యోగఫలం ప్రాప్తిరస్తు

Special Story on Yoga - Sakshi

ఆధునికులకు యోగా అత్యంత ఇష్టమైన ఆరోగ్యమార్గం.దీనికి పెరిగిన క్రేజ్‌ని కొత్తదనం పట్ల సిటిజనుల్లో ఉండే ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని నగరంలో రోజుకోరకమైన శైలిలను యోగా స్టూడియోలుపరిచయం చేస్తున్నాయి.  కొన్ని చోట్లఆమోద యోగ్యం కాని యోగసాధన చేయిస్తూ లేనిపోని ఆరోగ్య సమస్యలకూ దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునికుల్లో యోగాసనాలపై  అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సిటీలో యోగ శిక్షణకు పేరొందిన ట్రెడిషనల్‌ యోగా నిర్వాహకులు డాక్టర్‌ ఏఎల్‌వీ కుమార్‌ అంటున్నారు.ఆయన చెబుతున్న విశేషాలివి..

సాక్షి, సిటీబ్యూరో:వ్యాయామం ఏదైనా సరే ఒత్తిడిని దూరం చేయాలే తప్ప మరింత ఒత్తిడికి గురి చేయకూడదు. యోగ సాధన చేసేవాళ్లు... పూర్తి రిలాక్స్‌డ్‌గా ఉన్నప్పుడే ఆసనాలు రీచార్జ్‌ సాధనాలుగా మారతాయి.  

లోకోభిన్న యోగా..
అన్ని ఆసనాలు చాలా తేలికగా శ్రమలేకుండా, చెమటోడ్చకుండా తక్కువ సమయంలో పూర్తి చేసి, ఎక్కువ సమయాన్ని ధ్యానంలో గడిపే విధానాన్ని యోగులు అనుసరిస్తారు. రోగాల నుంచి ఉపశమనం కొరకు కొన్ని ఆసనాల సాధన రోగులు పాటిస్తున్నారు. ఇక భోగులు చేసే యోగా ఇప్పుడు సిటీలో  అధికంగా కనపడుతోంది. వీరు విలాసవంతంగా తిరగడానికి వారాంతపు వేడుకలకి అవసరమైన శారీరక పటుత్వం కోసం యోగా సాధన చేస్తున్నారు. అయితే  యోగా మన జీవనశైలిని కూడా మార్చాలి.   ఆహారం, విహారం, వ్యవహారం అన్ని  సమన్వయం  చేస్తూ యోగ సాధన చేస్తేనే సంపూర్ణ ఫలం.  

శాస్త్రీయమే...అనుసరణీయం
శారీరక దృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రుషులు, మునులు అందించిన  హఠయోగం శాస్త్రం  కాబట్టి శాస్త్రీయ దృక్పథంతోనే ఆచరించాలి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ–పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి.  

ఒత్తిడికి లోనుకావొద్దు
న్యూక్లియర్‌ ఫ్యామిలీలు, కెరీర్‌ ఆరాటాల వల్ల నగరంలో మానసిక ఒత్తిడి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.  ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుగా తలలోని భాగాలు, మెడ, భుజాలు బాగా ప్రభావితమవుతాయి. కనుక వీటికి సంబంధించిన  బ్రహ్మముద్రలు, చాలన తాలాసన, ఉత్థాన హస్తపాదాసన. మార్జాలాసన, అర్థ అధోముఖ, అధోముఖ శ్వానాసన, నిరాలంబాసన, ఉదరాకర్షణాసన, మకరాసన, శశాంకాసన.. వంటి తేలికపాటి ఆసనాలు రెగ్యులర్‌గా సాధన చేయడం ఉపకరిస్తుంది. ఆధునిక శాస్త్రం నెర్వ్‌ సెంటర్స్‌ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈ మూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు నిలబడి చేసేవి, కూర్చుని చేసేవి, పొట్ట మీద పడుకుని చేసేవి, వీపు మీద పడుకుని చేసేవి. తలకిందులుగా చేసేవి... ఈ 5 రకాల ఆసనాల శైలి విభిన్న ప్రయోజనాలు అందిస్తుంది.

కదలికలకు అనుగుణంగాఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి
ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు.  
ఆసనాలు వేసే ప్రదేశము చదునుగా ఉండాలి. స్వచ్ఛమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి.   తొలుత పొట్ట, మూత్రాశయము ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు.  
ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రంసాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు. కాబట్టి,
శక్తిని బట్టి చేయవచ్చు.  
ఆసనంలో ఉండే సమయం వృద్ధి చేసుకోవడానికి ఒకటి రెండు మూడు...పది అంటూ అంకెలు లెక్కపెట్టవచ్చు.  
ఆసనమైనా, ప్రాణయామమైనా...సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకూ సాగదీయగలరో అంతవరకే స్ట్రెచ్‌ చేయాలి.
శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి.      – డా. ఎ.ఎల్‌.వి.కుమార్, ట్రెడిషనల్‌ యోగా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top