసరైంది. ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉందా.. అని అడుగుతున్నారు. భవిత నిర్మాణంలో విద్యార్థి వేసే ప్రతి అడుగు ఇంగ్లిష్‌తోనే ముడిపడి ఉంటోంది. సైన్స్‌ సంబంధ పీజీ కోర్సులు దాదాపు ఇంగ్లిష్‌ మీడియంలోనే ఉంటున్నాయి. విదేశాలకు వెళ్లాలన్నా.. అక్కడ ఉద్యోగాలు చేయాలన్నా.. ఇంగ్లిష్‌ రాకపోతే కుదరదు. క్యాంపస్‌ ప్లేస్‌మెం ట్లలోనూ ఇంగ్లిష్‌ రాని వారికి ప్రాధాన్యం ఉండట్లేదు. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌ మీడియంలో చదువు లేకుండా మంచి భవిష్యత్తు పొందలేమని విద్యార్థులు గుర్తించారు. దీంతో డిగ్రీ కోర్సులను ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలే ఇందుకు నిదర్శనం.

బాలికలే అత్యధికం
డిగ్రీలో చేరుతున్న విద్యార్థుల్లో అత్యధికంగా బాలికలే ఉన్నారు. ఇటీవల చేపట్టిన డిగ్రీ ప్రవేశాల్లో మొత్తంగా 2,00,223 మంది విద్యార్థులు చేరితే అందులో 1,07,081 మంది బాలికలే (53.48 శాతం) ఉన్నారు. బాలురు 93,142 మంది చేరినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే ఎక్కువ మంది బాలికలు
డిగ్రీలో చేరినట్లు గుర్తించారు.

1.61 లక్షల మంది ఇంగ్లిష్‌ మీడియమే
రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలోనే చేరారు. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ద్వారా 2,00,223 మంది విద్యార్థులు పలు కాలేజీల్లో చేరగా అందులో 1,61,111 మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలోనే చేరడం విశేషం.

మరో 37,536 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చేరగా, 49 మంది హిందీ మీడియంలో, ఐదుగురు మరాఠీ మీడియంలో, 1,522 మంది ఉర్దూ మీడియంలో చేరినట్లు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి వెల్లడించారు. ఈసారి 31 డిగ్రీ కాలేజీల్లో 2,200 సీట్లు అందుబాటులో ఉన్నా.. వాటిల్లో ఒక్క విద్యార్థి చేరలేదని వెల్లడించారు. ప్రభుత్వ, యూనివర్సిటీ, అటానమస్‌ కాలేజీల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్‌ మీడియం కోర్సుల్లో 31,446 మంది విద్యార్థులు చేరారు.

అవసరాలకు అనుగుణంగా
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈసారి కళాశాల విద్యాశాఖ డిగ్రీ కోర్సుల్లో మార్పులు తీసుకొచ్చింది. డిమాండ్‌కు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు చేసింది. గడిచిన రెండు మూడేళ్లలో ప్రవేశాల పరిస్థితిని పరిశీలించి, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న, ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను ప్రవేశ పెట్టింది. ఇంగ్లిష్‌ మీడియం విద్యను విద్యార్థులు కోరుకుంటున్నట్లు గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టింది.

కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి వాటిపై పలుమార్లు చర్చలు జరిపారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన విద్యార్థులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటున్నందున ఇంగ్లిష్‌ మీడియం కోర్సులకు అనుమతులిచ్చారు. దీంతో ఈసారి రాష్ట్రంలోని ప్రైవేటుతో పాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం సీట్లు పెరిగాయి. వాటిల్లోనే అత్యధికంగా విద్యార్థులు చేరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top