3 ప్రాజెక్టులు.. 45 వేల ఎకరాలు

Soon Water for 45 thousand acres in Telangana

నేడు పాలేరు, పాలెంవాగు, కిన్నెరసానిల నుంచి నీటి విడుదల

ఖమ్మం, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో ప్రారంభించనున్న మంత్రులు హరీశ్, తుమ్మల

అనంతరం కూసుమంచిలో బహిరంగ సభ

సాక్షి, హైదరాబాద్ ‌: ఖమ్మం, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల పరిధిలో మూడు ప్రాజెక్టుల ద్వారా, 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. పాలేరు కాల్వ ఆధునీకరణ, పాలెంవాగు ప్రాజెక్టు, కిన్నెరసాని కాల్వల కింద నిర్మాణ పనులు పూర్తయిన దృష్ట్యా, వాటి కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కూసుమంచిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం వెళ్లనున్నారు.

పాలెంవాగు.. 10,132 ఎకరాలకు నీరు
పాలెంవాగు మధ్య తరహా ప్రాజెక్టును 2005లో రూ.70 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అయితే 2006 ఆగస్టులో ఒకసారి, 2008 ఆగస్టులో మరోసారి భారీ వర్షాలు, వరదలకు ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోయింది. నాసిరకపు నిర్మాణాలతోపాటు, ఇంజనీరింగ్, ఈపీసీ విధానాల లోపాల వల్ల ఈ ఘటనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2015 అక్టోబర్‌ 8న ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2017 మార్చిలో పాలెంవాగు పూర్తికి రూ.221.48 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. పాలెంవాగు పూర్తిస్థాయి సామర్థ్యం 1.26 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుతో వెంకటాపురం మండలంలో 32 గ్రామాలు, వాజేడు మండలంలో 7 గ్రామాల్లో 10,132 ఎకరాలకు సాగు నీరందనుంది.

కిన్నెరసాని.. 10 వేల ఎకరాలు..
దాదాపు పదకొండేళ్లుగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసుకొని కిన్నెరసాని ముస్తాబైంది. కిన్నెరసాని కింద 10 వేల ఎకరాల సాగు లక్ష్యం ఉన్నప్పటికీ కాల్వలు సరిగా లేక 2 వేల ఎకరాలకు కూడా నీరందడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్‌ కెనాల్‌కు 20.06 కిలోమీటర్ల పొడవునా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించారు. ప్రాజెక్టుతో కొత్తగూడెం నియోజకవర్గంలో కుడి కాల్వ నుంచి 3 వేల ఎకరాలు, లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి కొత్తగూడెంలో 2,100, పినపాకలో 4,900 ఎకరాలకు సాగు నీరు అందనుంది.  

నాలుగు నెలల్లోనే ‘పాలేరు’ ఆధునీకరణ
పాలేరు పాత కాల్వను 1922లో నిజాం ప్రభుత్వం నిర్మించగా, పూడిక, గుర్రపు డెక్క కారణంగా కాల్వ పూర్తిగా నిర్జీవంగా మారింది. ఈ కాల్వ ప్రవాహ సామర్థ్యం 250 క్యూసెక్కులు కాగా 150 క్యూసెక్కుల నీటి ప్రవాహం కూడా సాధ్యపడక, చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కాల్వల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు 2017 ఫిబ్రవరి 16న పాలేరు కాల్వ ఆధునీకరణ పనులకు మంత్రులు హరీశ్‌ రావు, తుమ్మల శంకుస్థాపన చేశారు.

ఆరు నెలల్లోనే కాల్వ లైనింగ్‌ పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పనుల్లో భాగంగా పూడిక, శిథిలాలను, బ్లాస్టింగ్‌ ద్వారా బండరాళ్లను తొలగించారు. పూర్తిగా శిథిలమైన 9 వంతెనలను తొలగించి డబుల్‌ లైన్‌ రోడ్‌ బ్రిడ్జిలను నిర్మించారు. కాల్వపై ఉన్న 32 తూములను పూర్తిగా తొలగించి కాంక్రీటుతో కొత్త తూములను నిర్మించి గేట్లు అమర్చారు. కాల్వ నీటి నిర్వహణ, పంపిణీ క్రమబద్ధీకరణ కోసం 2 క్రాస్‌ రెగ్యులేటర్లను నిర్మించారు. 3.9 కిలోమీటర్ల కాలువకు ఇరువైపులా కాంక్రీటుతో గోడలు నిర్మించారు. మొత్తం పనులను నాలుగు నెలల్లోనే పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top