111 జీవోను సమీక్షించే యోచనలో ప్రభుత్వం


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆరు మండలాల్లో అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన 111 జీవో(పరిరక్షణ ప్రాంతం) సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. జంట జలాశయాల ఉనికికి భంగం కలుగకుండా నియంత్రించేందుకు 1996లో జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా సమీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ జీవో పరిధిలోని భూముల వివరాలు పంపాలని జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఆదేశాలందాయి.



జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను పరిరక్షించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అందుకనుగుణంగా పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు సులువుగా జలాశయాల్లోకి చేరేలా, ఎగువ ప్రాంతంలో నిర్మాణాలపై అంక్షలు విధించింది. అంతేగాకుండా ఈ రెండింటికి 10 కి.మీ.పరిధిలో ఎలాంటి పరిశ్రమలు స్థాపించకూడదనిర్దేశించింది. మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాల పరిధిలోని 84 గ్రామాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ 111 జీవోను విడుదల చేసింది.



దీంతో ఆయా మండలాల పరిధిలో అభివృద్ధి దాదాపుగా నిలిచిపోయింది. నిర్మాణాలపై అంక్షలు ఉండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్లను నిర్మించుకునే పరిస్థితి కూడా లేకుండాపోయింది. అదేసమయంలో ఈ జీవో కారణంగా భూముల ధరలు కూడా చెప్పుకోదగ్గస్థాయిలో పెరగలేదు. మరోవైపు బడాబాబులు, సినీరంగప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాత్రం జీవోను అదనుగా చేసుకోని అడ్డగోలుగా ల్యాండ్‌బ్యాంకును సమకూర్చుకున్నారు. కారుచౌకగా భూములు లభించడంతో రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లను నెలకొల్పుకున్నారు.



 సవరించే దిశగా...

 84 గ్రామాల పరిధిలోని 62 వేల 389.43 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములు ‘పరిరక్షణ మండలి’లో ఉన్నాయి. దీంతో ఈ భూములను వ్యవ సాయావసరాలకే వినియోగించుకునేలా షరతులు విధించడం రైతాంగానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో జీవోను ఎత్తివేయాలని కోరుతూ ఇక్కడి ప్రజలు ఉద్యమాలు కూడా చేశారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ కూడా జీవోను తొలగిస్తానని హామీ ఇవ్వడమేగాక అధికారులతో పలుదఫాలు చర్చలు కూడా జరిపారు.



అదే సమయంలో ఆయన హఠాన్మరణంతో ఆ ప్రభావం జీవో ఎత్తివేతపై కూడా పడింది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వస్తే జీవో ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగానే 111 జీవోను సమీక్షించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీ సమావేశాలనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న సర్కారు... భూముల సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. జీఓ సడలింపు వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా పర్యవేక్షించినందున.. దీనిపై న్యాయ నిపుణులతో కమిటీ వేయాలని యోచిస్తోంది.



 సుప్రీంకోర్టు అభిప్రాయాలకు లోబడి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. జంట జలాశయాల్లో ఏయేటికాయేడు నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడం... గ్రేటర్ ప్రజల నీటి అవసరాలను కృష్ణా, గోదావరి జలాలు తీరుస్తున్నందున వీటి పాత్ర నామమాత్రమేనని ప్రభుత్వం వాదిస్తోంది. అదేసమయంలో 111 జీవో ఉల్లంఘనలు జరగుకుండా పోరాడుతున్న సామాజిక, పర్యావరణ వేత్తల సూచనలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.



 నిబంధనలు బేఖాతరు..

 ఎగువ ప్రాంతంలో నిర్మాణాలపై అంక్షలు ఉన్నా, పరిశ్రమలు పర్మిషన్లు ఇవ్వకున్నా ఎడాపెడా అక్రమాలు జరిగాయి. ఇబ్బడిముబ్బడిగా లేఅవుట్లు పుట్టుకురావడమేగాకుండా.. అడ్డగోలుగా వృత్తివిద్యా కాలేజీలు ఏర్పడ్డాయి. 111 జీవో ఉద్దేశం పక్కదారిపట్టిందని పలుమార్లు హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డు, జిల్లా యంత్రాంగానికి మొట్టి కాయలు వేసినా ఫలితం లేకుండాపోయింది. మూడు శాఖల ప్రతినిధిబృందాలు పరివాహక ప్రాంతంలో పర్యటించి మరీ నివేదికలు రూపొందించినా అక్రమార్కులకు మాత్రం కళ్లెం వేయలేకపోయారు. ఈ క్రమంలో జలాశయాల గర్భంలో కూడా కాలుష్య కారకాలు వెదజల్లే అయిల్ కంపెనీలు సహా రిసార్టులు,  బడా బాబుల విడిది కేంద్రాలు పుట్టుకొచ్చాయి.



 నిబంధనలు ఇలా...

84 గ్రామాల పరిధిలో కొత్తగా చేసే లే అవుట్‌లలో రోడ్లతో కలుపుకొని 60 శాతం ఖాళీ స్థలం వదలాలి.



ఈ ప్రాంతం భూ వినియోగంలో 90శాతం పరిర క్షణ ప్రాంతంగా నిర్దేశించింది. కేవలం రిక్రియేషన్, ఉద్యాన, పూల తోటల పెంపకాలకే భూమిని ఉపయోగించాలనే షరతు విధించింది.



ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చుట్టూ 10 కి.మీ పరిధిలో కాలుష్య ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలు అనుమతించకూడదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top