మెట్రో కార్డులపై 10 శాతం రాయితీ

soon 2.5 lakh passingers estimated to travel in Metro rail - Sakshi

ప్రస్తుతం లక్ష..  భవిష్యత్తులో 2.5లక్షలు.. ప్రతిరోజూ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య ఇదీ..

ప్రస్తుతం నికరంగా రోజుకు లక్ష మంది మెట్రో జర్నీ

నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్లో 60 వేల మంది..

అమీర్‌పేట్‌–మియాపూర్‌ రూట్లో 40 వేల మంది రాకపోకలు

ఇప్పటి వరకూ నామమాత్రపు వేగంతోనే మెట్రో ప్రయాణం

కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నిబంధనల మేరకే రైళ్ల పరుగు

భవిష్యత్తులో రోజుకు 2.5 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా

ఈ లెక్క నిజం కావాలంటే.. రైళ్లు, బోగీలు, ట్రిప్పులు పెరగాలి

సాక్షి, హైదరాబాద్‌ :  లక్ష.. హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో ప్రస్తుతం నిత్యం ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఇదీ. అమీర్‌పేట్‌–మియాపూర్‌(13 కిలోమీటర్లు), నాగోలు–అమీర్‌పేట్‌(17 కిలోమీటర్లు) రూట్లలో ప్రస్తుతం ఒక్కో మార్గంలో ఏడు చొప్పున మొత్తం 14 రైళ్లు తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నాగోల్‌–అమీర్‌పేట్‌ మార్గంలో ప్రతి 16 నిమిషాలకు ఓ రైలు నడుపుతుండగా.. రోజూ సగటున 60 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఇక మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంది. ఈ రూట్లో నిత్యం సరాసరిన 40 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో నిత్యం 2.5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చని మెట్రో అధికారుల అంచనా. అయితే ఈ లెక్క నిజం కావాలంటే.. మెట్రో రైళ్లతో పాటు ట్రిప్పుల సంఖ్య సైతం పెరగాల్సి ఉంటుంది. అదే సమయంలో రైలు ఫ్రీక్వెన్సీ సమయాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం నామమాత్రపు వేగంతోనే..
మెట్రో రైళ్లు వారం రోజులుగా నామమాత్రపు వేగంతోనే పరుగులు పెడుతున్నాయి. మెట్రో గరిష్ట వేగం 80 కేఎంపీహెచ్‌ అయినప్పటికీ.. ప్రస్తుతం సగటున 33–50 కేఎంపీహెచ్‌ వేగంతో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. వారం రోజులుగా నాగోల్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ.) మార్గంలో మెట్రో జర్నీకి 45–50 నిమిషాల సమయం పడుతోందని, విలువైన సమయం వృథా అవుతోందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రూట్లో మెట్రో అధికారులు ముందుగా ప్రకటించిన సమయం 25 నిమిషాలు మాత్రమే. ఇక మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో జర్నీకి 25 నిమిషాల సమయం పడుతోంది. అయితే కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నిబంధనల ప్రకారం మరో నెల పాటు నామమాత్రపు వేగంతోనే రైళ్లను నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నాగోల్‌–అమీర్‌పేట్‌ మార్గంలోని 14 స్టేషన్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రయాణికులు టికెట్ల కొనుగోలు.. ఎస్కలేటర్లపై పయనం.. బోగీలోకి ఎలాంటి ఆటంకాలు.. తొందరపాటు లేకుండా ప్రవేశించేందుకు పలు స్టేషన్లలో నిమిషం పాటు రైళ్లను నిలుపుతున్నారు. నగరవాసులకు మెట్రో ప్రయాణం అలవాటయ్యే వరకు ఎక్కువ సమయం రైళ్లను నిలుపుతున్నామని, క్రమంగా రైలు వేగం పెంచుతామని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

