నెలవారీ సీలింగ్‌ ప్రకారమే! 

state government Restrictions on fees payments - Sakshi

ఫీజుల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ పథకాలకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరం బకాయిలను ఏకకాలంలో మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులిస్తూనే.. వాటిని నెలవారీ సీలింగ్‌ ప్రకారమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో బకాయిల చెల్లింపులు ఏడాది పొడవునా సాగనున్నాయి. సాధారణంగా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయడం కొన్నేళ్లుగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతోంది. బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు ఏడాదిపాటు వేచి చూడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక తిరిగిచ్చేస్తామంటూ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో కోర్సు ముగిసిన వెంటనే ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా గతవారం బీసీ సంక్షేమ శాఖకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కింద ప్రభుత్వం రూ.1,750 కోట్లు విడుదల చేసి పరిపాలన అనుమతులిచ్చింది. ఇందులో బీసీ విద్యార్థులకు ఫీజు కింద రూ.800 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.300 కోట్లు, పోస్టుమెట్రిక్‌ బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల కింద రూ.450 కోట్లు విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు కూడా బకాయిలకు సరిపడా నిధులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించిన బకాయిలన్నీ క్లియర్‌ చేయవచ్చని అధికారులు భావించారు. ప్రభుత్వ నిర్ణయంపై కాలేజీల యాజమాన్యాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. కానీ ఈ నిధులను ఒకేసారి కాకుండా నెలవారీ సీలింగ్‌ ప్రకారమే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. 

బకాయిలు రూ.2,250 కోట్లు 
2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2,250 కోట్ల వరకు ఉన్నాయి. వార్షిక సంవత్సరం ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు రూ.2,550 కోట్లు అవసరం కాగా.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వద్ద నగదు నిల్వలు ఉండటంతో రూ.350 కోట్లు ఉపకార వేతనాల కింద చెల్లించారు. ఆ తర్వాత విడతల వారీగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ బీసీ సంక్షేమ శాఖకు మాత్రం జాప్యం చేయగా.. వాటిని మంజూరు చేస్తూ గత వారం ఉత్తర్వులిచ్చింది. 

బకాయిలు ఒకేసారి ఇచ్చేయాలి 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను మంజూరు చేస్తూ ఉత్తర్వులివ్వడం హర్షించదగ్గ విషయం. కానీ నిధుల పంపిణీలో నెలవారీ సీలింగ్‌ పెట్టడం వల్ల కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతాయి. వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచి నెలవారీగా ఫీజులు చెల్లిస్తే బాగుంటుంది. కానీ బకాయిలకు కూడా నెలవారీగా ఇస్తామంటే కాలేజీలను ఎలా నిర్వహించాలి. బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడం మరింత కష్టంగా మారుతుంది. విద్యార్థులకు న్యాయం చేయలేం. బకాయిలన్నీ ఏకకాలంలో ఇవ్వాలనేది మా డిమాండ్‌. ప్రభుత్వం స్పందించి ఆంక్షలను తొలగించాలి. 
– గౌర సతీశ్, జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top