మెట్రో కార్డులపై 10 శాతం రాయితీ
మెట్రో స్మార్ట్‌ కార్డు వినియోగదారులకు ఎల్‌అండ్‌టీ సంస్థ 10 శాతం రాయితీని ప్రకటించింది. మార్చి 31, 2018 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని, పేటీఎం ద్వారా తొలిసారి రీచార్జ్‌కు రూ.100, ఆపైన రీచార్జ్‌ చేసుకుంటే రూ.20 క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని తెలిపింది. స్టేషన్‌లోని టికెటింగ్‌ కార్యాలయాల నుంచి స్మార్ట్‌ కార్డులు కొనుగోలు చేయడంతోపాటు ఏదైనా మెట్రో స్టేషన్‌లో వాటిని రీచార్జ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. టీ సవారీ యాప్, పేటీఎం, హెచ్‌ఎంఆర్‌ ప్యాసింజర్‌ వెబ్‌సైట్, స్టేషన్‌ పెయిడ్‌ ఏరియాలోని యాడ్‌ వాల్యూ మెషీన్‌ ఉపయోగించి స్మార్ట్‌ కార్డులను రీచార్జ్‌ చేసుకోవచ్చని తెలిపింది. రైళ్లలో ప్రయాణించేందుకు స్మార్ట్‌కార్డు లేదా టోకెన్‌ను ప్రజలు వినియోగించాలని, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు స్మార్ట్‌కార్డులను వినియోగించాలని కోరింది. ఇక ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) వ్యవస్థ పనితీరు పరీక్షించేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ బృందం ఫేక్‌ టోకెన్స్‌ను టెస్ట్‌ టోకెన్స్‌గా వినియోగిస్తుంది. ఇవి ఒరిజినల్‌ టోకెన్స్‌తో కలసి ఉంటాయి. వీటిని తర్వాత కాలంలో సిస్టమ్‌ నుంచి తొలగిస్తారు.

2.5 లక్షల మంది ప్రయాణించాలంటే..
మెట్రో రైళ్లలో నిత్యం 2.5 లక్షల మంది ప్రయాణిస్తారని ప్రారంభానికి ముందు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం తొలి దశ మార్గాల్లో (30 కి.మీ.) సాధారణ రోజుల్లో నిత్యం నికరంగా లక్ష మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. వీకెండ్‌లో రద్దీ 2 నుంచి 2.5 లక్షలుగా ఉంది. అధికారుల అంచనా మేరకు నిత్యం 2.5 లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించాలంటే.. రైళ్ల సంఖ్యను 14 నుంచి 20కి పెంచాలి. అలాగే బోగీల సంఖ్యతో పాటు ట్రిప్పుల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. మరోవైపు నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్లో ప్రస్తుతం 16 నిమిషాలు ఉన్న రైలు ఫ్రీక్వెన్సీని 8 నిమిషాలకు తగ్గించాల్సి ఉంటుంది. అమీర్‌పేట్‌–మియాపూర్‌ రూట్లో ప్రస్తుతం 8 నిమిషాలకు ఓ రైలు నడుపుతుండగా దీనిని 5 నిమిషాలకు తగ్గించాల్సి ఉంటుంది.

స్లో జర్నీకి సాంకేతిక కారణాలు సైతం..
నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్టుగూడా వరకు(8 కి.మీ. మార్గంలో) ఆటోమేటిక్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ(డ్రైవర్‌ అవసరం లేని సాంకేతికత) ఆధారంగా రైళ్లను నడుపుతున్నారు. అక్కడి నుంచి అమీర్‌పేట్‌ వరకు మాన్యువల్‌ అంటే లోకోపైలెట్‌ సహాయంతో రైళ్లను నడుపుతున్నారు. ఈ మార్గానికి సంబంధించి ఇటీవలే కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నుంచి భద్రతా ధ్రువీకరణ లభించడంతో మరో నెల రోజులు నామమాత్రపు వేగంతో రైళ్లు నడుపుతామని మెట్రో అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top